ఇద్దరు దొంగలు..రెండు కేసులు! | Shankar Math Robbery Case Reveals | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగలు..రెండు కేసులు!

Published Mon, May 20 2019 8:45 AM | Last Updated on Mon, May 20 2019 8:45 AM

Shankar Math Robbery Case Reveals - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో:  నల్లకుంట శంకర్‌మఠ్‌లో జరిగిన చోరీ ఇంటి దొంగ రాళ్ళబండి నాగ సాయిరాం పనిగా తేలింది. అదే ఠాణా పరిధిలోని కేశవులు ఇంట్లో దొంగతనం చేసింది అతడి స్నేహితుడు సుంకి రాముగా గుర్తించారు. తక్కువ కాలంలోనే ఈ రెండు కేసుల్నీ ఛేదించిన నల్లకుంట పోలీసులు  ఇద్దరినీ అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదివారం తెలిపారు. వీరిద్దరి నుంచి దాదాపు రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్, కాచిగూడ ఏసీపీ ఎస్‌.సుధాకర్‌లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 

అమ్మవారి చీర కోసం బంగారం సమీకరిస్తే...
శంకర్‌మఠ్‌లోని శారద మాతకు బంగారు పట్టు చీర చేయించాలని నిర్వాహకులు నిర్ణయించారు. దీనికోసం కొన్నాళ్ళుగా పసిడి సమీకరిస్తూ మఠంలోని పరిపాలన విభాగం కార్యాయంలో భద్రపరుస్తున్నారు. 5, 10, 15 గ్రాముల బరువు ఉండే నాణేల రూపంలో భక్తుల నుంచి స్వీకరిస్తున్న ఈ బంగారాన్ని మేనేజర్‌ తన కార్యాలయంలో ఉన్న చెక్క బీరువాలో భద్రపరుస్తున్నారు. ఖమ్మం జిల్లా మథిరకు చెందిన రాళ్ళబండి నాగ సాయిరామ్‌ ఇదే కార్యాలయంలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మేనేజర్‌ తన చెక్క బీరువా తాళాలను కార్యాలయంలో వదిలి వెళ్తుండటం, బంగారు పట్టుచీర కోసం సమీకరిస్తున్న బంగారం అందులోనే ఉన్న విషయం తెలిసిన సాయిరామ్‌ దానిపై కన్నేశాడు. అదును చూసుకుని బీరువా తాళం తీస్తూ అందులో ఉన్న బంగారు నాణేలు ఒక్కొక్కటిగా తస్కరించడం మొదలెట్టాడు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి గత వారం వరకు ఇలా మొత్తం 25 నాణాలు దొంగిలించారు. గత వారం బంగారు నాణేలను లెక్కించిన మేనేజర్‌ మొత్తం 250 గ్రాముల బరువుతో కూడినవి పోయినట్లు తేల్చారు. దీనిపై గురువారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు పరారీలో ఉన్న సాయిరామ్‌ ఈ పని చేసినట్లు గుర్తించారు. ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన బృందం 48 గంటల్లో పట్టుకుని నాణాలను యథాతధంగా రికవరీ చేసింది. వీటి గురించి సాయిరామ్‌ అసలు విషయం చెప్పకుండా ఓ మహిళ వద్ద దాచి ఉంచాడు.

మద్యం మత్తులో నోరు జారితే...
నల్లకుంట టీఆర్టీ కాలనీలో నివసించే కేశవులు ఇంట్లో అతడి స్నేహితుడు సంకి రాము దొంగతనానికి పాల్పడ్డాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగుతున్నప్పుడు ఆ మత్తులో కేశవులు చెప్పిన విషయాలే దీనికి ఆధారమయ్యాయి. కేశవులు, అంబర్‌పేటకు చెందిన దినసరి కూలీ సంకి రాము స్నేహితులు. వీరు నిత్యం కలిసి మద్యం తాగుతూ ఉంటారు. ఆ మత్తులో కేశవులు అవసరమైన, అవసరంలేని విషయాలు మాట్లాడేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం ఇద్దరూ కలిసి మద్యం తాగుతుండగా కేశవులు ‘నోరు విప్పాడు’. తన ఇంట్లో ఎంత బంగారం, వెండి ఉన్నాయి? అవి ఎక్కడ ఉంటాయి? తాము బయటకు వెళ్తే బీరువా/ఇంటి తాళాలు ఎక్కడ పెడతాము? ఇలాంటి విషయాలన్నీ బయటపెట్టేశాడు. ఇది విన్న రాముకు ఆ సొత్తుపై కన్ను పడింది.

అప్పటి నుంచి అదును కోసం ఎదురు చూసిన ఇతగాడు గత బుధవారం కేశవులు ఫ్యామిలీతో సహా బయటకు వెళ్తున్నట్లు తెలుసుకున్నాడు. ఆ రోజే అతడి ఇంటి వద్దకు వెళ్ళిన రాము తాళాలు తీసి బీరువాలో ఉన్న 90 గ్రాముల బంగారం, 192 గ్రాముల వెండి ఆభరణాలు తీసుకుని ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నల్లకుంట పోలీసులు ప్రాథమికంగా పరిచయస్తుల పనిగా గుర్తించారు. కేశవులు ద్వారా అతడి స్నేహితులు, ఇంటికి రాకపోకలు సాగించే వారి వివరాలు సేకరించారు. వీటికి తోడు వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించి రాము నిందితుడిగా తేల్చారు. అతడి కోసం గాలించిన బృందం శనివారం పట్టుకుని సొత్తు రికవరీ చేసింది. 

సిబ్బందిని అభినందించిన కొత్వాల్‌...
ఈ రెండు కేసుల్నీ నల్లకుంట పోలీసులు తక్కువ సమయంలో ఛేదించారు. ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌ పర్యవేక్షణలో అదనపు ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు నేతృత్వంలో డీఎస్సై ఎస్‌.కోటేశ్వరరావు తన బృందంతో ఈ కేసుల్ని దర్యాప్తు చేశారు. ఈ కేసుల చిక్కుముడులు విప్పిన నల్లకుంట పోలీసుల్ని నగర పోలీసులు కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement