ధరల మంట
కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏది కొనాలన్నా 30 రూపాయలకు పైగా వెచ్చించాల్సిందే. కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చొన్న బీన్స్ ధర కిందికి దిగిరానంటోంది. మొన్నటిదాకా 30 రూపాయలూ పలకని మునక్కాయ ధర ఇప్పుడు ఏకంగా 70 రూపాయలకు పైగా పలుకుతోంది. పచ్చిమిర్చి మరింత మంటెక్కిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
పలమనేరు : కూరగాయల ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. అన్నిరకాల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మంచి కూర వండుకోవాలంటే గగనంగా మారింది. పలమనేరు పట్టణంలోని హోల్‌సేల్, రీటైల్ మార్కెట్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. కనీసం వారపుసంతలోనైనా కొంత తక్కువ ధరకు దొరుకుతాయేమోనని జనం భావించారు.
అయితే పట్టణంలో శుక్రవారం జరిగిన వారపు సంతలోనూ వ్యాపారులంతా ఒక్కటై అన్ని దుకాణాల్లోనూ ఒకే ధర ఉండేలా చూశారు. ఇలా అయితే కూరగాయలు కొనే పరిస్థితి లేదని సంతకొచ్చిన పలువురు బహిరంగంగానే నోరెళ్లబెట్టారు. ధరల క్రమబద్ధీకరణ గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో వ్యాపారులు ఇస్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారని వాపోయారు.