ఇంకా ’వెలగ’బెడుతున్న భూదందాలు | Velagapudi Ramakrishnababus Followers Follow Rampant Scandals Rowdyism | Sakshi
Sakshi News home page

ఇంకా ’వెలగ’బెడుతున్న భూదందాలు

Published Mon, Jul 8 2019 7:09 AM | Last Updated on Tue, Jul 9 2019 11:57 AM

Velagapudi Ramakrishnababus Followers Follow Rampant Scandals Rowdyism - Sakshi

మధురవాడ సర్వే నెంబర్‌ 2లో వెలగపూడి అనుచరుల కబ్జాలో ఉన్న భూమి 

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అడ్డగోలు భూదందాలు, కుంభకోణాలు, రౌడీయిజంతో నానాయాగీ చేసిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరులు ఇప్పుడు కూడా ఆయన్ని అడ్డుపెట్టుకుని విలువైన భూములు చెరపడుతున్నారు.మధురవాడలో సుమారు ఆరు కోట్ల విలువైన భూమికి టెండర్‌ పెట్టారు. పక్కా పత్రాలతో భూ హక్కుదారుడైన దళితునిపై దౌర్జన్యం చేసి... ఆ స్థలంలో అడుగుపెట్టకుండా దౌర్జన్యం చేస్తున్నారు.వాస్తవానికి ఏడు నెలల కితం నుంచి వివాదంలో ఉన్న భూ వ్యవహారం ఇప్పుడు కొలిక్కి వస్తుందని ఆశించిన బాధితులకు తాజాగా కూడా వెలగపూడి వర్గీయుల నుంచి బెదిరింపులు రావడం, తాము కొనుగోలు చేసిన భూమిలోకి రాకుండా దందా చేయడం... వరుస పరిణామాలు ’తూర్పు’న వెలగపూడి మార్కు దారుణాలను, రౌడీయిజాన్ని స్పష్టం చేస్తున్నాయనే చెప్పాలి.
 – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రియల్‌ బూమ్‌ విపరీతంగా ఉండే మధురవాడలోని సర్వే నెం 2లో 2305 గజాల స్థలాన్ని పూసపాటి లక్ష్మీనరసింహరాజు నుంచి గుంటూరు జిల్లాకు చెందిన అవుతు రాజారెడ్డి కొనుగోలు చేశారు. రాజారెడ్డి నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు వందాన వెంకటరావు గతేడాది 2018 నవంబర్‌ 4వ తేదీన సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఆ మేరకు అదే నెల 12వ తేదీన వెంకటరావు స్థలంలోకి ప్రవేశించి.. స్థలంలోని పిచ్చిమొక్కలను కూలీలతో తీయిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో వెలగపూడి అనుచరులు చేరుకున్నారు.

వెలగపూడికి చెందిన వాహనంలోనే ఆయన సన్నిహితులు మండవ శివప్రసాద్‌ అలియాస్‌ సోనా ప్రసాద్, రామనాధబాబు తదితరులు పెద్దసంఖ్యలో అనుచరులతో వచ్చి హల్‌చల్‌ చేశారు. ఆ స్థలం మాది.. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటూ దౌర్జన్యానికి దిగారు. తాను అగ్రిమెంట్‌ ద్వారా కొనుగోలు చేశానని, పక్కా ఆధారాలున్నాయని వెంకటరావు మొత్తుకున్నా వినలేదు. ఆ స్థలం మాదేనని గదమాయించారు. ‘మీ వద్దనున్న ఆధారాలు చూపించాలని, సర్వే నెంబర్‌ 2లో మా పట్టా నెం 585 అని, ఒకవేళ పట్టా నెంబర్లలో తేడాలుంటే సరిచూసుకుందామని’ వెంకటరావు అభ్యర్థించినా లెక్క చేయలేదు. నీ స్థాయెంత.. నువ్వెంత... మేము నీకు భూ పత్రాలు చూపించాలా అని లెక్క లేకుండా మాట్లాడారు. 

మహిళా కూలీలపై దాడి
మొక్కలు తొలగించే పని చేస్తున్న మహిళా కూలీలు రాగిణి, లక్ష్మిలపై దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలవడంతో బాధితులు అదే రోజు కేజీహెచ్‌లో చేరి చికిత్స పొందారు. ఇక దాడి చేస్తుండగా అడ్డొచ్చిన భూ హక్కుదారుడైన వందాన వెంకటరావును కులం పేరుతో దూషించారు. ఈ మేరకు పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తదనంతరం కేసు (ఎఫ్‌ఐఆర్‌ 558, 559)ను ఎస్సీ ఎస్టీ సెల్‌ ఏసీపీకి బదిలీ చేశారు. అంతే.. అక్కడితో కేసు అటకెక్కింది.

ఎన్నిమార్లు తిరిగినా పోలీసులు కేసు విషయం తేల్చలేదు. ఇటు వెలగపూడి అనుచరులు వీరిని స్థలంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటూ వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు నివేదించగా, కమిషన్‌ సభ్యుడైన రాముడు వచ్చి... స్వయంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా ఎన్నికలు రావడం, టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. ఇటీవలే భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా మళ్లీ వెలగపూడి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో న్యాయం కోసం ‘స్పందన’లో ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

దళితుడిననే దౌర్జన్యం : వందాన వెంకటరావు
వెలగపూడి రామకృష్ణబాబుకు అత్యంత సన్నిహితులైన సోనాబాబు, పరుచూరి రామనాధబాబు తదితరులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిలోకి నన్ను అడుగుపెట్టకుండా చేస్తున్నారు. ఆ భూమి మార్కెట్‌ విలువ ఇప్పుడు సుమారు ఆరుకోట్ల వరకు ఉంది. నా వద్ద అన్ని పత్రాలూ ఉన్నాయి. వాళ్ల వద్ద కూడా ఉన్నాయని అంటున్నారు.  పోనీ సర్వే చేయించుకుందాం... అని ఎన్నిమార్లు చెప్పినా లెక్క చేయడం లేదు. కేవలం నేను దళితుడనే వాళ్లు లెక్క చేయడం లేదని నేను అనుకుంటున్నాను. దళితులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయకూడదా... విలువైన భూములు కొనుగోలు చేయకూడదా... వెలగపూడి అనుచరుల అహం, దౌర్జన్యం చూస్తుంటే అలానే ఉంది.. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement