
మాట్లాడుతున్న వెలంపల్లి
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ) : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండో అతి పెద్ద ఆలయంగా ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పవిత్రతను తెలుగుదేశం పార్టీ కాలరాస్తుందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. వన్‌టౌన్‌లోని ఆయన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉంటున్న బుద్దా వెంకన్న హిందువుల ఆలయాల్లో దోపిడీకి పాల్పడుతుంటే, స్థానిక ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మైనార్టీ ఆస్తులను దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని అదుపు చేయాలంటే ఎక్కడ తన క్షుద్ర పూజల వ్యవహారం బయటపడుతుందోననే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు.
ఆదివారం శొంఠి పద్మజ అనే మహిళ మదనపల్లిలో ప్రత్యేకంగా నేయించిన 18 వేల విలువైన చీరను అమ్మవారికి బహూకరించారన్నారు. ఆ చీర అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఉంచారని, అలా ఉంచిన కాసేపటికే అది మాయమైందన్నారు. ఆ విషయాన్ని పాలకమండలి, అధికారులు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. చీరను దొంగిలించిన సన్నివేశాలు సీసీ పుటేజ్‌ల నుంచి తొలగించడంలో పాలకమండలి బంధువు హస్తం ఉందన్నారు. చీరదొంగతనం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలకవర్గ సభ్యురాలు సూర్యలత తన ఇంట్లో వస్త్ర దుకాణం నిర్వహిస్తుండటం వలన ఆ చీర అక్కడకు చేరి ఉంటుందని వెలంపల్లి అనుమానం వ్యక్తం చేశారు. దుర్గగుడిపై జరుగుతున్న అవినీతి వెనుక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హస్తం ఉందన్నారు. జుమ్మా మసీదు లీజు రద్దు చేస్తానని జలీల్‌ఖాన్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment