
'ప్రత్యేక హోదాపై వెంకయ్య మాట మార్చారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై పోరాడతామని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటమార్చడం తగదని ఆయన హితవు పలికారు. విభటన సమయంలో చట్టంలోని అన్ని అంశాలకు పార్లమెంట్ లో బీజేపీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు.
బీజేపీ 8 నెలల పాలనలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ఢిల్లీ ఎన్నికలే దీనికి నిదర్శనమన్నారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల లబ్దికోసం భూసేకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముందుగా బీజేపీయే లేఖ ఇచ్చిందని, చిట్టచివరిగా లేఖ ఇచ్చింది కాంగ్రెసేనని దిగ్విజయ్ సింగ్ అన్నారు.