ఉపమాక వెంకన్న ఆలయ బకాయిలు చెల్లించని టీటీడీ
సిబ్బంది జీతాలకూ అదే పరిస్థితి
నక్కపల్లి: ఉపమాక వెంకన్న ఆలయంలో అర్చకులు, సిబ్బందికి బకాయి వేతనాలను టీటీడీ ఇప్పటికీ చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఆలయ ఆస్తులు, సిబ్బంది, నిర్వహణ టీటీడీ పరిధిలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచాయి. గత ఏడాది నవంబరు 18న ఉపమాక వెంకన్న ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటికి ఆలయ నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, స్వామివారి కైంకర్యాల నిర్వహణ కోసం దేవాదాయశాఖ చెల్లించాల్సిన బకాయిల వివరాలను ఆలయ ఈవో శేఖర్ టీటీడీ అధికారులకు అందజే శారు.
వేతనాల్లో కోత
సెక్యూరిటీ గార్డులకు 4నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలు చెల్లించకపోగా సిబ్బంది జీతాల్లోంచి కోత విధిస్తున్నారంటూ సిబ్బంది వాపోయారు. ఆలయంలో అర్చకుడు, జూనియర్ అసిస్టెంట్, , ఇద్దరు సన్నాయిమేళం సిబ్బంది రెగ్యులర్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరు టీటీడీ ఉద్యోగులుగా పరిగణనలోకి వస్తారు. అర్చకుడి జీతం నుంచి నెలకు రూ.3,500, గుమస్తాజీతం నుంచి 4వేలు, సన్నాయిమేళం వారి నుంచి రూ.1500 చొప్పున కోత విధించి చెల్లిస్తున్నారని, ఇలా దేనికి తగ్గిస్తున్నారో చెప్పడం లేదని వారు తెలిపారు.
కనీస వేతనాలు కరువు
టీటీడీ పరిధిలో సిబ్బందికి రెగ్యులర్ అయినా, కాకపోయినా కనీస వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ టీటీడీ నిబంధనలు అమలు కావడంలేదు. ఎన్‌ఎంఆర్‌లుగా అర్చకుడు, వంటస్వామి, అన్నదానం వంటస్వామి, పోటు సహాయకుడు, ముగ్గురు స్వీపర్లు, ముగ్గురు భజంత్రీలు, వాచ్‌గార్డు, అటెండరు, గోవుల కాపరి పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు చెల్లించడం లేదు. టీటీడీ స్వాధీనం చేసుక్ను తర్వాత నియమించిన ఇద్దరు సిబ్బందికి కనీస వేతనాలు చెల్లిస్తున్నా దేవాదాయశాఖ నుంచి టీటీడీ పరిధిలోకి వచ్చినవారికి మాత్రం అరకొర వేతనాలే చెల్లిస్తున్నారు. ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటే తమకు వేతనాలు బాగుంటాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్ శర్మను వివరణ కోరగా ఈ వ్యవహారం తన పరిధిలోనిది కాదని, జేఈవో, ఈవోలే చూడాలన్నారు.
బకాయిలివీ
అర్చకులు, సన్నాయి మేళం, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.6.24లక్షల బకాయిలు చెల్లించాలి. స్వామి వారి నివేదన కోసం కొనుగోలు చేసిన బియ్యానికి రూ.1.32లక్షలు, కిరాణా సరకులకు రూ.1.68లక్షలు, గ్యాస్‌కు రూ.74వేలు చెల్లించాల్సి ఉంది. స్వామివారి నిత్య అలంకరణకు ఉపయోగించే చీర, ధోవతి, కండువాల కోసం అనకాపల్లి గుంటూరు చేనేత వస్త్రాలయం వారికి రూ.59వేలు, కల్యాణోత్సవాల్లో ఆలయానికి వేసిన రంగుల కోసం రూ.23వేలు, స్వామికి అలంకరించిన పూలమాలల కోసం రూ.420 బకాయిలున్నాయి. వెర సి సుమారు రూ.11లక్షల వరకు బకాయిలు చెల్లించాలి.