వెంకయ్య అనుభవానికి సరైన పదవి
- వైఎస్సార్ సీపీ ఎంపీల హర్షం
- వెంకయ్య ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు
- పార్టీ తరపున ఆయనకు సంపూర్ణ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, బుట్టా రేణుక మంగళవారం వెంకయ్యను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. వెంకయ్య అపారమైన అనుభవానికి సరైన పదవి దక్కనుందని పేర్కొన్నారు. ఇది తెలుగు ప్రజలందరికీ హర్షదాయకమని, ఆయనకు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి మీడియాతో మాట్లాడారు. వెంకయ్యతో తనకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉందన్నారు.
1978లో వెంకయ్య నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి పోటీ చేసినప్పుడు తమ తండ్రి పూర్తి మద్దతు ప్రకటించి ఆయనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో వెంకయ్య మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని మేకపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకయ్య ఏ పదవిలో ఉన్నా ఏపీ, తెలంగాణ ఆభివృద్ధి విషయంలో ముందుం టారని వైవీ సుబ్బారెడ్డి కితాబిచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులకు పోటీ వద్దని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు..
ఎన్నో పదవులు చేపట్టిన వెంకయ్య ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా తన బాధ్యతలను సమర్థంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్షాలను కలుపుకొనిపోయి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని నమ్ముతు న్నామన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో తాను పీజీ చదివే రోజుల్లో వెంకయ్య విద్యార్థి సంఘానికి నాయకుడిగా వ్యవహరించేవారని వరప్రసాదరావు గుర్తు చేసుకున్నారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవమని బుట్టా రేణుక చెప్పారు.