అర్హత ఉన్నా తమకు స్థలాలు ఇవ్వలేదంటున్న బీసీ కాలనీ వాసులు
బుక్కపట్నం: మండల కేంద్రమైన కొత్తచెరువులో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెనుకొండ రోడ్డు వైపు, ఆర్డీటీ కార్యాలయం ఎదురుగా ఉన్న 14 ఎకరాల వేణుగోపాల స్వామి మాన్యం భూమిని ఇందిరమ్మ గృహాల కోసం కేటాయించారు. అక్కడ సుమారు 700 మందికి పట్టాలిచ్చారు. అయితే 2014లో టీడీపీఅధికారంలోకి రాగానే తెలుగుతమ్ముళ్లు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి లబ్ధిదారులకు ఒకటిన్నర సెంటు మాత్రమే ఇచ్చారనీ, అంత తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు కట్టడం సాధ్యంకాదంటూ మొత్తం పట్టాలు రద్దు చేయించారు. అనంతరం అర్హతతో సంబంధం లేకుండా టీడీపీకి అనుకూలంగా ఉన్న 534 మందికి తాజాగా పట్టాలిచ్చారు. దీంతో అన్ని అర్హతలు ఉండి గుడిసెల్లో బతుకుతున్న వందల మందికి అన్యాయం జరిగింది.
మరోవైపు టీడీపీ నేతల నుంచి పట్టాలు పొందిన అనేక మంది సెంటు స్థలాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదించారు. పలుకుబడి కలిగిన మరికొంతమంది టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక్కొక్కరు 3, 4 పట్టాలు పొంది అక్కడ ఎన్టీఆర్ సౌదాలు నిర్మించుకున్నారు. పంచాయతీకి కేటాయించిన స్థలాలను కూడా ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.2 కోట్లు చేతులు మారిన ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ టీడీపీ నేత, ఓ మాజీ విలేకరి పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. సదరు మాజీ విలేకరి ఏకంగా 8 సెంట్లలో ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకుంటున్నాడు.
ఫేస్‌బుక్‌లో హల్‌చల్
స్థానిక టీడీపీ నాయకుల అవినీతిని అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ నారాయణ, ఆయన కుమారుడు విజయ్ ఫేస్‌బుక్ వేదికగా పోస్టులు పెడుతూ ఎండగట్టారు. నిరుపేదలను రోడ్డుపాలు చేయడం తగదంటూ టీడీపీ నేతలకు హితవు పలికారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
మరోవైపు ఇళ్లల çపట్టాల మంజూరులో భారీ అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని టీడీపీ జిల్లా నాయకుడు దాల్‌మాల్ సూరి, మాజీ సర్పంచ్ శివ, మాజీ ఎంపీపీ నారాయణ, విజయ్‌కుమార్ తదితరులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
పట్టాల పంపిణీలో జరుగుతున్న అక్రమాల గురించి 2017 సెప్టెంబర్‌లోనే ‘సాక్షి’ ఓ కథనం ప్రచురించింది. టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిని ఎండగట్టింది. ఇప్పుడు అదే విషయాన్ని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment