అవినీతిలో వెరీ‘గుడ్డు’
త్రీ సంక్షేమ శాఖలో కొను‘గోల్‌మాల్’
గువ్వగుడ్లను పోలిన నాసిరకం కోడిగుడ్లే సరఫరా
గుడ్డు 30గ్రాములకు మించడం లేదు
కాంట్రాక్టర్లకు దాసోహం
కమీషన్ల కక్కుర్తి లక్షల్లోనే
స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలో కోడిగుడ్లకొనుగోళ్లు సీడీపీవోలకు సిరులు కురిపిస్తున్నాయి. నాణ్యతలేని గుడ్లను కొనుగోలు చేసి అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నారు. పేదవాళ్ల నోరు కొడుతున్నారు. చిత్తూరు(గిరింపేట),
న్యూస్‌లైన్:జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలో 3,640 అంగన్‌వాడీలు, 976 మినీ అంగన్‌వాడీలు ఉన్నారుు. వీటిలో మహిళలు, పిల్లలు, యుక్త వయసున్న బాలి కల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపడుతోంది. వాటిలో మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ అమృత హస్తం, సబల (కిశోర బాలికా సంరక్షణ పథకం), గర్భిణులకు పౌష్టికాహారం పథకాలు ప్రధానమైనవి. ఇంది రమ్మ అమృతహస్తం పథకం తప్ప మిగిలిన వాటికి సీడీపీవోలే కోడిగుడ్లను స్థానికంగా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో 3-6 ఏళ్ల లోపున్న పిల్లలు 87,277 మంది లబ్ధిపొందుతున్నారు. వీరికి వారానికి నాలుగు చొప్పున ఏడాదికి 1.67 కోట్ల కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారు. సబల పథకం కింద 11 నుంచి 14 ఏళ్లలోపు బడిమానేసిన, 15 నుంచి 18 ఏళ్లలోపున్న కిషోరబాలికలు 91,181 మంది ఉన్నారు. వీరికి కూడా వారానికి నాలుగు గుడ్లు చొప్పున నెలకు 16 ప్రకారం ఏడాదికి 1.76 కోట్ల కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నారు. ఇందిరమ్మ అమృతహస్తం కింద పది ప్రాజెక్టుల పరిధిలో 32,774 మంది లబ్ధిదారులున్నారు.
వీరికి రోజూ ఒక గుడ్డు చొప్పున ఏడాదికి 1.18 కోట్ల కోడిగుడ్లను అందిస్తున్నారు. ఇవిమాత్రం స్థానికంగా ఉన్న మహిళా సంఘాలకు చెందిన వీవోలు కొనుగోలు చేస్తున్నారు. ఇవికూడా నాసిరకంగానే ఉంటున్నాయి. గర్భిణుల సంరక్షణ పథకం కింద మిగిలిన 11 ప్రాజెక్టుల పరిధిలో 29,349 మంది లబ్ధిదారులున్నారు. వీరికి కూడా నెలకు 30 చొప్పున ఏడాదికి 360 ప్రకారం 1.06 కోట్ల కోడిగుడ్లను సీడీపీవోలే కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు.
జిల్లా కమిటీ నిర్ధేశించిన ప్రకారం 50 గ్రాములకు తక్కువగా లేని కోడిగుడ్లను 3.5 పైసలకు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. అది జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. కనీసం 30 గ్రాముల బరువుకూడా లేని నాసిరకం గుడ్లనే కొనుగోలు చేసి వాటినే పంపిణీ చేస్తున్నారు. ఈ కొనుగోళ్లలో లక్షలాది రూపాయల కమీషన్లు చేతులు మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని పథకాలకు కలిపి 5.66కోట్ల కోడిగుడ్లను కాంట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు.
జిల్లాలో పనిచేసే 21 మంది సీడీపీవోల్లో అత్యధికమంది ఆయా ప్రాంతాలకు చెందినవారే కావడంతో కాంట్రాక్టర్లతో లాలూచీ పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇదేమని ప్రశ్నించే అంగన్‌వాడీలపై కక్షగట్టడం, లబ్ధిదారులైతే ఏదోఒక విధంగా నోరునొక్కేయడం లాంటివి చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నా రుు. ఈ ఏడాదికి సంబంధించి కాంట్రాక్ట్‌కు గడువు మరో నెలమాత్రమే ఉంది. నాణ్యతను పాటించకపోతే వారి కాంట్రాక్టును రద్దుచేసే అధికారం ఐసీడీఎస్ పీడీకి ఉంది. ఇప్పటివరకు అలాంటి దాఖలాలు లేవు.