ఆపదలో రేపటి అమ్మలు | Victims of Saturday's mamas | Sakshi
Sakshi News home page

ఆపదలో రేపటి అమ్మలు

Published Sat, Nov 22 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

ఆపదలో రేపటి అమ్మలు

ఆపదలో రేపటి అమ్మలు

సాక్షి, కర్నూలు : కాబోయే అమ్మలు ఆపదలో ఉన్నారు. మాతృమూర్తిగా మారే తరుణంలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు కారణాలు పేదరికం, అవగాహన లేమి, వైద్య సిబ్బంది పర్యవేక్షణ లోపం. జిల్లా వ్యాప్తంగా పరిశీలనతో వెలుగు చూసిన అంకెలు చెబుతున్న విస్తుపోయే నిజాలివి. మాతశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అవగాహన లోపం వెరసి కాబోయే అమ్మలకు ముప్పు వాటిల్లుతోంది. గర్భిణులు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు.

మరికొందరు రోగాలతో బాధపడుతూ దయనీయ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ఆయా పేద కుటుంబాల్లో ఆందోళన తప్పడం లేదు. ఇటీవల నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సందర్భంగా వైద్య బృందాలు గ్రామాల్లో 1,161 శిబిరాలను నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా 1,11,345 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ఇందులో 6,500 మంది గర్భిణులను వైద్య సిబ్బంది పరీక్షించారు. ఇందులో 2,585 మంది షోషకాహార, హైరిస్క్(ప్రమాద లక్షణాలు)తో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇవి అధికారుల ప్రాథమిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఓ అంచనా. ఈ స్థితిని గమనిస్తే జిల్లాలో గర్భిణుల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది.

ఎందుకు ఇలా?
 జిల్లా వ్యాప్తంగా సుమారు 3,462 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. మరో విభాగం ద్వారా 100 వరకు పౌష్టికాహార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, కేంద్రాలుఆపదలో రేపటి అమ్మలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి కారణాలతో పౌష్టికాహార పంపిణీ మొక్కుబడిగా మారుతోందని అవగతం అవుతోంది.

 ఇలా చేయాలి?
 ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలి. వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారంతోపాటు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. వీరంతా ఆసుపత్రులకు వచ్చే విధంగా చైతన్యం చేయాలి. లోపాలను గుర్తించి అవసరమైన మందులను అందించాలి. గర్భిణులకు నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకూ మూడు విడతలుగా 100 ఐరన్ మాత్రలు అందజేయాలి. వారిలో రక్తహీనతను నివారించాలి. రక్తహీనత ఉన్నవారికి 200 మాత్రలు ఇవ్వాలి.

ప్రతి గర్భిణి ప్రసవం సమయానికి కనీసం 10 కిలోల బరువు పెరిగే విధంగా చూడాలి. గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత ఆరు నెలల వరకు ప్రతి నెలా పరిశీలన చేయాలి. ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు 15 రోజులకు ఒకసారి పరిశీలన చేసి ఆరోగ్య పరిస్థితిని గమనించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉంది. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులు, వేల సంఖ్యలో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నా పూర్తిస్థాయిలో ప్రయోజనాలు కనిపించడం లేదు. ఫలితంగా అనేక మంది వివిధ రోగాలకు గురై చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

 అవగాహన లోపం..
 అనేక మంది గర్భిణిలు అవగాహన లేక పౌష్టికాహార లోపంతోపాటు ఇతర రోగాల బారిన పడుతున్నారు. దీంతో బిడ్డలో ఎదుగుదల ఉండదు. ప్రసవం తర్వాత తల్లి పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇటువంటి వారు ప్రసవ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. గర్భిణిలు ఆకుకూరలు, ఖర్జూరం, ఎండుపండ్లతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి.

ముఖ్యంగా ఐరన్, మినరల్స్ ఉన్న బెల్లం కూడా వినియోగిస్తే రక్తహీనత బారిన పడే అవకాశం ఉండదని వారు వివరిస్తున్నారు. ఇవి తక్కువ ధరకు లభ్యమయ్యే పరిస్థితి ఉన్నా అవగాహన లోపంతో తీసుకోవడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.
 
 ప్రధాన సమస్య ఇదే!
 జిల్లా వ్యాప్తంగా సాగిన శిబిరాాల్లో గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తే.. అధిక శాతం మంది పౌష్టికాహారం లోపంతో ఉన్నట్లు గుర్తించారు. రక్తహీనత, చిన్న వయస్సు (18 ఏళ్లలోపు)లో గర్భం దాల్చడం, వయసు దాటిన(35 ఏళ్లుపైబడి) తర్వాత దాల్చడం, శిశువు ఎదగక పోవడం, మధుమేహం, రక్తపోటు, సిజేరియన్ తర్వాత గర్భం దాల్చడం, ఎక్కువ కాన్పులు వంటి కారణాలతో ఉన్న 2.585 మందిని గుర్తించారు. వీరిని ‘హైరిస్క్’ గర్భిణులుగా గుర్తించారు.

 కుటుంబ సభ్యులకు బాధ్యత ఉండాలి
 జిల్లాలో చాలా మంది గర్భిణి స్త్రీలు వివిధ జబ్బులతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటున్నప్పటికీ వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రసవ సమయంలో తల్లి మరణించడమో, లేదా తక్కువ బరువున్న పిల్లలు పుట్టడమో జరుగుతోంది. ఈ సమస్య ఆదోని, ఆలూరు, పత్తికొండ తదితర మండలాల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించాం.

ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలన్న  విషయంపై తాము ఎప్పటికప్పుడు గర్భిణులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వివరిస్తున్నాం. గర్భిణుల ఆహార నియమాల విషయంలో కుటుంబ సభ్యులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఐసీడీఎస్ సిబ్బంది అందిస్తున్నది కేవలం అనుబంధ ఆహారం మాత్రమే. పూర్తిస్థాయి పౌష్టికాహారం, ఇతరత్రా ఆహారం కుటుంబ సభ్యులు అందించాలి.
 - ముత్యాలమ్మ, పీడీ, ఐసీడీఎస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement