
చీరాలలో ఓ మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు
చీరాల రూరల్: చీరాలలోని పలు మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్ కంట్రోలర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, ఆయుష్ డిపార్టుమెంట్, లీగల్ మెట్రాలజీ అధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు చేశారు. పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్లోని ఎస్‌ఎల్‌కే, శంకర్, శ్రీనివాస, శ్రీరామ మెడికల్ షాపులను ఆయా డిపార్టుమెంట్లకు చెందిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి దుకాణదారుల వద్ద పూర్తి వివరాలు సేకరించారు. ఆయా దుకాణదారులు చేస్తున్న కొన్ని అవకతవకలపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ ఎల్.అంకయ్య విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని శంకర్ మెడికల్స్‌లో చేసిన తనిఖీల్లోమందులు క్రయ, విక్రయాలకు సంబంధించిన హెచ్–1 రిజిస్టర్‌ను మెయింటెన్స్ చేయడం లేదని గుర్తించామన్నారు. ఫుడ్‌కు సంబంధించిన సెర్‌లెక్, రొట్టెలు, గ్లూకోన్‌డి, బిస్కెట్ల వంటి ఆహార పదార్థాలను అనుమతి లేకుండానే విక్రయిస్తున్నట్లు చెప్పారు. సమయం మించిపోయినా కొన్ని మందులు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. లేబర్ లైసెన్స్ లేకుండా దుకాణంలో వర్క్‌ర్లతో పనిచేయిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైనట్లు డీఎస్పీ వివరించారు.
శ్రీనివాస మెడికల్ స్టోర్‌లో జనవరి నుంచి హెచ్–1 రిజిస్టర్‌ను మెయింటెన్ చేయడం లేదని వివరించారు. వినియోగదారులు కొనుగోలు చేసిన మందులకు బిల్లులు ఇవ్వడం లేదనే విషయం కూడా తనిఖీల్లో తేలిందని చెప్పారు. ఫుడ్‌కు సంబంధించిన అనుమతి పత్రం లేకుండానే విక్రయిస్తున్నారని తెలిపారు. దుకాణంలో ఒకరికి మాత్రమే లేబర్ అనుమతి తీసుకుని అదనంగా మరో ఇద్దరితో పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు. ఫార్మసిస్టు లేకుండానే మందులు విక్రయిస్తున్న విషయం తనిఖీలో వెల్లడైందని తెలిపారు. ఎస్‌ఎల్‌కె మెడికల్స్‌లో మందులు క్రయ, విక్రయాలకు సంబంధించిన హెచ్–1 రిజిస్టర్ మెయింటెన్ చేయడం లేదని చెప్పారు. దుకాణంలో మందులు కొనుగోలు చేసిన వినియోగదారులకు కొనుగోలు చేసిన మందులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదనే విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. శ్రీరామ మెడికల్స్‌లో లేబర్ అధికారుల అనుమతి లేకుండానే వర్కర్లతో పనిచేస్తున్నారని గుర్తించామన్నారు. రొట్టెలు, బిస్కెట్లు వంటి ఆహార పదార్థాలు తేదీలు లేకుండా విక్రయిస్తున్నారని తెలిపారు. తమ పరిశీలనలో తేలిన అంశాలపై ఆయా దుకాణదారులపై కేసులు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకాటించారు. అడిషనల్ ఎస్పీ ఎం.రజనీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. తనిఖీల్లో సీఐ బీటీ నాయక్, ఎస్‌ఐ వెంకట్రావు, డ్రగ్స్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ ఫర్వీన్ సుల్తానా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు, ఆయుష్ డిపార్ట్‌మెంట్ అధికారి సింగారావు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎంవీ రమణమూర్తి, పోలీసులు ప్రసాద్, వెంకట్ పాల్గొన్నారు.
ఒంగోలులో మూడు బృందాల దాడులు
ఒంగోలు సెంట్రల్: జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన దాడులు రాత్రి వరకూ కొనసాగాయి. దాడుల్లో విస్తుపొయే నిజాలు వెలుగు చూశాయి. ఎక్కువ మందుల దుకాణాల్లో గడువు ముగిసిన మందులు విక్రయిస్తున్నట్లు తేలింది. చాలా దుకాణాల్లో నిర్ణీత ఉష్ణోగ్రతల్లో మందులు నిల్వ చేయడం లేదు. ఎవరికి పడితే వారికి, కనీసం ప్రిస్కిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. షెడ్యూల్ హెచ్ మందుల పరిస్థితి కూడా ఇంతే. రిజిస్టర్‌లో నమోదు చేయడం లేదు. గడువు తీరిన మందులు వాడితే ఎక్కువ భాగం మందులు విషతుల్యం అవుతాయి. అందుకే మందులపై వాటి గడువును కంపెనీలు ముద్రిస్తారు. అయినా లాభాల కోసం మందుల దుకాణదారులు గడువు తీరిన మందులు వినియోగదారులకు అంటగడుతున్నారు. దాడులకు ముందు విజిలెన్సు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లను మరొక ప్రాంతానికి పంపి దాడులు చేశారు. అయినా విజిలెన్సు దాడుల సమాచారంతో అవకతవకలతో ఉన్న చాలామంది దుకాణదారులు తమ షాపులు మూసి వేసి దాడుల నుంచి తప్పించుకున్నారు. ఒంగోలులో ఏఎస్పీ రజనీ ఆధ్వర్యంలో నాలుగు మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నాంచారమ్మ, పుష్ప, ధనలక్ష్మి, మారుతి మెడికల్స్ దుకాణాలు తనిఖీ చేశారు. పుష్ప మెడికల్స్‌లో ఫార్మసిస్టు విధుల్లో లేరు. నాలుగు దుకాణాలకు సంబంధించి లేబర్ యాక్టును అమలు చేయడం లేదు. షెడ్యూల్ హెచ్ మందులను రిజిస్టర్‌లో నమోదు చేయడం లేదు. మందులకు సంబంధించి కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వడం లేదు. ప్రిస్కిప్షన్, గడవు తీరిన మందులను కుడా లక్ష్మీనాంచారమ్మ మందుల దుకాణంలో గుర్తించారు.
తూనికలు, కొలతలు శాఖల అధికారులు నాలుగు దుకాణాలపై 9 కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్సు సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్, ఎస్‌ఐ జానీ, ఆడిటర్ శ్యామ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జయరాములు, ఫార్మసిస్టు వై.వేణుకుమార్, అసిస్టెంట్ లేబర్ అధికారి మధుబాబు, ఎంపీడీఓ నారాయణరెడ్డి పాల్గొన్నారు. కందుకూరులో 3 దుకాణాలపై విజిలెన్సు అధికారులు డీఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇక్కడ విజిలెన్సు సీఐ భూషణం, డీసీటీఓ నవీన్ శేషు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చీరాల అధికారి, లేబర్ అధికారి శ్రీనివాసనాయుడు, ఫార్మసిస్టు కేవీ మొహన్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment