నిత్యావసరాలపై విజిలెన్స్‌ | Vigilance Raids On Black Market In Nellore District | Sakshi
Sakshi News home page

స్టాక్‌.. బ్లాక్‌ 

Published Sun, Dec 1 2019 11:57 AM | Last Updated on Sun, Dec 1 2019 11:59 AM

Vigilance Raids On Black Market In Nellore District - Sakshi

ఉత్పత్తి, రవాణాలో అంతరాయాన్ని అదనుగా తీసుకుని వ్యాపారులు నిత్యావసరాలను బ్లాక్‌ చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో రేషన్‌ బియ్యం, పప్పు దినుసులతో పాటు ఉల్లిపాయలను పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రతి నిత్యావసర సరుకులను గోడౌన్లకు తరలించి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా బ్లాక్‌ మార్కెట్‌పై విజిలెన్స్‌ సీరియస్‌గా దృష్టి సారించింది. అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఉల్లి అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తోంది. మార్కెట్‌లో ధరలు దిగివచ్చి.. స్థిరీకరణ వచ్చే వరకు దాడులు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉల్లిపాయల నుంచి రేషన్‌ బియ్యం వరకు నిత్యావసర సరుకులన్నీ నల్లబజార్‌కు చేరిపోతున్నాయి. మార్కెట్‌లో బడా వ్యాపారులు నిత్యావసరాలకు కృత్రిమ కొరత సృష్టించి స్టాక్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ధరలు భారీగా  పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో జిల్లాలోని కొందరు వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌ను శాసిస్తూ ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ.. అటు ప్రభుత్వాదాయానికి గండికొడుతున్న అక్రమరవాణా, అనధికార నిల్వలపై విజిలెన్స్‌ దృష్టి సారించింది. రేషన్‌షాపుల డీలర్లు, వ్యాపారులు కుమ్మక్కై నిత్యావసరాలను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేస్తున్నట్లు గుర్తించారు.

మరికొందరు పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. వంటకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయించడంతో పాటు వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. నిత్యావసరాల్లో పప్పు దినుసులు, ఉల్లిపాయలు తదితరాలను వ్యాపారులు అక్రమంగా నిల్వలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొద్ది కాలంగా జిల్లా వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా నిత్యావసరాల వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉల్లి ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి.

 ఉల్లి దిగుబడులు తగ్గడంతో.. 
ప్రధానంగా ఉల్లి పంట పండించే మహారాష్ట్రలోని నాసిక్‌లో వరదల వల్ల ఉల్లి పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రానికి నాసిక్‌ నుంచి ఉల్లి దిగుమతి బాగా పడిపోయింది. నెలన్నర క్రితం వరకు రూ.30 పలికిన ఉల్లి ధర ప్రస్తుతం రూ.80లకు చేరింది. రెండు వారాల క్రితం అయితే కిలో రూ.104లకు అత్యధిక ధర పలికింది. ఈ క్రమంలో విజిలెన్స్‌ అధికారులు బ్లాక్‌ మార్కెట్‌పై దృష్టి సారించారు. వరుస దాడులతో ధరలు కొంతమేర దిగి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 30 షాపుల్లో తనిఖీలు నిర్వహించి రూ.1,03,27,910 విలువ చేసే 224.80 టన్నుల ఉల్లిని స్వాధీనం చేసుకుని మార్కెట్‌ కమిటీ యార్డు అధికారులకు అప్పగించారు.

 భారీ అక్రమ నిల్వలు స్వాధీనం 
నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలోని పలు ఉల్లిపాయల విక్రయ దుకాణాలపై దాడులు చేశారు.  కొనుగోలు, విక్రయాలు, నిల్వలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని గుర్తించారు. ఆనంద్‌ ఆనియన్స్‌(12 టన్నులు), కామాక్షితాయి ఆనియన్స్‌ (15.75 టన్నులు), ఏవీఎస్‌ ఆనియన్స్‌(24.75 టన్నులు), కందె ఆనియన్స్‌ (19.75 టన్నులు) స్వాధీనం చేసుకుని దుకాణాలను సీజ్‌ చేశారు. కావలిలో శ్రీజయలక్ష్మి ఆనియన్‌ మర్చంట్స్‌ (9 టన్నులు), శ్రీకృష్ణ ఆనియన్స్‌ (17 టన్నులు) దుకాణాలను సీజ్‌ చేశారు. దుకాణాల్లోని కొనుగోలు, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తేడాలను గుర్తించారు. కేఆర్‌ఆర్‌ ఆనియన్స్‌ దుకాణంలో 9.30 టన్నులు, హైమావతి అసోసియేట్స్‌లో 14.2 టన్నుల ఉల్లిపాయలను సీజ్‌ చేసి మార్కెటింగ్‌ అధికారులకు అప్పగించారు. కావలిలో మొత్తంగా ఆరు దుకాణాల్లోని రూ.42,59,650 విలువ చేసే 98.25 టన్నుల ఉల్లిపాయలను సీజ్‌ చేసి మార్కెటింగ్‌ శాఖ అధికారులకు అప్పగించారు. గూడూరు, బచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల్లోని ఐదు ఉల్లిపాయల దుకాణాలపై దాడులు చేసి రూ.2.60 లక్షలు విలువచేసే 8.3 టన్నుల ఉల్లిపాయలను సీజ్‌ చేశారు.

రేషన్‌ బియ్యం పక్కదారిపైనా కేసులు 
శ్రీకాళహస్తి నుంచి 50 బస్తాల పీడీఎస్‌ బియ్యం నెల్లూరు వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని విజిలెన్స్‌ అధికారులు ïసీజ్‌ చేశారు. జిల్లాలోని గూడూరు, కావలి, ఓజిలి, బుచ్చిరెడ్డిపాళెం ఆరు రేషన్‌ షాపుల్లో తనిఖీలు చేసి నిత్యావసరాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడంతో పాటు, స్టాక్‌ల్లో భారీ వ్యత్యాసాలు ఉండడాన్ని గుర్తించారు. రూ.10.20 లక్షలు విలువ చేసే నిత్యావసరాలను సీజ్‌ చేసి డీలర్లపై 6ఏ కింద కేసులు నమోదు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రేషన్‌ దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు చేశారు. ఒక రేషన్‌ దుకాణంలో 517 కిలోల బియ్యం, 59 కిలోల చక్కెర, 1.5 కిలోల రాగి పిండి, కంది పప్పు 12 కిలోలు తక్కువగా ఉండటంతో రేషన్‌ షాపు డీలరపై 6ఏ కింద కేసు నమోదు చేశారు. ఆటోలో తరలిస్తున్న 800 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధిక లోడ్‌తో వెళ్తున్న ఐదు గ్రానైట్‌ లారీలు, మూడు కంకర లారీలు, 7 ఇటుక ట్రాక్టర్లు, 21 వ్యవసాయ మార్కెటింగ్‌కు సంబంధించిన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రవాణా శాఖ రూ.6,31,845, మైనింగ్‌శాఖ రూ.30 వేలు, మార్కెటింగ్‌శాఖ రూ. 2,51,158 మొత్తంగా రూ.9,13,003 నగదును జరిమానా కింద వసూలు చేశారు. పరిమితికి మించి అధిక లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ వాహనాలు, గ్రావెల్, బొగ్గు, గ్రానైట్‌ లారీలు, కంటైనర్‌లను తనిఖీచేసి వాహనదారుల నుంచి రూ. 17 లక్షల జరిమానా వసూలు చేశారు. 

ధరలు తగ్గే వరకు తనిఖీలు కొనసాగిస్తాం 
జిల్లాలో అక్రమాలను గుర్తించి వరుస కేసులు నమోదు చేస్తాం. ప్రధానంగా నిత్యావసరాల్ని బ్లాక్‌ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై సీరియస్‌ ఫోకస్‌ కొనసాగుతుంది. గత నెలల్లో ఉల్లి, నిత్యావసరాలు, రేషన్‌ బియ్యం, ఓవర్‌ లోడింగ్, బిల్లులు లేకుండా జరిగే అక్రమ రవాణాపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా మార్కెట్‌లో నిత్యావసరాలు, ప్రధానంగా ఉల్లి ధరలు తగ్గే వరకు మార్కెట్‌పై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. 
– వెంకట శ్రీధర్, జిల్లా విజిలెన్స్‌ అండ్‌  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement