విపక్షంపై కక్ష సాధింపు
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగంపై పోలీసుల దాడి
- సోషల్ మీడియా విభాగ ఇన్‌చార్జికి నోటీసులు
- చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం: విజయసాయిరెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీపై కక్షసాధింపు చర్యలకు తెర లేపింది. ఆయా సందర్భాల్లో మంత్రి నారా లోకేశ్ తీరుపైన, వ్యవహారశైలిపైన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జీర్ణించుకోలేక, ఆ కోపాన్ని వైఎస్సార్‌సీపీపై చూపేందుకు చట్ట వ్యతిరేక చర్యలకు దిగింది. ఈ క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు ఏపీ పోలీసులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ వన్‌లోని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యాలయంపై దాడులు నిర్వహించారు.
విషయం తెలుసుకొన్న వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు, జోగి రమేష్ తదితరులు అక్కడికి చేరుకొని పోలీసుల చర్యలకు అభ్యంతరం తెలిపారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే తప్ప, అధికారపార్టీకి తాబేదారులుగా ఉండకూడ దన్నారు. ఎవరో ఫిర్యాదు ఇస్తే తీసుకొంటారు. అదే మేము ప్రతిపక్షంగా ఇస్తే తీసుకోరు. ఇదేమి న్యాయమని నిలదీశారు. చట్టబద్ధంగా వ్యవహరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి ఫోన్ చేసి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఫిర్యాదుపై మీరెలా స్పందిస్తారని నిలదీశారు.
లోకేశ్ అసమర్థుడు..: లోకేశ్ పప్పు అని, అసమర్థుడని ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఇటువంటి పోస్టింగ్‌లను తాను కూడా సోషల్ మీడియాలో పెడతానని, తనపై కేసు నమోదు చేసుకోవచ్చునని ఆయన అన్నారు.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై గతంలో సోషల్ మీడియాలో అనేక దుర్మార్గపూరిత వ్యాఖ్యానాలు చేశారని, సభ్య సమాజం తలదించుకునేలా పోస్టింగ్‌లు పెట్టారన్నారు. ఇటువంటి చర్యలపై టీడీపీ కార్యాలయంలో సోదాలు చేసే శక్తి మీకు ఉందా అని పోలీసులను సాయిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగానికి తనను ఇన్‌చార్జ్‌గా జగన్ నియమించారని ఆయన తెలిపారు. ఏదైనా నోటీసులు ఇవ్వదలిస్తే తనకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో జగన్‌ను దూషిస్తూ లోకేశ్ పెట్టిన ట్వీట్లను నేతలు పోలీసులకు చూపించారు. కాగా, ౖవైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. 25న తుళ్లూరు పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరు కావాలన్నారు.