
అధికార మదంతో వేధిస్తోంది
టీడీపీపై వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి ధ్వజం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతిపక్షం మీద టీడీపీ వేధింపులపై రాబోయే నాలుగున్నరేళ్లలో ప్రణాళికాబద్ధంగా నిరసన తెలియజేద్దామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికార మదంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తోందన్నారు.
కర్నూలు జిల్లాలోనూ భూమా నాగిరెడ్డిపై అనవసరంగా కేసులు బనాయించారన్నారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు నాగిరెడ్డి ప్రయత్నిస్తే అధికార పార్టీ ఆయనపై అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాయి దావేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ రైతు, మహిళా వ్యతిరేక విధానాలపై ఈ నెల 5న పార్టీ తలపెట్టిన మండలస్థాయి ధర్నాలను విజ యవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సమస్యలపై నిలదీస్తున్నందుకే:ఉమ్మారెడ్డి
రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపుతో అక్రమ కేసులను బనాయించ డం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని టీడీపీ ప్రభుత్వం... వాటిని నిలదీస్తున్నందుకే వేధిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వేధింపులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా ఇన్‌చార్జి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.