విజయవాడ కేంద్రంగా మరో పవర్ డిస్కం | Vijayawada as the center of the power of DISCOMs | Sakshi
Sakshi News home page

విజయవాడ కేంద్రంగా మరో పవర్ డిస్కం

Published Tue, Sep 23 2014 12:09 AM | Last Updated on Wed, Sep 5 2018 4:12 PM

Vijayawada as the center of the power of DISCOMs

వారంలోగా ప్రభుత్వ ప్రకటన
పాలనా సౌలభ్యం కోసం ఏపీఎస్‌పీడీసీఎల్ విభజన నిర్ణయం
కొత్త డిస్కం కింద కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు

 
విజయవాడ బ్యూరో: విజయవాడ కేంద్రంగా మరో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కం)ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఈ కొత్త డిస్కం పరిధిలోకి తెస్తుందని సమాచారం. కొత్త డిస్కం ఏర్పాటు ప్రాంతంగా మొదట గుంటూరు పేరు తెరమీదకు వచ్చినప్పటికీ.. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉంటే అక్కడే డిస్కం కార్యాలయం ఉండాలన్న ఉన్నతాధికారుల సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. మరో వారంలోగా దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరిస్తూ ప్రభుత్వం జీవోను తీసుకురానుందని విద్యుత్ అధికార వర్గాల సమాచారం.ఇందుకు కసరత్తు జరుగుతోందని చెప్తున్నారు.

తిరుపతి దూరం.. పాలన భారం...

రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ డిస్కంలు ఉన్నాయి. ఇందులో మొదటిది తిరుపతి, రెండోది విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ఉభయగోదావరి జిల్లాల వరకూ ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఉండగా.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ క ంపెనీ కింద ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత అప్పటి వరకూ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాలు ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధి 8 జిల్లాలకు పెరిగి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డిస్కంగా మారింది. అది కృష్ణా, గుంటూరు జిల్లాలకు దూరంగా తిరుపతిలో ఉంది. దీంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను రెండుగా విభజించి విజయవాడలో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నూతన డిస్కం ఏర్పాటు అనివార్యమని రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలోని కాటన్ మిల్లుల పారిశ్రామికవేత్తలు, స్పిన్నింగ్ మిల్లుల యజమానులు సీఎం బాబును కలిసి కొత్త డిస్కం ఏర్పాటుపై దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీన్ని ధ్రువపరుస్తూ రాష్ట్రమంత్రి అచ్చెంనాయుడు రెండు రోజులు కిందట విజయవాడ కేంద్రంగా డిస్కం ఏర్పాటు జరుగుతుందని ప్రకటించారు.     
 
గుంటూరులో తాత్కాలిక కార్యాలయం..
 
విజయవాడలో డిస్కం కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పక్షంలో అనువైన భవనాలు, ఖాళీస్థలాలు ఎక్కడ ఉన్నాయన్న దానిపై కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొదట కార్యాలయాన్ని అద్దె భవనంలో ప్రారంభించి ఆపైన అనువైను సొంత స్థలాల్లో కొత్త భవనాలను నిర్మించుకునే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర్లోని పాత పవర్ హౌస్‌కు పక్కనే ఉన్న 2 ఎకరాల ఖాళీస్థలం, యనమలకుదురులోని 2 ఎకరాలు, ఆగిరిపల్లి దారిలోని 5 ఎకరాల్లో ఎక్కడైనా నూతన భవనాలు నిర్మించుకునే వీలుంది. గుంటూరు సంగడిగుంట ఏరియాలో ఇప్పటికే నిర్మించి ఉన్న విశాల విద్యుత్ భవనాల్లో తాత్కాలికంగా కార్యాలయాన్ని నడుపుకుంటూ, విజయవాడలో కొత్త భవనాలు పూర్తయ్యాక అక్కడికి తరలించే అవకాశాలు  ఉన్నాయి.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement