
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు
సాక్షి, విజయవాడ : దుర్గగుడి ధర్మకర్త కోడెల సూర్యలత చీరల వ్యాపారం కోసం దుర్గగుడిలో చీరలు మాయం చేస్తున్నట్లు తెలుస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. దుర్గగుడిలో ఉండవల్లి భక్తులు సమర్పించిన పట్టుచీర మాయం కావటంపై ఆయన స్పందించారు. గతంలో జరిగిన 50 లక్షల రూపాయల చీరల స్కాంలో ధర్మకర్త పాత్ర ఉందని అన్నారు. దుర్గమ్మ సన్నిధిలో చీర మాయమై 24 గంటలు గడుస్తున్నా విచారణ జరిపించకపోవటం విడ్డూరమన్నారు. ఆలయ ధర్మకర్తే తీసిందని ఆధారాలున్నా ఆలయ అధికారులు వెనకేసుకు రావటం సిగ్గుచేటన్నారు.
దుర్గగుడి అధికారులు, పాలకమండలి సభ్యులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, స్ధానిక ప్రజాప్రతినిధులు చీర మాయంపై స్పందించకపోవటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దుర్గగుడిలో చంద్రబాబు క్షుద్రపూజలు చేయించారు కాబట్టి పాలకమండలి ఎన్ని అరాచకాలు చేస్తున్నా వెనకేసుకు వస్తున్నారని మండిపడ్డారు. క్షుద్రపూజలు జరిగాయని రిపోర్టులు చెబుతుంటే ఇప్పటివరకు చర్యలు లేవని అన్నారు.
దుర్గగుడి పవిత్రతను దెబ్బతీసేందుకు పాలకమండలి కంకనం కట్టుకుందని ఎద్దేవా చేశారు. దుర్గగుడి పాలకమండలిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ఆస్తులను జలీల్ ఖాన్, హిందువుల ఆస్తులను బుద్దా వెంకన్న ఖాజేస్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. దుర్గగుడిలో చీర మాయంపై విచారణ జరిపించకుంటే పోలీసులకు తామే ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరతామన్నారు.
అమ్మవారి పట్టుచీర ఎక్కడ?..
ఉండవల్లి భక్తులు దుర్గమ్మకు ఆషాఢ సారెలో సమర్పించిన రూ.18 వేల విలువైన పట్టుచీర ఆదివారం మాయమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా చీర విషయంలో ఎలాంటి సమాచారం లేకపోవటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లిలో ఎంతో భక్తితో నేయించి అమ్మవారికి సమర్పించిన పట్టుచీర కనిపించకపోవటంపై సమర్పకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఆలయ ఈవో నుంచి ఎలాంటి సమాధానం లేదని లలిత భక్తమండలి వాపోయింది. చీరెను సమర్పించిన ఉండవల్లి భక్తులు ఈవో కార్యలయం ముందు బైఠాయించారు. ఆలయ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతనే చీరను తీసుకున్నారని వారు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment