గజిని సినిమాలో మెదడుకు దెబ్బతగిలి కథానాయకుడు గతాన్ని మర్చిపోతాడు. జ్ఞాపకాలను మననం చేసుకునేందుకు పడే అవస్థలు.. ఉపయోగించే చిట్కాలతో కథనం సాగుతుంది. ప్రస్తుతం నగరవాసంలో మతిమరుపు బాధితులు (గజినిలు) పెరిగిపోతున్నారు. విజయవాడ నగరంలో యువతలో రోజు రోజుకు ఈ సమస్య తీవ్రమవుతుండటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు, పరీక్షల భయం, ఆందోళనలు ఈ సమస్యలకు కారణాలుగా మానసిక వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం, మెదడుకు వ్యాయామంతో ఈ సమస్యను అధిగమించవచ్చని పేర్కొంటున్నారు.
లబ్బీపేట (విజయవాడతూర్పు): స్కూల్‌కు టైం అయిపోతుందనే హడావుడిలో మమ్మీ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోయే పిల్లలు.. ఆఫీస్‌కు లేట్ అవుతున్నామనే భయంతో బైక్ కీస్ మరిచి మెట్లు దిగిపోయే ఉద్యోగులు.. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పడి చేయాల్సిన పని మర్చిపోతున్న యువకులు ఇలా.. విజయవాడ నగరంలో ఇప్పుడు మతిమరుపుతో అవస్థలు పడుతున్న వారెందరో ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఒకప్పుడు ఆరవై ఏళ్లు దాటితే కానీ కనిపించని మతిమరుపు ఇప్పుడు 14 ఏళ్లకే వచ్చేస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తుందంటే నమ్మక తప్పదు. పరీక్షల భయం, పని ఒత్తిడి ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు కాగా, పౌష్టికాహారలోపం, కొన్ని రకాల రోగాలు ఇందుకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
టీనేజ్‌లో బీజం
మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడుతోంది. ఇది నిజం. 25–35 ఏళ్ల వయస్సు వారిలో అది తీవ్ర స్థాయికి చేరుతోంది. వైద్య నిపుణులు చెబుతున్న మాట ఇదే. కొందరు తాము మతిమరుపుతో బాధపడుతున్నామని తెలియక ఏదో సమస్యతో వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు.
అంతుచూస్తున్న ఒత్తిడి
చేసే పనిలో టెన్షన్, యాంగ్జ్జయిటీ, సైకలాజికల్ అంశాలు మెమరీ పవర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత ఇప్పుడు జుట్టు పీక్కుంటోంది. ఉదయం లేవగానే ఏదో పనిచేయాలని అనుకుంటారు. తీరా చెప్పే సమయం వచ్చేసరికి అది గుర్తుకు రాదు. అంతలా మైండ్ పట్టుతప్పుతోంది. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటం వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. అది మనసుపై ప్రభావం చూపుతుంది.
లోపిస్తున్న ఏకాగ్రత
ఒక విషయాన్ని సమగ్రంగా వినడంలో యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదాన్ని మనసులో ముద్రించుకోవడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులొస్తున్నాయి. విన్న విషయాన్ని మనసులో ముద్రించుకోకపోవడం వల్లే మతిమరుపు వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. గుర్తుంచుకున్నట్లుగా ఉంటుంది.. కాని గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినకపోవడంతో తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది.
బీపీ, మధుమేహం ప్రభావం
మధుమేహం, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బి–12 కారణమని, దాని లోపం వల్ల మతి మరుపు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఏకాగ్రత తగ్గుతోంది
యువత, విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోంది. దీంతో చేయాల్సిన దానిపై దృష్టి సారించలేక పోతున్నారు. ప్రతి చిన్న విషయానికి వస్తువులపై ఆధారపడటం, అంటే లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్ వాడటం, ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తో గడపడం వంటివి. వీటి వల్ల ప్రతి విషయాన్ని మరిచిపోవడం జరుగుతోంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరూ బ్రెయిన్‌తో ఎక్సర్‌సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లలపై మార్కులు కోసం ఒత్తిడి తేకూడదు. ఇది వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది.–డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, ప్రభుత్వాస్పత్రి
బెజవాడలో ‘గజని’లు
‘వీడు మతిమరుపునకు బ్రాండ్ అంబాసిడర్’.. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో హీరో గురించి హీరోయిన్ తండ్రి చెప్పిన మాటలివి. మతిమరుపుతో బాధపడే వ్యక్తిగా హీరో కష్టాలు, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టం అనుభవించే వాళ్లకే అర్థమవుతుంది. ఏ మాత్రం శారీరక శ్రమలేని యాంత్రిక జీవనం.. మనిషి నడవడికను పూర్తిగా మార్చేస్తోంది. సెల్‌ఫోన్, కంప్యూటర్ల వాడకం పెరిగి ప్రతి సమాచారానికీ వాటిపైనే ఆధారపడుతుండడంతో క్రమంగా మెదడు పదును తగ్గుతోంది. వెరసి యువతలో మతిమరుపు సమస్య తీవ్రతరమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment