
ఎలుగుబంటిని బంధించిన దృశ్యం , ఎలుగుబంటిని వెంబడిస్తున్న ఆలూరు గ్రామస్తులు
ఆలూరు: వందలాది మంది గ్రామస్తులు.. ఒకటే అరుపులు, కేకలు.. వారితో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులు.. కొందరు కంపచెట్ల వైపు పరుగులు తీస్తున్నారు.. మరికొందరు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోకి వెళ్లి తలుపులు మూసేసుకుంటున్నారు.. ఇంకొందరు ఇళ్లపైకి చేరుకుని ఆసక్తిగా గమనిస్తున్నారు.. అదిగో..అదిగదిగో అంటూ కిందున్న వారిని అప్రమత్తం చేస్తున్నారు.. ఇవీ సోమవారం ఆలూరు మండల కేంద్రంలో కన్పించిన దృశ్యాలు. గ్రామంలోకి ప్రవేశించిన ఓ ఎలుగుబంటిని బంధించేందుకు దాదాపు 600 మంది గ్రామస్తులు, పోలీసులు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో దాన్ని తీవ్రంగా కొట్టడంతో కొన్ని గంటల తర్వాత మృతిచెందింది. ఉదయం ఆరు గంటల సమయంలో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలకు ఆదోని–బళ్లారి రోడ్డు సమీపంలోని ఏడు మోరీల వద్దఎలుగుబంటి కన్పించింది. దీంతో వారు పనులు మానుకొని ఇళ్ల వైపు పరుగులు తీశారు.
తర్వాత అది కర్నూలు–బళ్లారి రోడ్డు, సాయిబాబా కాలనీ, మండల పరిషత్, హౌసింగ్, ఎక్సైజ్ కార్యాలయాలు..తదితర ప్రాంతాల్లో జనానికి కన్పించింది. దీంతో భయభ్రాంతులకు గురై ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ సమాచారాన్ని కొందరు ఫోన్‌లో నేరుగా, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖాధికారులకు చేరవేశారు. అటవీ అధికారులు స్పందించలేదు. సీఐ ఎం.దస్తగిరిబాబు స్పందించి ఎస్‌ఐ గోపీనాథ్, సిబ్బందిని పంపారు. వారితో పాటు ఉపాధ్యాయనగర్, ఎన్జీఓ కాలనీ, కోయనగర్, డమ్మరువీధి, వడ్డేగేరి తదితర కాలనీలకు చెందిన దాదా పు 600 మంది గ్రామస్తులు ఎలుగును బం« దించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రంగంలోకి దిగారు. సాధ్యం కా కపోవడంతో కోయనగర్‌కు చెందిన బుడగ జంగాల వారి నుంచి వలలు తెప్పించారు. ఎట్టకేలకు రాత్రి ఏడు గంటల సమయంలో ఎంపీడీఓ క్వార్టర్స్‌లోని శారదమ్మ ఇంట్లోకి చొరబడిన ఎలుగును బంధించారు. ఈ క్రమంలో ఎస్‌ఐ గోపీనాథ్, కమ్మరచేడు గ్రామ మాజీ సర్పంచ్ దేవేంద్ర, గ్రామస్తులు రాజు, రవి, ఈరన్న, మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. బంధించిన ఎలుగును అటవీ సిబ్బందికి అప్పగించగా..వారు దాన్ని ఆదోనికి తరలించారు. అక్కడ పశువైద్యుడి పర్యవేక్షణలో ఉంచగా..కొన్ని గంటల తర్వాత మృతిచెందింది.
Comments
Please login to add a commentAdd a comment