తణుకులో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న వార్డు వలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు/నిడదవోలు రూరల్/నరసాపురం రూరల్/మొగల్తూరు: గ్రామ, వార్డు వలంటీర్లు కరోనా మహమ్మారిని నియంత్రించడంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటా సర్వే చేయడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలను వివరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సహకారంతో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో జిల్లాలో వలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాబారిన జిల్లా ప్రజలు పడకుండా వీరు పోషిస్తున్న పాత్ర అందరి ప్రశంసలు అందుకుంటోంది. వీరికి తోడుగా ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు జిల్లాలో పరిస్థితి అదుపు తప్పకుండా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం, వారి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడంలో ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పనికొంత సులభమైంది. విదేశాల నుంచి వచ్చిన వారు రాష్ట్రంలోనే ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నారు. కరోనా విజృంభణ మొదలైన తర్వాత వివిధ కరోనా పీడితదేశాల నుంచి మూడు వేల మందికి పైగా జిల్లాకు తిరిగి వచ్చారు.
జిల్లావ్యాప్తంగా 16,430 మంది..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకూ ఒక వలంటీర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 16,430 మంది వలంటీర్లు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలల్లో 8,500 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించమని వలంటీర్లకు ఆదేశించింది. వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల వివరాలను సేకరించారు. విదేశాల నుంచి వచ్చిన వారినీ గుర్తించారు. ఆ సమాచారాన్ని వెంటనే మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారందరనీ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులకు తరలించారు. మరికొందరిని గృహాల్లోనే ఐసొలేషన్ ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించారు. అయితే ఎవరికీ కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాకపోవటంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ గృహాల్లోనే ఉంచి వలంటీర్లు, వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిరోజులుగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తి వచ్చినా స్థానికులు వెంటనే వలంటీర్లకు సమాచారమిస్తున్నారు. వారి ద్వారా వారి వివరాలు సేకరించి, వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో జిల్లాలోని 11 వందల మంది పంచాయతీ కార్యదర్శులు తమ వద్ద ఉన్న 2,500 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మేముసైతం..
పోడూరు: పోడూరు మండలం వేడంగిపాలెం ఎస్సీకాలనీలో గ్రామ వలంటీర్లు మంగళవారం పారిశుద్ధ్య సేవలు అందించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో వలంటీర్లు విశేష సేవలందిస్తున్నారు. వేడంగిపాలెంలోని ఎస్సీ కాలనీలో గ్రామ వలంటీర్లు బ్లీచింగ్ స్ప్రే చేశారు. వైఎస్సార్ సీపీ మండల బూత్ కన్వీనర్ బళ్ల రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామ వలంటీర్లు పారిశుద్ధ్య సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. వలంటీర్లు ఊసల రమేష్, గునుపూడి ప్రకాష్‌తో పాటు స్థానిక యువకుడు నేతల కిషోర్ బ్లీచింగ్ స్ప్రే చేశారు.
కవిటంలో పారిశుద్ధ్య చర్యలు
కవిటం గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో పలుచోట్ల రోడ్లపై ఉన్న చెత్తకుప్పలను డంపింగ్ యార్డుకు తరలించారు. పలుచోట్ల డ్రెయినేజీల్లో, రోడ్లపక్కన పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పంచాయతీ కా ర్యదర్శి జి.సత్యనారాయణరెడ్డి పనులను పర్యవేక్షించారు.
అందరూ ఇళ్లలోనే ఉండాలి
కూరగాయల ధరలు, కిరణా సరుకులు, హ్యాండ్ వాష్‌లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్ర జల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. కరో నా ప్రభావంతో వార్డులో ప్రజలందరినీ ఇళ్ల ల్లోనే ఉండాలని సూచిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు పదిహేను రోజులు గడిచింది. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. వార్డులో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. –దాసరి అక్కమ్మ, వలంటీర్, 19వ వార్డు, కొవ్వూరు
Comments
Please login to add a commentAdd a comment