బడిదుడుకులు | VIP Reporter DEO Madhusudana Rao | Sakshi
Sakshi News home page

బడిదుడుకులు

Published Sun, Dec 7 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

బడిదుడుకులు

బడిదుడుకులు

 జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు అనంతపురం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చి సరిగ్గా పదిరోజులే అయింది. జిల్లాలో పాఠశాలలు, ముఖ్యంగా సర్కారీ స్కూళ్ల  పనితీరు, అక్కడ అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నారు. అధికారిగా వెళితే ముందుగానే సమాచారం వెళ్లి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త పడతారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు తెలియవు. అక్కడ విద్యార్థులకు అధికారితో ఎలా మాట్లాడాలి, ఏ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పాలి అనే విషయాలను ఉపాధ్యాయులు ముందుగానే శిక్షణ ఇచ్చి సిద్ధం చేసేస్తారు. అలా జరిగితే  క్షేత్ర స్థాయిలో ఏ లోపం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉండదు. ఆకస్మిక తనిఖీకి వెళ్లినా అక్కడేం జరిగిందనేది పూర్తిగా బయటకు రాదు. మరి.. విషయం రాబట్టాలంటే రొటీన్‌కి భిన్నంగా ఏదో ఒకటి చేయాలి. వెంటనే ఆయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఏలూరులోని రెండు స్కూళ్లకు ఆకస్మికంగా వెళ్లారు. తొలుత తూర్పువీధి శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ తొమ్మిదవ తరగతి గదిలోకి అడుగు పెట్టారు.

 డీఈవో: నేను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను.. ఏమ్మా నీ పేరేమిటి, నువ్వు స్కూల్‌కి రెగ్యులర్‌గా వస్తావా, టీచర్లు రెగ్యులర్‌గా వస్తున్నారా
 సుకన్య : నేను రెగ్యులర్‌గా వస్తాను సార్. మా టీచర్లు కూడా వస్తారు
 డీఈవో: ఉపాధ్యాయులు పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారా ? నీకు ఇష్టమైన సబ్జెక్టు ఏమిటి
 హేమనీల్ కుమార్ : అర్థమయ్యేలానే చెబుతున్నారు సార్, నాకు ఇష్టమైన సబ్జెక్టు తెలుగు
 డీఈవో: తెలుగులో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి.
 హేమనీల్ కుమార్ : 45 వచ్చాయి సార్
 డీఈవో: అదేంటి ఇష్టమైన సబ్జెక్టులో 45 మార్కులేనా వచ్చేది? ఐతే మీ టీచర్లు మీకు అర్థమయ్యేలా చెప్పడం లేదన్నమాట
 లేదు సార్... మా మాస్టార్లంతా మంచోళ్లు అని విద్యార్థుల ముక్తకంఠం
 డీఈవో: సరే మీకు నోట్స్ చెబుతున్నారా.. ఏదీ చూపించండి అటూ చొరవగా ఒక విద్యార్థి నోట్ పుస్తకాన్ని తీసుకుని పరిశీలించారు. ఆ నోట్స్‌ను టీచర్ కరెక్టు చేసినట్టు లేకపోవడం గమనించారు.
 డీఈవో : టీచర్‌తో ఏమ్మా నోట్స్ దిద్దాల్సిన బాధ్యత మీకు లేదా?
 టీచర్ శాంతి కుమారి : నోట్స్ ఎప్పుడూ దిద్దుతాను సార్ వాళ్ళు మొన్న స్కూల్‌కు రాలేదు. ఇవ్వాళే వచ్చారు. అందుకనే దిద్దడం
 కుదరలేదు.
 డీఈవో: మీ స్కూలుకు యూనిఫాం ఉందా..
 సౌజన్య : ఉంది సార్
 డీఈవో : మరి మీరు వేసుకోలేదే
 విద్యార్థులు : 8వ తరగతి వరకు మాత్రమే ఉంది సార్
 అక్కడి నుంచి వడివడిగా బయటకు అడుగులు వేసిన ఆయన పక్కనే మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంటలు వండుతున్న షెడ్డు వద్దకు వచ్చారు.
 అక్కడ వంట మనిషితో...
 డీఈవో: ఏమ్మా పిల్లలకు వారానికి ఎన్నిసార్లు గుడ్లు  ఇస్తున్నారు.
 వంట మనిషి ఆదిలక్ష్మి : వారానికి రెండుసార్లు గుడ్లు ఇస్తున్నాం సార్
 డీఈవో : గుడ్లకు బదులు అరటి పండ్లు ఇస్తున్నారని తెలిసింది నిజమేనా
 ఆదిలక్ష్మి : ఈ స్కూల్‌లో గుడ్లే ఇస్తున్నాం సార్.
 డీఈవో:  భోజనం సమయం మధ్యాహ్నం ఒంటిగంట అయిపోయింది. ఇంకా వండుతూనే ఉంటే ఎప్పటికి పెడతారు.
 ఆదిలక్ష్మి : అయిపోవచ్చింది సార్ గంట కొట్టగానే పెట్టడానికి సిద్ధం చేస్తున్నాము.  
 పక్కనే ఉన్న ప్రధానోపాధ్యాయునితో ...
 డీఈవో: మీ స్కూల్‌లో ఎంతమంది విద్యార్థులున్నారు... ఎంతమంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు...
 హెచ్‌ఎం సీహెచ్ హరిబాబు : స్కూల్‌లో 500కు పైగా విద్యార్థులున్నారు సార్. 475 మంది వరకూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.
 డీఈవో: మిగిలిన వాళ్లు ఎందుకు చేయడంలేదు... మీరు వాళ్లకి చెప్పడం లేదా. సరే ఈ రోజు ఎన్ని కేజీల పప్పు వాడారు.
 హరిబాబు : ఐదున్నర కేజీలు పప్పు వాడాం సార్.
 డీఈవో : ఒక్కో విద్యార్థికి ఎంత పప్పు వాడాలి
 హరిబాబు : 30 గ్రాముల పప్పు వాడాలి సార్.
 డీఈవో :  మరి 475 మందికి ఎంత పప్పు వాడాలి. అంటూ నోట్లోనే లెక్కలు వేసుకుని సుమారు 12 కేజీల పప్పు పైన వాడాలి, మీరేమో ఐదున్నర కేజీలే వాడామంటున్నారు. ఎందుకు తగ్గించారు.
 హరిబాబు : ఈ రోజు మెనూలో పప్పు లేదు సార్. సాంబారుకోసమే పప్పు వినియోగించాం. సాంబారుకు అంత అవసరముండదు సార్.
 డీఈవో : విద్యార్థులకు మంచినీటి సౌకర్యం ఉందా. ఎలా సరఫరా చేస్తున్నారు.
 హరిబాబు : మంచినీటికి ట్యాంకు ఉంది సార్, దానికి ట్యాప్‌లు పెట్టాం ఆ నీరే తాగుతారు.
 డీఈవో : ప్రతి తరగతి వద్ద స్టీల్‌డ్రమ్ముతో తాగునీటిని అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉంది తెలుసా. ఇక్కడ చూస్తే ఏమీ కనబడడం లేదే. ఇప్పటి నుంచైనా డ్రమ్ములు ఏర్పాటు చేయండి.
 అనంతరం అక్కడి నుంచి పాఠశాలలోని టాయిలెట్లను పరిశీలించడానికి వెళ్లారు. టాయిలెట్లలో కొన్నింటికి తాళాలు వేసి ఉండడాన్ని గమనించిన డీఈవో మధుసూదనరావు ఈ టాయిలెట్లు వినియోగిస్తున్నారా... తాళాలు ఎందుకు వేశారు అంటూ ప్రశ్నలు సంధించారు. హెచ్‌ఎం హరిబాబు ఇవి విద్యార్థినుల టాయిలెట్లు సార్ అని ఏదో సర్ది చెప్పబోతుండగా డీఈవో కలుగచేసుకుని ముఖ్యంగా  విద్యార్థినుల టాయిలెట్లనే అందుబాటులో ఉంచాలి. ఇంతమంది విద్యార్థినులు ఉంటే టాయిలెట్లకు తాళాలు వేస్తే వారు ఎక్కడికి వెళ్లాలి. టాయిలెట్లలో వాడుకనీటి సరఫరా నిరంతరం జరుగుతోందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన డీఈవో మంచినీటి ట్యాంకు గొట్టాల నుంచి నీరు లీకవుతూ ప్రాంగణం బురదమయంగా మారటాన్ని గమనించారు. ట్యాంకు లీకేజీలు ఉంటే బాగు చేసుకోవాలనే సంగతి తెలీదా అంటూ... ఇది స్కూలేనా... విద్యార్థులు ఉండే ప్రాంగణం ఇలాగేనా ఉండేది.. అని అసహనం వ్యక్తం చేశారు. మీ పాఠశాలకు గ్రాంటులు వస్తున్నాయా అని అడిగి ఆ గ్రాంటులను విత్‌డ్రా చేసి వెంటనే నీటి లీకేజిని నివారించాలని ఆదేశించారు. అనంతరం 10వ తరగతి గదిలోకి వెళ్లారు.
 డీఈవో అక్కడ డెస్కుపై గైడు ఉండడాన్ని గమనించి ఇదేమిటి గైడ్లు ఎవరు తెచ్చారు. గైడ్లు కొనవద్దని చెబుతున్నాం కదా క్లాస్‌లో నోట్సు చెప్పడం లేదా?.
 ప్రియాంక : గైడు నాదే సార్ తెలియక కొన్నా. మెదట్లో రిఫరెన్సు కోసం ఉపయోగపడుతుందనుకున్నా.
 అక్కడి నుంచి బయలుదేరి అగ్రహారంలో ఉన్న బాలికోన్నత పాఠశాలకు వెళ్లారు. ఆయన వెళ్లేటప్పటికి విద్యార్థినులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. ఒక బాలికతో...
 డీఈవో : ఈ రోజు భోజనంలో గుడ్డు ఇచ్చారా.. వంటలు బాగుంటున్నాయా అని అడిగారు.
 రాగసుధ : వంటలు బాగా ఉంటాయి సార్. ఈ రోజు  గుడ్డు ఇచ్చారు.
 డీఈవో : మరి నీ కంచంలో గుడ్డు కనబడడం లేదేమిటి... పచ్చడి తెచ్చుకున్నావెందుకు అని అడగగా ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. పక్కనే ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ ఏంజల్‌ను ఉద్దేశించి ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు.. అందరికీ సరిపడా ఫర్నిచర్ ఉందా అని ప్రశ్నించారు.
 విజయ ఏంజల్ : ఇక్కడ 250 మంది విద్యార్థినులు చదువుతున్నారు సార్. అందరికీ సరిపడే ఫర్నిచర్ ఉంది సార్.  
 డీఈవో : మరి మంచినీటి డ్రమ్ములు కనబడడం లేదేమిటి. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ప్రతి పాఠశాలకూ రూ 2,500 మంజూరు చేస్తోంది కదా, ఆ నిధులను వాడారా
 విజయ ఏంజల్ : ఆ గ్రాంటును ఇప్పటివరకూ డ్రా చేయలేదు సార్
 డీఈవో : బాధ్యత గల స్థానంలో ఉండి నిధులు డ్రా చేయలేదని చెప్పడం ఎంతవరకూ కరెక్ట్. ఇప్పటికై నా ఆ నిధులను డ్రా చేసి మౌలిక సౌకర్యాల క ల్పనపై దృష్టి పెట్టండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement