సమస్యల చెంతకు..
ఏలూరు.. జిల్లాలోనే ఏకైక నగరం. కలెక్టర్‌తోపాటు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఇక్కడే ఉంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ వంటి ముఖ్య ప్రజాప్రతినిధులు ఉండేది ఈ నగరంలోనే. అలాంటి ప్రాంతం జిల్లాకే తలమానికంగా.. అభివృద్ధిలో మార్గదర్శకంగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ.. ఈ నగరంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడి ప్రధాన సమస్యలను తెలుసుకునేం దుకు నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కబాడీ గూడెం, ప్రధాన చేపల మార్కెట్‌లో పర్యటించారు. వీధుల్లో సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. పేదలు ఎదుర్కొం టున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కమిషనర్ నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ఇలా సాగింది.
నగరంలోని మురికివాడల్లో ఒకటైన కబాడీ గూడెంలో అడుగుపెట్టిన కమిషనర్‌కు రోడ్డు పక్కన పాత దుస్తులతో ఏర్పాటు చేసుకున్న స్నానపు గదులు కనిపించాయి. అక్కడ ఉన్న యందం మార్తమ్మను ‘ఏంటమ్మా.. పాత బట్టలతో ఇలా కట్టుకున్నారు’ అని కమిషనర్ ప్రశ్నించారు.
యందం మార్తమ్మ: మాకు మరుగుదొడ్లు లేవు సార్. స్నానాలు చేయడానికి వీటిని కట్టుకున్నాం.
కమిషనర్ : ఏమ్మా.. ఇక్కడ మంచినీళ్లు వస్తున్నాయా.
మాండ్రు మార్తమ్మ : వస్తున్నాయ్ సార్. అందరికీ ఒకే కుళాయి ఉంది.
కమిషనర్ : రూ.200 కడితే కుళాయి మంజూరు చేస్తాం. అందరూ దరఖాస్తు చేసుకోండి. ప్రతి ఇంటికీ కుళాయి వచ్చే ఏర్పాటు చేస్తాను.
అక్కడి నుంచి ముందుకెళ్లిన కమిషనర్‌కు రోడ్డుమీదే పొరుు్య కనిపించింది.
అక్కడి ఇంట్లో ఉంటున్న మహిళను పిలిచిన కమిషనర్ ‘ఏమ్మా.. ఇలా రోడ్ల మీదే పొరుు్య పెడితే ఎలా. ఇలా చేయడం మంచిది కాదు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. ఇకనుంచి ఇలా చేయకండి’ అని సూచించి ముందుకు కదిలారు.
తేళ్ల ప్రసాదరావు : సార్.. వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయ్. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మురుగు ఎక్కువగా ఉండటంతో దోమలు పట్టపగలే చంపేస్తున్నాయ్.
కమిషనర్ : మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటాం. మీరు కూడా డ్రెరుునేజీల్లో చెత్తాచెదారం వేయకుండా సహకరించాలి.
కమిషనర్ : ఏమ్మా.. మీ సమస్యలేంటి.
చౌటపల్లి కుమారి : పందులు ఎక్కువగా తిరుగుతున్నాయి. వాటివల్ల పిల్లలు రోగాల బారిన పడుతున్నారు.
కమిషనర్ : తగిన చర్యలు తీసుకుంటాం. దోమల బారినుంచి రక్షించుకోవడానికి దోమ తెరలు వాడండి.
కమిషనర్ : ఇక్కడ కమ్యూనిటీ హాలు ఉంది కదా. వాడుతున్నారా.
దాసరి వెంకటేశ్వరమ్మ : వాడటం లేదు. ఎప్పుడూ మూసే ఉంటోంది. దానిలో కూడా ఎటువంటి సౌకర్యాలూ లేవు.
కమిషనర్ : ఏమ్మా.. మీకూ మరుగుదొడ్లు లేవా.
చౌటపల్లి సువర్ణ : లేవు సార్. కట్టించుకోవడానికి స్థలం కూడా లేదు.
కమిషనర్ : అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తాం. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
వి.రత్నకుమారి : ఉన్నాయి సార్. వాటినే వినియోగిస్తున్నాం.
కమిషనర్ : మీ ఇల్లు బాగానే ఉందా.
నాగమణి : లేదు సార్. వర్షం నీరు కారుతోంది.
కమిషనర్ : ఇల్లు కట్టుకోవడానికి రుణాలు వచ్చే ఏర్పాటు చేస్తాం. మీరంతా మీ పిల్లలను బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలి.
అక్కడి నుంచి కమిషనర్ పక్కవీధిలోకి వెళ్లారు. పలువురు మహిళలు ఆయన వద్దకు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. సావధానంగా విన్న కమిషనర్ వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
దాసరి వెంకటేశ్వరమ్మ : మాకు ఇళ్లు లేవండి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిప్పిస్తే ఇళ్లు కట్టుకుంటాం.
కమిషనర్ : తప్పకుండా. మీరంతా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారా.. రుణాలు తీసుకున్నారా.
దాసరి వెంకటేశ్వరమ్మ : ఎన్నికలకు ముందే రుణాలకు కాయితం పెట్టుకున్నాం సార్. ఓట్లు అడగడానికి వచ్చిన వారంతా రుణాలిప్పిస్తామన్నారు. ఇప్పటివరకూ మా మొహాలు చూసిన వారే లేరు.
ఖాజా : ఇళ్ల మీదుగా కరెంటు తీగలు వెళుతున్నాయ్. అప్పుడప్పుడూ తెగి ఇళ్లపై పడుతున్నాయ్.
స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించిన కమిషనర్ వ్యాపారులు, వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కమిషనర్ : ఏమ్మా.. ఇక్కడ ఇన్ని షాపులు కట్టాం. నువ్వు బయట చేపలు అమ్ముతున్నావేంటి.
నీలం వరలక్ష్మి : వాటిలో నాకు షాపు ఇవ్వలేదు సార్. అందుకే బయట అమ్ముతున్నాను.
కమిషనర్ : ఏమ్మా.. నీకు షాపు ఉందా.. లేదా
నూతిపిల్లి దుర్గమ్మ: దుకాణాలు బాగా ఎత్తుగా కట్టారు సార్. పైగా లైట్లు లేవు. నీరు రాదు. అసలు ఎటువంటి సౌకర్యాలూ లేవు.
కమిషనర్ : కొనుగోలు చేయడానికి వచ్చేవారికి ఇబ్బందులు కలిగించవద్దు. మీకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తా.
అక్కడి నుంచి ముందుకెళ్లిన కమిషనర్‌ను అరటి పండ్లు అమ్ముకుంటున్న మహిళలు
‘నమస్తే సార్’ అంటూ పలకరించారు.
కమిషనర్ : బాగున్నారా. మీ సమస్యలేంటి.
లొట్టి లక్ష్మి : మాకెవరికీ దుకాణాలు లేవు సార్. ఇక్కడ వ్యాపారం చేసుకుంటేనే నాలుగు డబ్బులొస్తాయ్. ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట వ్యాపారాలు చేసుకుంటాం. ఇక్కడివారంతా మమ్మల్ని వెళ్లిపొమ్మని గదమాయిస్తున్నారు. మేమెలా బతకాలి సార్.
కమిషనర్ : సమగ్ర సర్వే చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పథకం ప్రవేశ పెట్టింది. ఆ పథకం మీకు వర్తింప చేయడానికి కృషి చేస్తా.
అనంతరం పి.వెంకటేశ్వరరావు అనే వినియోగదారునితో మాట్లాడుతూ ‘ఈ మార్కెట్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయ్. ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందా’ అని అడిగారు
పి.వెంకటేశ్వరరావు : సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి సార్. సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై వచ్చేవారికి పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.
కమిషనర్ : ఓకే.. దృష్టి పెడతా.
ఇంతలో ఉండవల్లి జయలక్ష్మి అనే మహిళ ఇంటిపన్ను కాగితాలతో వచ్చింది.
కమిషనర్ : ఏమ్మా.. ఇంటిపన్ను కాగితాలు పట్టుకుని తిరుగుతున్నారేమిటి.
ఉండవల్లి జయలక్ష్మి : నా భర్త మిలటరీలో పనిచేసి రిటైరయ్యారు. కొంతకాలానికి చనిపోయారు. మాజీ సైనికుల కుటుంబాలకు ఇంటి పన్ను మినహాయింపు వస్తుందని తెలిసి మీ ఆఫీసుకే వస్తున్నాను. ఈలోపు మీరే ఇక్కడ కనిపించారు.
కమిషనర్ : మాజీ సైనికుల కుటుంబాలకు ఇంటిపన్ను మినహాయింపు ఉంటుంది. మా కార్యాలయ సిబ్బందిని కలవండి.
మురికి వాడల
అభివృద్ధికి కృషి చేస్తాం
నగరంలోని మురికివాడల్లో నివశిస్తున్న ప్రజల జీవనం ఎంతో దుర్భరంగా ఉండటాన్ని గమనిం చాం. మురికి వాడల్లో సౌకర్యాల కల్పన, అభివృ ద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తాం. అక్కడి ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిం చాలి. మరుగుదొడ్లు లేనివారికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. ఖాళీ స్థలం లేనిపక్షంలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టిస్తాం. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మురికివాడల్లో నివాసాన్ని ఆనందమయం చేసుకోవడానికి అనువైన జీవన విధానాలపై అవగాహన కల్పించడానికి అక్కడి ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తాం. పందులు, కుక్కల బెడద నివారణకు చర్యలు చేపడతాం. రూ.3 కోట్లతో నిర్మించిన చేపల మార్కెట్‌లో సౌకర్యాలు లేవు. సౌకర్యాలు మెరుగుపరిచి మార్కెట్‌ను వ్యాపారులకు అందుబాటులోకి తీసుకువస్తాం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం.
- యర్రా సారుుశ్రీకాంత్, కమిషనర్