ఫ్రెండ్లీ పోలీస్ | friendly police vip Reporter kgv Sarita DSP in Eluru | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్లీ పోలీస్

Published Sun, Nov 23 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

ఫ్రెండ్లీ పోలీస్

ఫ్రెండ్లీ పోలీస్

అది ఏలూరు నగరానికి నడిబొడ్డు.. నిత్యం రద్దీగా ఉండే ఫైర్‌స్టేషన్ సెంటర్. సాయంత్రం 5.10 కావస్తోంది. కాలేజీలు విడిచిపెట్టడంతో విద్యార్థులు బృందాలుగా ఆ ప్రాంతానికి వస్తున్నారు. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లేందుకు బస్సులు, ఆటోల కోసం అక్కడికి చేరుకుంటున్నారు. అంతలో పోలీసు వాహనం వచ్చి ఆగింది. అందులోంచి ఒక మహిళ పోలీస్ యూనిఫాంలో హుందాగా దిగారు. ఆమె పేరు కేజీవీ సరిత. ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ)గా పనిచేస్తున్న ఆమె అక్కడ నిలబడిన వారికి తనను తాను పరిచయం చేసుకున్నారు.
 
 ‘పోలీసుల నుంచి ప్రజలేం కోరుకుంటున్నారు.. పోలీసులు పరిష్కరించదగిన సమస్యలు ఏమున్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ ముందుకు వచ్చా’నని చెప్పారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు. ఆ తరువాత అమీనా పేటలోని ఎస్సీ, బీసీ హాస్టళ్ల సముదాయూనికి వెళ్లారు. అక్కడి విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శనివారపుపేట కాజ్‌వే వద్ద గల మద్యం దుకాణం వద్దకు వెళ్లి స్థానికుల సమస్యలపై ఆరా తీశారు. రెండు గంటలకు పైగా వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడిన సరిత ‘పోలీసోళ్లు కాదు.. మన పోలీస్.. ప్రజలు అలా భావించాలి.. అదే మా లక్ష్యం’ అని చెప్పారు. ప్రాథమికంగా పోలీసులు చక్కదిద్దాల్సిన సమస్యలపై తనకు అవగాహన వచ్చిందని.. ఇందుకు సాక్షికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆమె వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే...
 
 డీఎస్పీ సరిత హామీలు
 ‘సాక్షి’ చేపట్టిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో నేరాల అదుపునకు సబ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం నా దృష్టికి వచ్చిన సమస్యల్లో ప్రధానంగా విద్యార్థినులపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈవ్ టీజర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. చైన్ స్నాచింగ్‌లను నివారించడానికి బీట్లను పెంచుతాం. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో బస్సులు ఆపేవిధంగా ఆర్టీసీ అధికారులతో చర్చిస్తాం. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులకూ సూచనలిస్తాం. హాస్టళ్లల్లో లైబ్రరీ ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, ప్రహరీ గోడలు ఎత్తు పెంచడం వంటి సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. హాస్టళ్ల వద్ద, కళాశాలల వద్ద ఇప్పటికే మఫ్టీలో సిబ్బందిని పెట్టాం. ఇంకా అదనపు సిబ్బందిని ఆ పనిమీద నియమిస్తాం. మద్యం దుకాణాల వద్ద అనుమతి లేకుండా సిట్టింగ్ రూములు నడిపితే వాటి లెసైన్సులు రద్దు చేయిస్తాం.
 
 ఫైర్ స్టేషన్ సెంటర్‌లో కళాశాల విద్యార్థినులను పలకరించిన డీఎస్పీ సరిత ‘మీరు ఏ కాలేజీ.. ఏం చదువుతున్నారు.. మీకేమైనా సమస్యలున్నాయా’ అని ప్రశ్నించారు.
 లావణ్య : కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కొంతమంది యువకులు ఈవ్‌టీజింగ్ చేస్తున్నారు మేడం.
 డీఎస్పీ : అక్కడే ఉన్న వనజ అనే మహిళతో ‘ఏమ్మా మీకేమైనా సమస్యలున్నాయా.. పోలీసు శాఖ నుంచి మీరు ఎలాంటి సేవలు ఆశిస్తున్నారు.
 వనజ : రాత్రి 7 దాటితే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలన్నా భయమేస్తోంది మేడం. బస్సుల్లో
 కూడా ఈవ్‌టీజర్లు వేధిస్తున్నారు.
 ఇంతలో రాఘవరావు అనే వ్యక్తి వచ్చి ‘మాది శాంతినగర్ మేడం. మా ప్రాంతంలో పట్టపగలు కూడా చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో పోలీసుల గస్తీ ఏర్పాటు చేయండి. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోమని మీ ఆధికారులకు చెప్పండి మేడం’ అని విజ్ఞప్తి చేశారు. సరేనని హామీ ఇచ్చిన డీఎస్పీ అక్కడి నుంచి అమీనాపేటలోని హాస్టళ్లకు చేరుకున్నారు. పోలీసు శాఖ నుంచి మీరేం కోరుకుంటున్నారని అక్కడి యువతులను అడిగారు.
 నందమూరి భాగ్యం : హాస్టల్ నుంచి బయటకు వెళ్లినప్పుడు కొంతమంది అబ్బాయిలు టీజింగ్ చేస్తున్నారు మేడం. అసభ్య కామెంట్లు చేస్తున్నారు. బైక్‌ల మీద వేగంగా వెళుతూ భయపెడుతున్నారు.
 డీఎస్పీ : నువ్వు చెప్పమ్మా.. నువ్వేం కోరుకుంటున్నావ్.
 ప్రసన్న : మేడం.. హాస్టల్ చాలా ఇరుకుగా ఉంటోంది. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో దోమలు అధికంగా ఉండి చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది.
 డీఎస్పీ : ప్రధాని మోదీ ఈ మధ్య ఒక కార్యక్రమం చేస్తున్నారు. మీకెవరికైనా తెలుసా.
 విద్యార్థినులు : తెలుసు మేడం.. దానిపేరు స్వచ్ఛ భారత్.
 డీఎస్పీ : మరి మీ హాస్టల్‌లో ఆ కార్యక్రమం చేశారా.
 విద్యార్థినులు : చేశాం మేడం.. కానీ ఇంకా మేం చేయలేని పనులు మిగిలి పోయాయి.
 డీఎస్పీ : హాస్టల్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి.
 కల్పన : ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండటంతో ఆకతాయిలు గోడదూకి లోనికి వస్తున్నారు. అప్పుడప్పుడూ దొంగలు కూడా వస్తున్నారు మేడం.
 డీఎస్పీ : కళాశాలకు వెళ్లేప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురౌతున్నాయా.
 లక్ష్మీప్రియ : శనివారపుపేట కాజ్‌వే వద్ద బ్రాందీ షాపు ఉంది మేడం. అక్కడ తాగుబోతుల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. అటువైపు నుంచి రాలేకపోతున్నాం.
 అప్పుడే కళాశాల నుంచి వచ్చిన ఒక విద్యార్థినిని డీఎస్పీ ఆపి ‘ఏమ్మా.. కాలేజీకి ఎలా వెళుతున్నావ్. నీకు ఏ మైనా సమస్యలున్నాయా’ అని అడిగారు.
 సౌందర్య : మా నాన్నగారు ఆటో డ్రైవర్. నేను ఇంజినీరింగ్ సెకండియర్ చేస్తున్నాను మేడం.
 డీఎస్పీ : మీ కాలేజీలో ర్యాగింగ్ ఉందా.
 సౌందర్య : లేదు మేడం.. మా కాలేజీలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది.
 డీఎస్పీ : మీ కాలేజీ యాజమాన్యాన్ని అభినందించాలి. ర్యాగింగ్‌ను ఆపడానికి ఏం చేశారు.
 సౌందర్య : ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
 డీఎస్పీ : నువ్వు చెప్పమ్మా.. హాస్టల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయ్.
 విజయలక్ష్మి : హాస్టల్‌లో వసతులన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే మంచి లైబ్రరీ ఉంటే చదువుకోవడానికి మరింత అవకాశముంటుంది మేడం.
 డీఎస్పీ : మీ వార్డెన్ ఎవరు.
 విజయలక్ష్మి : మంగళ మేడం.
 డీఎస్పీ : ఆవిడ ఇక్కడ ఉన్నారా.
 మంగళ : ఇక్కడే ఉన్నానండి.
 డీఎస్పీ : ఇక్కడి విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలు మీకు తెలుసా!
 మంగళ : తెలుసు మేడం. వాటిని పరిష్కరించాలని మా డెప్యూటీ డెరైక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. 6.30-7 గంటల మధ్య హాస్టల్ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. వారిపై కాస్త దృష్టి పెట్టండి.
 హాస్టల్‌లో విద్యార్థినుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ శనివారపుపేట కాజ్‌వే వద్ద గల మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడే కౌంటర్ వద్ద నిలబడి మద్యం సేవిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను చూడటంతోనే మందుబాబులు కొందరు పలాయనం చిత్తగించారు. కౌంటర్ వద్దకు వెళ్లిన డీఎస్పీ దుకాణం నిర్వాహకునితో ‘ఇది బారా.. షాపా’ అని ప్రశ్నించారు. ‘షాపు పక్కనే సిట్టింగ్ ఇస్తున్నారేంటి. షాపుకు లెసైన్సు ఉందా.. సిట్టింగ్‌కు అనుమతి ఉందా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటువైపు వెళుతున్న కాలేజీ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారట నీకు తెలుసా. కేవలం అమ్ముకోవడమొక్కటే కాదు ఇతరుల గురించి కూడా ఆలోచించాలనే ధ్యాస ఉందా లేదా’ అంటూ చీవాట్లు పెట్టారు. బయటకు వచ్చి అక్కడ సిట్టింగ్ సౌకర్యం కల్పిస్తున్న మహిళపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇకనుంచి ఇక్కడ వ్యాపారం చేయననని ఆమె డీఎస్పీకి స్పష్టం చేసింది.
 
 అక్కడి నుంచి ఎదురుగా ఉన్న దుకాణదారుల వద్దకు వెళ్లిన డీఎస్పీ.. ‘చెప్పండి.. మీకేమైనా సమస్యలున్నాయా’ అని అడిగారు. ‘లక్షలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నాం మేడం. ఇక్కడ తాగుబోతులు మా దుకాణాల మెట్లపై కూర్చుని నానాయాగీ చేస్తున్నారు. అదేమని అడిగితే దాడులు చేస్తున్నారు’ అని ఓ వ్యాపారి చెప్పారు. పక్కనే ఉన్న మరో వ్యాపారి మాట్లాడుతూ.. ‘తాగుబోతుల కారణంగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయ్ మేడం. తాగి రోడ్లమీదకు వచ్చి అడ్డదిడ్డంగా వెళుతుండటంతో వాహనాలు నడిపేవారు ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement