
సజావుగా ‘సాగ’నివ్వండి
మార్చి నెలాఖరుకల్లా రబీ సాగు పూర్తి చేయకుంటే క్లోజర్‌లో ఆధునికీకరణ పనులు చేయలేమని నీటిపారుదల శాఖ అంటుంటే.. కనీసం ఏప్రిల్ 15 వరకు నీరిస్తేనే సాగు సజావుగా పూర్తవుతుందని రైతులంటున్నారు. రబీకి నీటి సరఫరా, సాగు పరిస్థితులపై రైతులు, నీటిపారుదలశాఖ భిన్న వాదనలతో ఉన్న నేపథ్యంలో సాగుకు పలు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించే దిశగా రైతులకు అవగాహన కల్పించి, సాగు సమస్యలను ఆ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువెళ్లే బాధ్యతను ‘సాక్షి’ మీడియా చేపట్టింది. ‘సాక్షి’ అభ్యర్థన మేరకు ఎస్‌ఈ ఎస్. సుగుణాకరరావు శనివారం వీఐపీ రిపోర్టర్‌గా సామర్లకోట గోదావరి కెనాల్, పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలో రైతుల సమస్యలను పొలాల్లోకే వెళ్లి తెలుసుకున్నారు. పూడుకుపోయిన డ్రైన్‌లు, కాలువలు, గట్లకు గండ్ల వంటి సమస్యలను రైతులు ఎస్‌ఈ దృష్టికి తీసుకువచ్చారు.
ఆ రిపోర్టింగ్
ఎస్‌ఈ సుగుణాకరరావు : ఏం పెద్దాయనా.. నీ పేరేమిటి? రబీ సాగులో ఏమైనా ఇబ్బందులున్నాయా?
రైతు : వెలమర్తి బులిరాజండీ. మా ఊరు వి.కె.రాయపురం. నీలం తుపానప్పుడు సామర్లకోట కెనాల్‌కు రెండుచోట్ల పడ్ల గండ్లను పూడ్చకున్నారు. పొలాలు మునిగిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. మీరైనా కాస్త దయచూపండయ్యా!
ఎస్‌ఈ: ఆ తుపాన్‌తో రెండుచోట్ల గండ్లు పడితే పూడ్చడానికి రూ.95 లక్షలతో అంచనాలు రూపొందించాం. వచ్చే మార్చి, ఏప్రిల్ లోపు పనులు మొదలు పెట్టించి మీకు సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. నిశ్చింతగా ఉండు పెద్దాయనా.
మరో రైతు: నా పేరు రేలంగి రామారావు. వెస్ట్ ఏలేరు కెనాల్ కాలువపై ఫుట్‌పాత్ వంతెన ఉన్నా ధాన్యం తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందవుతోంది సారూ. (మరో రైతు వి.శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ) ఒక ధాన్యం బస్తా తేవాలంటేనే రూ.50 నుంచి వంద రూపాలు ఎగస్ట్రా అయిపోతోందండి. ఇంతవరకు మా బాధ ఎవరూ పట్టించుకోలేదండి.
ఎస్‌ఈ: మీకు దగ్గర్లో మరో వంతెనేమైనా ఉందా?
రైతులు: ఎక్కడా లేకపోబట్టే కదా సారూ.. పండించిన గింజలు తెచ్చుకోవాలన్నా కష్టమైపోతోంది.
ఎస్‌ఈ: డ్రైనేజీ ఆధునికీకరణకు నిధులు పుష్కలంగా ఉన్నాయి. మా ఈఈని పంపిస్తాను. అన్నీ పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేసి పనులు చేపట్టే ప్రయత్నం చేస్తాను నన్ను నమ్ముతారు కదా! మీరేదో చెపుదామనుకుంటున్నారు చెప్పండి మీ సమస్య.
రైతు: నా పేరు బేతిన బాబ్జీ సార్. జగ్గమ్మగారిపేటలో తరచు కాలువకు గండ్లు పడుతున్నాయి. ఆ సమస్యను పరిష్కరిస్తారని.
ఎస్‌ఈ: ఆధునికీకరణ పనులు చేయడానికి కనీసం రెండు నెలలు కావాలి. డిసెంబరు ఫస్ట్ నుంచి నీరు ఇచ్చాం. ఇప్పటికీ ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఇలా అయితే పనులు ఎలా చేపట్టగలమో మీరే మావైపు ఆలోచించండి. మీరు సహకరిస్తేనేమేం ఏమైనా చేయడానికి ఉంటుంది.
రైతు: సార్ నా పేరు చుండ్రు శ్రీరామచంద్రమూర్తి సర్, మీరేమనుకున్నా కానీ పిఠాపురం, ఏలేరు కింద సాగు కొంత ఆలస్యమవుతుంది. మార్చి నెలాఖరుకు కాలువలు కట్టేస్తామంటే కరెక్టు కాదండి. ఏప్రిల్ వరకు నీరివ్వాల్సిందే.
ఎస్‌ఈ: లేదంటే డెరైక్ట్ సోయింగ్(వెదజల్లు) వేయొచ్చు కదా, వాటర్ లేకా, లేబర్ దొరక్కా.. ఎందుకు లేటవుతుందో చెప్పండి. మీరు నారుమడి ముందుగా వేసుకోవాలి కదా!
రైతు: నా పేరు సత్తిబాబండీ, లేబర్ దొరక్క ఆలస్యమవుతోంది, మీరే కాస్త మా పక్కనుంచి ఆలోచించండి సారూ.
ఎస్‌ఈ: మా సమస్య మాకుంది. ఆధునీకరణకు ఆరుకోట్లున్నా మీరు సహకరించకపోతే పనులు చేయలేం. మీరంతా వచ్చారు కాబట్టి ఒకసారి ఆలోచించండి మరి.
రైతు: సర్ నా పేరు ఇంటి వెంకట్రావండీ. మేం అడుగుతుంది ఏప్రిల్ 15 దాకానే కదా. మూడేళ్లుగా పంటలు పోయాయి. అప్పుల్లో ఉన్నాం. ఏదో భగవంతుడు కరుణించాడు కాబట్టే కొద్దిగా గుక్కతిప్పుకున్నాం. నీరు ఇచ్చేది కాస్త పొడిగించండి బాబూ.
మరో రైతు: నా పేరు రాజబాబు సార్. సామర్లకోట లాకులు ఓపెన్ చేయడం లేదండి. ఎస్సీ పేట మొత్తం మునిగిపోతోంది. 20 వేల ఎకరాల్లో వ్యవసాయం ఉత్తినే ఇస్తామన్నా చేయడానికి కూడా ఎవరూ రావడం లేదు.
ఎస్‌ఈ: సరే మా డీఈని సోమవారం మీ దగ్గరకు పంపిస్తాను. మీరంతా దగ్గరుండి ఆ సమస్యను పరిశీలించండి. ఆధునికీకరణ పనుల్లో చేపట్టేలా చర్యలు తీసుకుంటాను.
రైతు: నా పేరు సత్తిరాజు. సారూ నేను కూడా ఏదైనా చెప్పొచ్చా? (మరోరైతు) నా పేరు శ్రీనివాసండీ. మేమంతా సమస్యలన్నింటినీ కలిసే చెబుతామండీ. కల్వర్టులు పోయాయి. తమరు మాయందు దయుంచి మాకు గిఫ్ట్‌గా ఇవ్వండి సర్, మీకు రుణపడి ఉంటాం. 28/4 నంబర్ పైపు కింద వాటర్ రావడం లేదండీ.గోడ కూలగొట్టేశారు. నీరు మెరకకు రావడం లేదు. తూటేరుడ్రైన్ మొత్తం మూసుకుపోయింది. వీకే రాయపురం, హుస్సేన్‌పురం వంటి గ్రామాలు ముంపులో ఉంటున్నాయి. డ్రైన్ తవ్వి పాతికేళ్లయ్యిందయ్యా.
ఎస్‌ఈ: మా నోటీసుకు తీసుకువచ్చారు కదా. ఐదు లక్షల లోపు అంచనాలుంటే మీరంతా కలిసి ఆయకట్టు కమిటీగా ఏర్పడితే మీ ద్వారానే పనులు పూర్తి చేస్తాం. 28/4 నంబర్ పైపు కింద వాటర్ వచ్చేలా చూస్తా. మరో విషయం కూడా చెబుతాను. తుల్యభాగ, టేకి డ్రైన్‌లు చేపట్టాం. సోమవారం ఈఈని పంపించి అంచనాలు తయారు చేయిస్తాను.
రైతు: నేను రైతు సంఘం అధ్యక్షుడినండీ. నా పేరు కంటే బాబు. లెహెర్ తుపాన్‌తో గట్లన్నీ కుంగిపోయాయి. వెస్ట్ ఏలేరు పరిధిలో ఒకపక్క వీకే రాయపురం, మరోపక్క సత్యవరపుపేటలకు కనీసం రోడ్డు కూడా లేదండి. రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఎస్‌ఈ: సామర్లకోట పరిధిలో రూ.92 కోట్ల పనులు మంజూరైతే రూ.16 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన పనులు ఆగిపోవడానికి కారణమైన ఏజెన్సీల అగ్రిమెంట్ రద్దు చేస్తాం. గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయిస్తాను.
సహకార సంఘం అధ్యక్షుడు: సర్ నా పేరు ఊటా వాసండీ. రామేశ్వరం రిటైనింగ్‌వాల్ పోయింది. రైతులు చాలా ఇబ్బందులుపడుతున్నారు.
ఎస్‌ఈ: వాటిని పరిశీలించి ఈ ఏడాది కచ్చితంగా పనులు చేపట్టి పూర్తి చేద్దాం. మీరు కొంత సహకారం అందించాలి, ఇస్తారు కదా.
మరో ఇద్దరు రైతులు: సాగో ఫ్యాక్టరీలు, సుగర్‌ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కలుషితమైన మురుగుతో దూడలు కూడా చచ్చిపోతున్నాయి. దోమలు పెరిగిపోతున్నాయి. పంటలు పోతున్నాయి. మీరే ఏదైనా ఆలోచించండి. సీఎం దాకా వెళ్లింది.
ఎస్‌ఈ: నేను వచ్చి ఆరునెలలే అయింది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళతాను.
రైతు: నా పేరు ప్రభాకరండీ. గుర్రపుడెక్క చాలా ఇబ్బందిపెడుతోంది. లాకుల వద్ద తీసేసి రోడ్డుపై పడేశారు. వాటర్ రావడం లేదు.
ఎస్‌ఈ: ఖరీఫ్‌లోవేసిన డెక్క ఎండిపోయాక తీసేస్తారు. కాంట్రాక్టర్‌కు చిల్లిగవ్వ పేమెంట్ చేయలేదు. సంక్రాంతి వెళ్లాక తీయించేస్తాను.
రైతు: నా పేరు ఎలిశెట్టి భీమన్నదొరండి. పీబీసీ-1 కాలువ పరిధిలో కండికాలువ వద్ద అక్రమ లేఅవుట్‌లు వేశారు. కలెక్టర్ వరకు వెళ్లింది. ఆక్రమణలతో నీరు పోవడం లేదు.
ఎస్‌ఈ: కలెక్టర్‌గారు చెప్పారు.. వెరిఫై చేశాను. 15 వరకు అనధికారిక భవనాలున్నాయి. వాటిని తొలగించాలంటే లక్షన్నర కావాలి. వాటికి మంజూరు రాగానే తొలగించేస్తాము.