చిన్నారి పూర్ణిమ తీవ్ర జ్వరంతో స్పృహ కోల్పోయిన బాలికలతో తల్లిదండ్రులు
కర్నూలు, కోసిగి: మండల పరిధిలోని జుమ్మలదిన్నె గ్రామం మంచం పట్టింది. డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వ వైద్యులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతి ఇంటిలో నలుగురైదుగురు జ్వరాల బారిన పడి ఆదోని, కోసిగి, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇప్పటికే 50 మందికి పైగా వైద్యపరీక్షలు చేయించుకోగా డెంగీగా ప్రైవేట్ డాక్టర్లు చెప్పినట్లు బాధితులు పేర్కొంటున్నారు.
గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి చరణ్ తేజ్ డెంగీ లక్షణాలతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మరో కుటుంబంలోని ఐదుగురు కూడా జిల్లా కేంద్రలోనే చికిత్స పొందుతున్నారు. రెండేళ్ల చిన్నారి ఉష కూడా ఇటీవల కర్నూలులో చికిత్స చేయించుకుంది. హోసన్న, పూర్ణిమ, దేవరాజు, లోకేష్, ఈరమ్మ, నాగమ్మతో పాటు పలువురు జుమ్మలదిన్నె, కోసిగి, ఎమ్మిగనూరులోని ప్రైవేట్ డాక్టర్ల వద్ద చికిత్స చేయించుకున్నారు. గురువారం రాత్రి ఓ బాలిక తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై కుప్పకూలి పడిపోయింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు చేయించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment