జిల్లా ఆస్పత్రిలో రద్దీగా ఉన్న చిన్న పిల్లల ఓపీ
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : వైరల్ జ్వరాలు పిల్లలను కాటేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో చాపకింద నీరులా దాడి చేస్తున్నాయి. ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు ఇన్‌ఫెక్షన్లు సులభంగా దాడి చేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలమైంది. ఈ సీజన్‌లో ప్రతి 10 మందిలో ఒకరికి జలుబు, దగ్గు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిని బాధించే వైరల్ ఇన్‌ఫెక్షన్లలో ఫ్లూ జ్వరం ఒకటి. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చిన్న పిల్లల్లో ఎక్కువగా ..
ఎక్కువమంది చిన్న పిల్లలు జ్వరాలు, దగ్గు, జలుబుతో బాధ పడుతున్నారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రితో పాటు జ్వర పీడితులతో ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కొందరు పిల్లల్లో డెంగ్యూ పాజిటివ్ లక్షణాలు కనబడడంతో కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఒకటి, రెండు డెంగ్యూ కేసులు బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 150 మందికి పైగా పిల్లలు ఓపీలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో సుమారు 50 మందికి పైగా చిన్నారులు వైద్యం తీసుకుంటున్నారు. ఎక్కువ మంది చేరడంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్త్రీ, పురుషుల జనరల్ వార్డులు కూడా జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే టోకెన్ కూడా దొరకడం కష్టంగా మారింది. ఉదయం టోకెన్ తీసుకుంటే రాత్రికి గాని వైద్యుడి వద్దకు వెళ్లడానికి అవకాశం దొరకడం లేదు.
ఎలా వస్తాయంటే..
వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. వైరల్ జ్వరాలకు మరో కారణం కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుచించుపోతాయి. దాని వల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువ మంది గుమికూడి ఉండే చోట్లలో వైరల్ వ్యాప్తి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందుకే పిల్లల్లో జ్వరాలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అదే విధంగా రద్దీగా ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంది.
లక్షణాలు ఇవీ..
వైరల్ జ్వరాల బారిన పడిన వారిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరం నిస్పత్తువ, తలనొప్పి ఉంటాయి. ఆహారం తీసుకోకపోవడం, గొం తునొప్పి, ముక్కులో నీళ్లు కారడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా వ్యాయామం చేసేవారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. చాలా వరకు వైరల్ జ్వరాలు వాటికవే 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి.
♦ జ్వరంతో పాటు తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఒంటి నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
♦ పిల్లలతో పాటు పెద్దలు కూడా కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
♦ పిల్లలను ఐస్‌క్రీమ్‌లకు దూరంగా పెట్టాలి.
♦ వాతావరణం చల్లగా ఉంటుంది కావున పిల్లలకు రాత్రి వేళల్లో వెచ్చదనం కోసం దుప్పటి కప్పి నిద్రపుచ్చాలి.
♦ ఆకాశం మేఘావృతం అయినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్న సమయంలో పిల్లలను బయటకు పంపరాదు.
♦ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి
వాతావరణంలో మార్పుల కారణంగా చిన్న పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో రోజు ఆస్పత్రికి 150 మందికి పైగా చిన్నారులు వస్తున్నారు. పిల్లలను చల్లని వాతావరణంలో తిప్పకూడదు. రాత్రి వేళల్లో దుప్పటి కప్పి పడుకోబెట్టాలి. జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి.– డాక్టర్ డేవిడ్ సెల్వన్‌రాజ్, ఆర్‌ఎంఓ,చిన్నపిల్లల వైద్యుడు. ప్రొద్దుటూరు
Comments
Please login to add a commentAdd a comment