ఫిబ్రవరిలో తీరానికి విరాట్
నాలుగు ప్రాంతాల గుర్తింపు
{పైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యత
సంస్థ ద్వారా విధివిధానాల రూపకల్పన
విశాఖపట్నం : విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ తీరానికి రానుంది. డీ కమిషన్ చేసిన తర్వాత ఇక్కడకు తీసుకొచ్చేందుకు కనీసం నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. విరాట్ రాకకు సంబంధించిన విశేషాలను మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజ్ వివరించారు. అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రభుత్వాదేశాల మేరకు వుడా వీసీ బాబూరావునాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించారు. విరాట్ కొలువుకు పది ప్రాంతాలు ఎంపిక చేసినప్పటికీ వుడా పార్కు, తెన్నేటి పార్కు, జోడుగుళ్ల పాలెం, సాగర్‌నగర్ ప్రాంతాలను విరాట్ ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఈ నాలుగు ప్రాంతాల్లో ఏదో ఒకచోట విరాట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపించారు.
ఈ నాలుగు ప్రాంతాలను నిపుణులతో కూడిన కమిటీ కూడా పరిశీలించే అవకాశాలున్నాయి. డీ కమిషన్ తర్వాత విశాఖ తీరానికి తీసుకొచ్చేందుకు రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. విరాట్ ఏర్పాటు చేసే ముందుగానే ఈ నౌకను పూర్తి మ్యూజియంగా మార్పు చేయనున్నారు. వాణిజ్యపరంగా కూడా లాభదాయకంగా ఉండేందుకు అనువుగా ఈ నౌకను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వీటి నిర్వహణ బాధ్యతలను అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పన కోసం కన్సల్టెన్సీ కోసం క్రైసల్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ నౌకను పార్కింగ్ చేసే ప్రదేశంలో అవసరమైన మౌలిక వసతులను నౌక వచ్చే నాటికి సమకూర్చాల్సి ఉందని, ఇప్పటికే ఏ రకమైన సదుపాయాలు కల్పించాలనే దానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని కలెక్టర్ యువరాజ్ తెలిపారు. స్థల ఎంపిక ఖరారైతే ప్రభుత్వ అనుమతులతో మౌలికవసతుల కల్పనకు సంబంధించిన పనులకు శ్రీకారం చుడతామన్నారు.