బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ ఎయిర్‌పోర్టు
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు అమితంగా ఇష్టపడే బ్యాంకాక్‌కు విశాఖ నుంచి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. విశాఖ ప్రాంతవాసుల ఐదేళ్ల కల నేటి అర్ధరాత్రికి నెరవేరనుంది. విశాఖ నుంచి సోమ, మంగళ, గురు, శనివారాల్లో అంటే వారంలో నాలుగు రోజుల పాటు థాయ్ ఎయిర్ ఏసియా తమ సర్వీసులను బ్యాంకాక్‌కు నడపనుంది. ఏడో తేదీ రాత్రి బ్యాంకాక్‌లోని డాన్‌ముయాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి 11.45 గంటలకు విశాఖ చేరుతుంది. 30 నిమిషాల అనంతరం శుక్రవారం అర్ధరాత్రి దాటాక 12.15 గంటలకు బ్యాంకాక్‌కు తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. విశాఖపట్నం–బ్యాంకాక్‌ల మధ్య ఉన్న 1,905 కిలోమీటర్ల దూరాన్ని 2.45 గంటల్లో చేరుకుంటుంది. టిక్కెట్టు ధర డిమాండ్‌ను బట్టి రానూపోనూ రూ.6,000–14,000 మధ్య ఉంది. బ్యాంకాక్‌కు విశాఖ నుంచి విమాన సర్వీసు నడపాలన్న ప్రతిపాదన 2013 నుంచి ఉంది. ఏడాది క్రితమే ఈ సర్వీసు ప్రారంభించాలనుకున్నా, అప్పట్లో నేవీ ఆంక్షలతో వీలు పడలేదు. ఎట్టకేలకు ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. మరోవైపు డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు భారతీయులకు థాయ్‌లాండ్ ఉచిత వీసా సదుపాయం కల్పించింది. ఇది కూడా ప్రయాణికులు పెరగడానికి దోహదం చేస్తుంది.
డబ్బు, సమయం ఆదా
ఇన్నాళ్లు విశాఖ ప్రాంత వాసులు బ్యాంకాక్ (థాయ్‌లాండ్) వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలకు వెళ్లి అక్కడ నుంచి బయలుదేరాల్సి వచ్చేది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు 2,400 కి.మీ., చెన్నై నుంచి 2,254 కి.మీ. ఉండగా విశాఖ నుంచి 1.905 కిలోమీటర్లు మాత్రమే ఉంది. హైదరాబాద్, చెన్నైల మీదుగా బ్యాంకాక్ Ððవెళ్లడానికి 8–10 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు విశాఖ నుంచి నేరుగా బ్యాంకాక్‌కు కేవలం 3 గంటల్లోపే చేరుకుంటారు. దీనివల్ల సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.
సగటున రోజుకు 40 మంది..
విశాఖ ప్రాంతం నుంచి బ్యాంకాక్‌కు రోజుకు సగటున 60 మంది చొప్పున వెళ్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా రోజుకు 40–50 మంది, చెన్నై మీదుగా 20–30 మంది ప్రయాణిస్తున్నారు. ఇతర మార్గాల్లో విశాఖ నుంచి రోజుకు 30 మంది వరకు సిల్క్ ఎయిర్‌వేస్ విమానంలో బ్యాంకాక్ పయనమవుతున్నారు.
నాలుగో అంతర్జాతీయ సర్వీసు
ఇప్పటివరకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్, మలేసియా, దుబాయ్‌లకు విమాన సర్వీసులున్నాయి. గతంలో శ్రీలంకకు కూడా విమాన సర్వీసు నడిచేది. కానీ లాభదాయకంగా లేకపోవడంతో అక్టోబర్ 27 నుంచి ఆ సర్వీసును రద్దు చేసుకుంది. దీంతో తాజాగా బ్యాంకాక్ సర్వీసుతో ఈ ఎయిర్‌పోర్టు నుంచి నాలుగో అంతర్జాతీయ సర్వీసు కానుంది. నాక్ ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా ఫిబ్రవరి నుంచి విశాఖ–బ్యాంకాక్‌ల మధ్య కొత్త సర్వీసులను ప్రారంభించనుంది.
తొలి ట్రిప్ ఫుల్
విశాఖ నుంచి బ్యాంకాక్ మధ్య నడిచే విమానంలో 180 సీట్ల సామర్ధ్యం ఉంది. ప్రారంభ ట్రిప్‌లో గురువారం నాటికి 172 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో 20 మంది ఏపీ టూర్స్ అండ్ ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మిగిలిన సీట్లు కూడా శుక్రవారం నాటికి ఫుల్ అయ్యే అవకాశం ఉంది.
ఫార్మా ఎగుమతులకు అనుకూలం
మరోవైపు కొత్తగా ప్రారంభం కానున్న బ్యాంకాక్ విమాన సర్వీసు వల్ల ఫార్మా ఎగుమతిదార్లకు కూడా అనుకూలంగా మారనుంది. ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా జపాన్‌కు వీటి ఎగుమతి జరుగుతోంది. వీటి మధ్య దూరం 6,680 కిలోమీటర్లు, విశాఖ నుంచి సింగపూర్ మీదుగా జపాన్‌కు 8,096 కిలోమీటర్లు ఉంది. విశాఖ నుంచి బ్యాంకాక్ మీదుగా జపాన్‌కు 6,412 కిలోమీటర్లే ఉంది. దీంతో కొత్తగా నడిపే బ్యాంకాక్ విమాన సర్వీసు ఫార్మా ఎగుమతిదార్లకు కూడా లాభదాయకంగా ఉంటుందని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు.
పర్యాటక ప్రగతికి దోహదం
బ్యాంకాక్ విమాన సర్వీసుతో రాష్ట్రానికి వియత్నాం, కంబోడియా, తైవాన్, చైనా తదితర దేశాల నుంచి కనెక్టివిటీ పెరిగి పర్యాటకులతో పాటు బౌద్ధులు ఆకర్షితులవుతారు. ఇది పర్యాటకరంగం వృద్ధికి దోహదపడుతుంది. ఆయా దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మన పర్యాటక విశిష్టతలపై రోడ్డుషోలు నిర్వహించాలి. – కె.విజయమోహన్, ప్రెసిడెంట్, ఏపీ టూర్స్ అండ్ ట్రావెలర్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment