
► బడ్జెట్‌తో జిల్లాకు ఒనగూరనున్న లబ్ధి రాజన్న రాజ్యం తిరిగి తెస్తామన్న భరోసా.. ప్రతి కుటుంబంలో నవరత్న వెలుగులు నింపుతామన్న హామీలు వైఎస్ జగన్‌మోహనరెడ్డిని పట్టాభిషిక్తుడ్ని చేశాయి..
► పాలన పగ్గాలు చేపట్టిన ఆయన సర్కారు తొలిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి. ప్రతివారిలో ఆశల మోసులు.ఆ ఆశలను చిగురింపజేస్తూ.. నమ్మకాన్ని నిలబెట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తొలిపద్దు. ఒకవైపు సంక్షేమ శకానికి, రాజన్న రాజ్యానికి బాటలు వేసే నవరత్నాలకు అధిక ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు ప్రగతికి ఊపిరులూదేలా పలు రంగాలకు కేటాయింపులు పెంచడం.. అందులోనూ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖకు పెద్దపీట వేయడం సర్వత్రా హర్షామోదాలు పొందుతోంది.
► ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగం మొదట్లోనే ఇది నవరత్నాల బడ్జెట్ అని అభివర్ణించడంతోనే జగన్ ప్రభుత్వ ప్రాథమ్యాలేమిటో స్పష్టమైపోయింది.
► వాస్తవానికి ఆర్థిక రాజధానిగా పరుగులు తీయాల్సిన విశాఖ అభివృద్ధి గత టీడీపీ హయాంలో ఐదేళ్లూ కాగితాల్లోనే మగ్గిపోయింది. శిలాఫలకాల్లోనే ఇరుక్కుపోయింది. సదస్సులు, సమ్మేళనాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల హోరులో మరుగున పడిపోయింది. కానీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధిని, అసలు సిసలు ప్రగతిని కాంక్షించారు. అందుకనే.. తన తొట్ట తొలి బడ్జెట్‌లోనే జిల్లాకు పెద్దపీట వేశారు.
► ఇన్నాళ్లూ ప్రకటనలకే పరిమితమైన విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఊపిరి పోశారు. మెట్రో స్థానంలో.. మోనో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు పచ్చజెండా ఊపారు.పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించే విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.200 కేటాయించారు.
► గిరిజనులకు ఆరోగ్య భరోసా ఇచ్చేలా.. వారి పిల్లలకు వైద్య విద్య అందుబాటులోకి తెచ్చేలా విశాఖ మన్యంలో ప్రత్యేక వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.66 కోట్లు కేటాయించారు.
► విశాఖతో సహా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కేటాయింపులను రూ.170 కోట్లకు పెంచారు. అదే చేత్తో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు, విశాఖ నగర తాగునీటి అవసరాలకు ఆధారమైన పురుషోత్తపట్నం, తాడిపూడి ప్రాజెక్టులకు సముచిత స్థాయిలో నిధులు ఇచ్చారు.
► మధ్యతరగతి ప్రజలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతో పాటు వేలాది మత్స్యకారులకు మేలు చేసే వేట నిషేధ భృతి పెంచడంతో పాటు బోట్లకు డీజిల్ సబ్సిడీ నిధులిచ్చారు. అన్నదాత మోముల్లో చిరునవ్వుల సేద్యం చేసేలా.. అన్ని వర్గాల వారికీ ఆసరా కల్పిస్తూ బడ్జెట్‌లో నవరత్నాల వెలుగులు ప్రసరించాయి.
తొలిపద్దే అయినా.. అభివృద్ధికి హద్దులు లేవన్నట్లు సంక్షేమం.. అభివృద్ధే తారకమంత్రంగా రాష్ట్ర బడ్జెట్ ఉందన్న అభినందనలు అన్ని వర్గాల ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment