అల్లిన కథే.. మళ్లీ | Vizag Police Commissioner Press Meet Over Murder Attempt On Ys Jagan | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 3 2019 4:29 AM | Last Updated on Thu, Jan 3 2019 5:16 AM

Vizag Police Commissioner Press Meet Over Murder Attempt On Ys Jagan - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి బ్యూరో:  ఊహించిందే జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని విశాఖ పోలీసులు తేల్చేశారు. టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరి సహా ఇంకెవరి ప్రమేయమూ లేదని చెప్పేశారు. నిందితుడు శ్రీనివాసరావు కేవలం సంచలనం కోసం, పబ్లిసిటీ కోసం తాను రాసిన, రాయించిన లేఖను వైఎస్‌ జగన్‌ చదవాలనే ఉద్దేశంతో కోడి కత్తితో ఆయనపై చిన్న పాటి దాడి చేశాడని.. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు మొదటి రోజు నుంచీ చెబుతున్న కథనే మూడు నెలల విచారణ తర్వాత కూడా అక్షరం పొల్లుపోకుండా వల్లె వేశారు. చివరకు కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేసిన వైనం వివాదాస్పదమవుతోంది. 

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో అక్టోబర్‌ 25న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పక్కనే ఉన్న ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రక్షణశాఖకు చెందిన తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మినహా కేంద్రం మొదలు అన్ని రాజకీయ పక్షాలూ అనుమానిస్తూ వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటన జరిగిన మరుక్షణం నుంచే కేసును నిర్వీర్యం చేసేందుకు, పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు మొదలు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడారు. వైఎస్‌ జగన్‌పై సానుభూతి కోసమే శ్రీనివాసరావు దాడి చేశాడని ఏకపక్షంగా ప్రకటనలు చేశారు. ఏదో చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు యత్నించారు.

అయితే..నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని టి.హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కావడం, పక్కా ప్రణాళిక ప్రకారం నేరచరిత్ర ఉన్న శ్రీనివాసరావుకు తప్పుడు ఎన్‌వోసీ ఇప్పించి రెస్టారెంట్‌లో ఉద్యోగంలో పెట్టడం, ఆగస్టు నుంచి దాదాపు ప్రతివారంలో రెండుసార్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న వైఎస్‌ జగన్‌కు పార్టీ కార్యకర్త ఇంటి నుంచి వస్తున్న కాఫీని అడ్డుకుని ఆ రెస్టారెంట్‌ నుంచే తీసుకోవాలని నిబంధన పెట్టడం, అక్టోబర్‌ 25 గురువారం మధ్యాహ్నం ఆ రెస్టారెంట్‌ నుంచి కాఫీ తీసుకురావడం, అదే రోజు శ్రీనివాసరావు జగన్‌పై కత్తి దూయడం, ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, డీజీపీ అసలు అది దాడే కాదని ప్రచారం చేయడం.. సదరు దుండగుడు వైఎస్సార్‌ పార్టీ అభిమాని అని ప్రచారం పుట్టించడం, ఇందుకు అనుగుణంగా ఓ లేఖ సృష్టించడం... ఇవన్నీ దీని వెనుక ఉన్న కుట్రను దాచలేకపోయాయి. కుట్రపూరితంగానే ఇదంతా జరిగినట్టు స్పష్టమవుతున్నా విశాఖ పోలీసులు మాత్రం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు విచారణ డ్రామాను రక్తికట్టించారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక కుట్ర కోణం లేదని తేల్చేశారు. 

శ్రీనివాసరావుతో చెప్పించిన స్క్రిప్టే.. 
రెండు నెలల క్రితం పోలీస్‌ కస్టడీలో ఉన్న శ్రీనివాసరావుతో ఏదైతే చెప్పించారో అవే విషయాలను విశాఖ సీపీ మహేశ్‌ చంద్ర లడ్హా బుధవారం విలేకరుల సమావేశంలో మరోసారి వల్లెవేయడం గమనార్హం. ఆరు రోజుల పోలీసు విచారణలో శ్రీనివాసరావుతో ‘నేను జగన్‌ అభిమానినే..’అని పదే పదే చెప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అవే మాటలు నేరుగా శ్రీనివాసరావుతోనే మీడియాకు చెప్పించేందుకు అతనికి వైద్యసేవల పేరిట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఇప్పుడు సీపీ కూడా అవే మాటలు వల్లెవేయడంతో అసలు ఈ కేసు విచారణ ఏపాటిగా జరిగిందో ఇట్టే అర్థమవుతోంది. 
కత్తులకు పదును పెడుతుంటే హర్షవర్ధన్‌ ఎందుకు అడ్డుకోలేదు 

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన అక్టోబర్‌ 25న ఉదయమే శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు చేరుకున్నాడని, ఉదయం 9 గంటల సమయంలో కత్తులను రెస్టారెంట్‌లోనే వేడినీళ్ళలో స్టెరిలైజ్‌ చేశాడని సీపీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి అక్కడే ఉన్నారు. తాను ఆ రోజు తెల్లవారుజాము నుంచి జగన్‌పై హత్యాయత్నం జరిగే పదినిమిషాల ముందువరకు అక్కడే ఉన్నానని చౌదరి ఇప్పటికి ఎన్నోసార్లు మీడియాకు చెప్పారు. ఈ లెక్కన తన రెస్టారెంట్‌లో పనిచేసే యువకుడు కత్తులకు పదును పెడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ఎందుకోసం అని ఎందుకు అడగలేదన్న దానిపై సీపీ నుంచి సమాధానమే లేదు. రెస్టారెంట్‌ మొత్తం సీసీ టీవీ ఫుటేజ్‌ పరిధిలోనే ఉంటుంది. అతను ఎక్కడ స్టెరిలైజ్‌ చేసినా కనపడుతుంది. మరి అంతమంది కళ్ళుగప్పి అతను కత్తులను ఎలా దాచాడు?, అదే రోజు ధైర్యంగా ఎలా పదును పెట్టాడన్న ప్రశ్నలకు కూడా పోలీసుల వద్ద సమాధానం లేదు. 

రిమాండ్‌ రిపోర్ట్‌కు భిన్నంగా సీపీ ప్రకటనలు 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని, ఆ కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు పోయేవని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కుట్ర కోణం దాచి రిమాండ్‌ రిపోర్ట్‌ రాసినప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి వారికి తీవ్రస్థాయిలో అక్షింతలు పడినట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా రిమాండ్‌ రిపోర్ట్‌ రూపొందించారంటూ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారన్న వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు రిమాండ్‌ రిపోర్ట్‌కు భిన్నంగా సీపీ మహేష్‌ చంద్ర లడ్హా ప్రకటనలు చేయడం గమనార్హం. సీపీ తాజా ప్రకటనలు చూస్తుంటే చార్ట్‌షీట్‌లో... అసలు హత్యాయత్నమే జరగలేదంటూ కేసు నిర్వీర్యం చేసే విధంగా పొందుపరచడం ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

ఇలాగేనా హర్షవర్ధన్‌ను విచారించేది? 
కేసులో కీలకంగా అందరూ అనుమానిస్తున్న టీడీపీనేత, ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరిని పలుమార్లు విచారించామని సీపీ చెప్పుకొచ్చారు. కానీ పోలీస్‌స్టేషన్‌ వద్దనే పడిగాపులు కాసి విచారణ క్రమం తెలుసుకునేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ హర్షవర్ధన్‌ విచారణ ఏ విధంగా జరిగిందో క్షుణ్ణంగా తెలుసు. కేవలం కేసు విచారణ పేరిట కాలయాపన చేసేందుకు రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బందిని, నిందితుడు శ్రీనివాసరావు స్నేహితులను విచారించిన సందర్భాల్లో... వారిని తిరిగి ఇళ్ళకు తీసుకువెళ్లేందుకు మాత్రమే హర్షవర్ధన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవాడు. ఆ సందర్భాల్లో కూడా పోలీస్‌స్టేషన్లలో దర్జాగా తిరుగుతుండటం, పోలీసులంటే లెక్కలేనట్టుగా ప్రవర్తించడం ప్రతిఒక్కరూ గమనించారు. తన వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలోనే నో పార్కింగ్‌ బోర్డ్‌ ఎదురుగా సీపీ మహేష్‌ చంద్ర లడ్హా వాహనం ఎదురుగా పార్క్‌ చేసే వాడంటేనే అతనికున్న అండదండలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు.  

ఫ్లెక్సీపై సీపీ హాస్యాస్పద వ్యాఖ్యలు 
చివరికి శ్రీనివాసరావు ఆ ఊళ్ళో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలోనూ సీపీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఫ్లెక్సీపై గరుడ పక్షి ఫొటో ఉండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ 25న జగన్‌పై హత్యాయత్నం ఘటనతో ఆర్నెల్ల క్రితం హాస్యనటుడు శివాజీ చెప్పిన గరుడ పురాణంలో మాదిరిగానే ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగిందన్న వాదనలు, అనుమానాలు ఒక్కసారిగా బయలుదేరాయి. కాగా శ్రీనివాసరావు వేయించిన ఫ్లెక్సీలో గరుడ పక్షి ఉండటంతో ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న ప్రచారం జరిగింది. ఆ మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేసి ఈ దిశగా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అవేమీ పట్టించుకోని సీపీ లడ్హా ఫ్లెక్సీలోని గరుడ పక్షి బొమ్మపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. శ్రీనివాసరావుకు గరుడ పక్షి అంటే ఇష్టమని, అందుకే దానిపై ఆ బొమ్మ వేయించుకున్నాడని చెబుతూ తేలిగ్గా తీసిపారేయడం చూస్తుంటే.. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ఏ విధంగా కొనసాగిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. 

సిట్‌ ఆఫీసుకు తాళం వేసేస్తే ఇంకేం విచారణ 
హత్యాయత్నం వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదంటూ విచారణ మొదలుపెట్టకుండానే తేల్చేసిన సీపీ మహేష్‌ చంద్ర దర్యాప్తు ఇంకా కొనసాగిస్తామని చెప్పారు. నిజమైన విచారణను హత్యాయత్నం జరిగిన రోజే గాలికొదిలేసిన పోలీసులు కొన్నాళ్ళు సిట్‌ కార్యాలయం తెరిచి పబ్లిసిటీ స్టంట్‌ నడిపారు. దానికి కూడా ఇటీవల తాళం కూడా వేసేశారు. విచారణ ముగిసిందని, తాము ఎవరి పనుల్లో వారు ఉన్నామని సిట్‌ అధికారి ఒకరు ఈమధ్య చెప్పారు. వాస్తవం ఇలావుంటే సీపీ మాత్రం కేసు విచారణ కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. 

కోర్టు ధిక్కారం..!  
నిందితుడు శ్రీనివాసరావు పథకం ప్రకారమే హత్యాయత్నానికి పాల్పడ్డాడని సీపీ లడ్హా చెప్పారు. ఈ కేసు వెనుక ఇంకెవరూ లేరన్నట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ కేసును రాష్ట్ర పోలీసులు నిష్పక్షపాతంగా విచారించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రజలూ భావిస్తున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ నిర్వహించాలని పార్టీ న్యాయస్థానాన్ని కోరింది. ఆ మేరకు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ దశలో పోలీస్‌ కమిషనర్‌ ఏకపక్షంగా మీడియాకు ప్రకటనలు చేయడం కోర్టు ధిక్కారమే అవుతుందని, అయినా అదేమీ పట్టించుకోకుండా సీపీ లడ్హా ఆ విధంగా ప్రకటనలు చేస్తున్నారంటే వారిపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

పెద్దల వ్యాఖ్యలను సమర్థించేలా మరోసారి.. 
శ్రీనివాసరావు తాను ఉపయోగించిన కత్తిని హత్యాయత్నానికి ముందు రెండుసార్లు వేడి నీటిలో మరిగించాడని సీపీ చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కత్తితో పొడిచినా ఏమీ కాకుండా శ్రీనివాసరావు జాగ్రత్త తీసుకున్నాడన్న అర్థం స్ఫురించేలా సీపీ వ్యూహాత్మకంగా మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడటం ద్వారా సానుభూతి కోసమే శ్రీనివాసరావు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలనే సీపీ మరోసారి సమర్థించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

గతంలోనూ ఇదే తీరు  
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో విశాఖపట్నం సీపీ గతంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించారు. హర్షవర్థన్‌కు చెందిన రెస్టారెంట్‌లో పనిచేసేందుకు నిందితుడు శ్రీనివాసరావుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) ఉందని చెప్పారు. కానీ అతని స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పోలీసులు తాము ఎన్‌వోసీ ఇవ్వలేదని తెలిపారు. సీపీ వెంటనే స్పందిస్తూ విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పీఎస్‌ నుంచి శ్రీనివాసరావు ఎన్‌వోసీ పొందాడని ప్రకటించారు. ఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) డీజీ కుమార్‌ రాజేష్‌ చంద్ర అసలు విషయాన్ని వెల్లడించడంతో ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. విమానాశ్రయంలో పనిచేసేందుకు అవసరమైన ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌ (ఏఈపీ) కోసం శ్రీనివాసరావుగానీ అతని తరఫున రెస్టారెంట్‌ యజమాని గానీ దరఖాస్తు చేయనేలేదని స్పష్టం చేశారు. ఏఈపీ కోసం దరఖాస్తు చేయనప్పుడు ఎన్‌వోసీ అవసరమే తలెత్తదని, శ్రీనివాసరావు పేరిట ఎన్‌వోసీ లేనే లేదని స్పష్టం చేశారు.  

స్క్రిప్ట్‌ను ముందే వెల్లడించిన సాక్షి

వాస్తవానికి సిట్‌ స్క్రిప్ట్‌ను రెండు నెలల ముందే సాక్షి బట్టబయలు చేసింది. హత్యాయత్నం జరిగిన రోజు నుంచి పోలీసుల విచారణ తంతును పరిశీలించిన సాక్షి ముందే నివేదిక సారాంశాన్ని గ్రహించింది. గత నవంబర్‌ మూడవ తేదీన ‘‘బాస్‌ల నివేదిక సిద్ధం.. ఇదే స్క్రిప్ట్‌ ’’శీర్షికన గత నవంబర్‌ 1న ప్రచురించింది. ఇప్పుడు అందు లోని అంశాలనే సీపీ లడ్హా చెప్పుకురావడం గమనార్హం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement