ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఏర్పాట్లలో నిర్వాహకులు
సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్: మరో సాంకేతిక పండగకు విశాఖ వేదికైంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్ కోసం ముస్తాబైంది. సాగర తీరంలో నోవొటల్ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ ఫెస్టివల్‌లో సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడే టెక్నాలజీలపై 15 దేశాల నుంచి తరలివచ్చే నిపుణులు విస్తృత చర్చలు జరుపుతారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్టార్టప్ కంపెనీలు ప్రదర్శనలు ఇస్తాయి. హ్యూమన్ రోబో ’సోఫియా‘ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా ఈ వేడుకల్లో నిలవనుంది.
విశాఖలోనే ఎందుకు ?
ఫిన్‌టెక్ సెక్టార్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అగ్రగామిగా ఉంది. సమీప భవిష్యత్‌లో ప్రపంచంలోనే ఫిన్‌టెక్ సెక్టార్‌లో ఏపీ నెంబర్ వన్‌గా నిలవాలన్న సంకల్పంతో ఈ ఫెస్టివల్‌కు విశాఖలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బిలియన్ డాలర్ల చాలెంజ్, హాక్‌థాన్, కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ ఫెస్టివల్‌లో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో ఫైనల్‌కు వచ్చిన బెస్ట్ స్టార్టప్ సంస్థలు తాము తీసుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తారు.
ఐదు రోజులు.. ప్రత్యేక కార్యక్రమాలు
విశాఖ నొవాటల్ వేదికగా సోమవారం నుంచి ఐదు రోజుల పాటు వైజాగ్ ఫినటెక్ ఫెస్టివల్ జరగనుంది. ఈ కాన్ఫరెన్స్‌కు 15 దేశాల నుంచి ఫిన్‌టెక్ రంగంలో 2 వేల మంది నిపుణులతో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థల్లోని సీఈవోలు, సీవోవోలు, సీఎక్స్‌వోలు తరలిరానున్నారు. ఫిన్‌టెక్ ఫెస్టివల్ కోసం ఫిన్‌థాన్ పేరిట దేశ విదేశాల్లో వన్ మిలియన్ డాలర్ చాలెంజ్ పేరిట పోటీలను నిర్వహించింది. సుమారు వెయ్యి స్టార్టప్ బృందాలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేయగా 400 విద్యార్థి బృందాలు పోటీపడ్డాయి. వీటిలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన 40 బృందాలను ఎంపిక చేశారు. వీరికి విశాఖలో జరిగే ఫిన్‌టెక్ కాన్ఫరెన్స్‌లో పోటీలు నిర్వహిస్తారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి వన్ మిలియన్ చాలెంజ్ విన్నర్‌గా ప్రకటిస్తారు. 25న విజేతకు వన్ మిలియన్(రూ.కోటి) బహుమతిని అందజేస్తారు. ఫిన్‌టెక్‌కే భవిష్యత్ ఉందన్న విషయాన్ని చెప్పేందుకు వంద మంది నిపుణులను తరలిరానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మద్నేష్‌కుమార్, మిశ్రా, యూనియన్ బ్యాంక్ ఇండియా చైర్మన్ రాజ్‌కిరణ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ కీలకోపన్యాసాలు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బిట్‌లాండ్ గ్లోబల్ కార్యదర్శి క్రిస్ బేట్స్, గవర్నమెంట్ ఆఫ్ బ్లాక్ చైన్ అసోసియేషన్ ఇన్ లిమా డేవిడ్ సోటో, కార్డిటిక్స్ కో ఫౌండర్ లిన్నీ ల్యూబ్, సోసా సీఈవో యూజి చెఫర్, తదితరులు ప్రసంగించనున్నారు.
విశాఖలోనే ఫిన్‌టెక్ కోర్సులు
ఫిన్‌టెక్ అనేది సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు జరిపే ఓ సాంకేతిక భద్రతా పరిజ్ఞానం. ఆర్థిక పరమైన లావాదేవీలు ఎలాంటి హ్యాకింగ్స్‌కు గురికుండా భద్రంగా జరిపేందుకు ఉపయోగపడే పరిజ్ఞానాన్ని తయారు చేసే సెక్టర్‌నే ఫిన్‌టెక్ అంటారు. ఈ సెక్టార్‌లో సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీలను ఉపయోగించుకుని లావాదేవీలు జరిపేందుకు దోహదపడుతుంది. ఇటువంటి కోర్సులు ప్రపంచంలోని కొన్ని దేశాల్లోనే అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దేశంలో మన రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న విద్యా సంస్థల్లో ఈ కోర్సులను ఇటీవలే ప్రవేశపెట్టారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఫిన్‌టెక్ కోర్సులను ప్రవేశపెట్టింది విశాఖలోనే. ఐటీ హబ్‌లో దీనికి సంబంధించి పర్మినెంట్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీని వినియోగించుకుని ఏదైనా స్టార్టప్ కంపెనీ ముందుకొస్తే వారికి ఆర్థిక, సాంకేతికపరమైన ప్రోత్సాహం అందిస్తారు.
తొలిరోజు గోల్ఫ్.. సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం
ఐటీ రంగ నిపుణుల్లో అత్యధికులు ఆసక్తి చూపే గోల్ఫ్ క్రీడను రాష్ట్ర ప్రభుత్వం ఫిన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించనుంది. ముడసర్లోవలో ఉన్న గోల్ఫ్ క్రీడా ప్రాంగణంలో ఇందు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 40 మంది సీఎక్స్‌వోలు గోల్ఫ్ ఆడనున్నారు. సాయంత్రం ఫిన్‌టెక్ నిపుణుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మేటి కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి ఫిన్‌టెక్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఉద్దేశం
వివిధ దేశాల్లో ప్రభుత్వ పథకాల నిర్వహణ, బ్యాంకులు, బీమా కంపెనీల్లో సురక్షితమైన లావాదేవీలు జరిపేందుకు వినియోగిస్తున్న టెక్నాలజీలో మార్పులు తీసుకురావాలి వంటి విషయాలపై ఈ ఫెస్టివల్‌లో చర్చలు జరుగుతాయి. ఫిన్‌టెక్‌లో కీలకమైంది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీయే సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలిగింది. దీంతో ఈ టెక్ కాన్ఫరెన్స్‌లో కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఫిన్‌టెక్ సెక్టార్‌లో 2.4 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. ఈ సెక్టార్‌లో 600కు పైగా కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా ‘సోఫియా’
ప్రపంచ మొట్టమొదటి హ్యూమన్ నాయిడ్ రోబోగా గుర్తింపు తెచ్చుకున్న సోఫియా ఇవ్వనున్న ప్రసంగం ఫిన్‌టెక్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో సోఫియా చేసిన కీలకోపన్యాసం ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఐదు కీలోకోపన్యాసాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలు, 12 ప్యానల్ చర్చలు, 50 ప్రదర్శనలు ఉంటాయి.
భవష్యత్తు ఫిన్‌టెక్‌దే..
రానున్న ఐదేళ్లలో ఫిన్‌టెక్స్ సెక్టార్‌లో 50–60 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో టాప్ –5లో ఫిన్‌టెక్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పటి వరకు 25 కంపెనీలు ఏర్పాటు చేశారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరో 500 మందికి అవకాశం ఉంది. మన రాష్ట్రానికి ఫిన్‌టెక్ టెక్నాలజీలో రూ.250 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ వేడుకల ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. – జేఏ చౌదరి, రాష్ట్ర ఐటీ సలహాదారుడు
సాంకేతికతలో మార్పులపై చర్చ
ఫిన్‌టెక్‌లో భాగంగా భవిష్యత్తులో ఐటీ టెక్నాలజీలో వచ్చే మార్పుల గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలో ఈ సమావేశాల్లో నిపుణులు కీలకోపన్యాసాలు చేయనున్నారు. మా సంస్థ తరఫున వివిధ దేశాలు, మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీపై ప్రచారం చేస్తాం. అంతేకాకుండా బిలియన్ డాలర్ల చాలెంజ్‌ను కూడా నిర్వహించడం జరిగింది. విశాఖలో ఏర్పాటైన అన్ని కంపెనీలకూ సౌకర్యాలు కల్పిస్తాం. సాంకేతిక పరంగా విశాఖపట్నం ప్రపంచాన్ని ఆకర్షించేలా ముందుకు వెళుతోంది. ఇలాంటి కాన్ఫరెన్స్‌ల నిర్వహణతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం.
– లక్ష్మి పొట్నూరి, డీసీఎఫ్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment