Fintech technology
-
భారత్‌పే సహ వ్యవస్థాపకుడికి లుకౌట్ నోటీసు జారీ.. ఎందుకంటే..
భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్లను గురువారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. న్యూయార్క్‌కు వెళ్లే విమానం ఎక్కకుండా చర్యలు తీసుకున్నారు. అయితే భారత్‌పేలో జరిగిన మోసంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల లుకౌట్ సర్క్యులర్‌ను జారీ చేసింది. దాంతో వారిని దిల్లీలోని విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్‌లో విహారయాత్రకు బయలుదేరిన అష్నీర్ దంపతులను విమానాశ్రయంలో భద్రతా తనిఖీకి ముందే ఆపివేసినట్లు ఈఓడబ్ల్యూ జాయింట్ కమిషనర్ సింధు పిళ్లై చెప్పారు. దిల్లీలోని వారి నివాసానికి తిరిగి రావాలని సూచించినట్లు తెలిపారు. వచ్చే వారం మందిర్ మార్గ్‌లోని ఈఓడబ్ల్యూ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వారిని కోరారు. వారి అంతర్జాతీయ ప్రయాణాన్ని నిలిపేసేందుకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని, వారిని అధికారికంగా అరెస్టు చేయలేదని పిళ్లై స్పష్టం చేశారు. పోలీసులు చర్యలు తీసుకునేంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని అష్నీర్ గ్రోవర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. గురువారం రోజే తమను అదుపులోకి తీసుకున్నారని, కానీ శుక్రవారం రోజున వారికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విమానం ఎక్కకుండా తమను ఆపిన ఏడు గంటల తర్వాత ఈఓడబ్ల్యూ నుంచి నోటీసు అందిందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: అమెజాన్ అలెక్సా.. వందల ఉద్యోగులపై వేటు భారత్‌పే సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబ సభ్యులు సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు దాఖలయ్యాయి. గతంలో వారు అందించని ఫిన్‌టెక్ సేవల కోసం బ్యాక్‌డేటెడ్ ఇన్వాయిస్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులను గుర్తించడంలో ఈఓడబ్యూ సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్ 2022లో భారత్‌పే అష్నీర్ గ్రోవర్, తన భార్య, కుటుంబ సభ్యుల ద్వారా రూ.81.28 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రిమినల్ కేసు దాఖలయింది. Hello ! Hello ! Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab. So facts: 1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport). 2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F — Ashneer Grover (@Ashneer_Grover) November 17, 2023 -
బ్యాంకింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఫిన్‌టెక్.. ఆర్బీఐ రిపోర్ట్ ఏం చెప్పింది?
ముంబై: సమీప భవిష్యత్తులో సాంప్రదాయ బ్యాంకింగ్‌కు ఫిన్‌టెక్ రంగం ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (కెఫ్రాల్) ఒక నివేదికలో పేర్కొంది. డిజిటలీకరణ వృద్ధికి, ఆర్థిక స్థిరత్వ సాధనకు ఎప్పటికప్పుడు తగు విధంగా మల్చుకోగలిగే నియంత్రణ విధానాలు అవసరమని తెలిపింది. ఇండియా ఫైనాన్స్ రిపోర్ట్ 2023 పేరిట కెఫ్రాల్ రూపొందించిన తొలి ప్రచురణను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 2011లో కెఫ్రాల్‌ను లాభాపేక్ష రహిత సంస్థగా ఆర్బీఐ ఏర్పాటు చేసింది. దేశీయంగా బ్యాంకింగేతర ఆర్థిక రంగ స్థితిగతులను అర్థం చేసుకోవడంలో నియంత్రణ సంస్థలు, విధాన నిర్ణేతలు సహా సంబంధిత వర్గాలకు సహాయకరంగా ఉండే అంశాలను తాజా నివేదికలో పొందుపర్చారు. దేశీ సాంకేతిక తోడ్పాటుతో భారత్‌లో డిజిటలీకరణ వేగవంతమవుతోందని, డిజిటల్ రుణాలు.. ముఖ్యంగా ఫిన్‌టెక్ రుణాలు గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) పరిచయం ఫిన్టెక్కు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అతిపెద్ద విజయాన్ని అందించిందని, దాని విస్తరణను వేగవంతం చేసి దేశవ్యాప్తంగా ఆర్థిక చేరికకు కొత్త అవకాశాలను సృష్టించిందని పేర్కొంది. అయితే, వృద్ధిని సులభతరం చేయడంతోపాటు స్థిరత్వాన్ని కొనసాగించేందుకు డిజిటల్ రుణాల నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని నివేదిక స్పష్టం చేసింది. -
శ్రీరామ్ ఫైనాన్స్‌తో పేటీఎం జట్టు
చెన్నై: ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌తో జట్టు కట్టింది. పేటీఎం నెట్‌వర్క్‌లోని వ్యాపారులు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి రుణాలు పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. తర్వాత దశల్లో వినియోగదారులకు కూడా రుణాలను అందించేలా దీన్ని విస్తరించనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రేవాంకర్ తెలిపారు. దేశీయంగా రిటైల్ రుణాలకు భారీగా డిమా ండ్ నెలకొందని, రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన వివరించారు. రుణాల పంపిణీ వ్యవస్థను మరింతగా విస్తరించేందుకు శ్రీరా మ్ ఫైనాన్స్‌తో ఒప్పందం దోహదపడగలదని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ పేర్కొన్నారు. తమ ప్లాట్ ఫాంపై చిన్న వ్యాపారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలతో పాటు ఇతరత్రా డిజిటల్ ఆర్థి క సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడగలదని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ పేర్కొన్నారు. దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల అసెట్స్‌ను నిర్వహిస్తూ.. 2,922 శాఖలు, 64,052 మంది ఉద్యోగులతో శ్రీరామ్ ఫైనాన్స్ దేశీయంగా అతి పెద్ద రిటైల్ ఎన్బీఎఫ్సీ కంపెనీల్లో ఒకటిగా ఉంది. -
భారత్‌కు మారిన ఫోన్‌పే ప్రధాన కార్యాలయం
న్యూఢిల్లీ: త్వరలో పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానున్న నేపథ్యంలో ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తమ కార్యాలయ చిరునామాను సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది కాలంగా ఫోన్‌పే సింగపూర్‌కు చెందిన ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసులు, వెల్త్ బ్రోకింగ్ మొదలైన వ్యాపారాలు, అనుబంధ సంస్థలు అన్నింటిని ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్–ఇండియాకు బదలాయించినట్లు వివరించింది. మరోవైపు, 3,000 మంది ఉద్యోగులకు ఫోన్‌పే ఇండియా కొత్త ప్లాన్ కింద కొత్త ఎసాప్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్)లను జారీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ ఇంజినీర్ కలిసి ఫోన్‌పేను ప్రారంభించారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్ 2016లో కొనుగోలు చేసింది. అటుపైన 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేయడంతో ఫోన్‌పే కూడా వాల్‌మార్ట్‌లో భాగంగా మారింది. ప్రస్తుతం 8–10 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. -
తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?
Matrimonial sites are platforms designed to match: ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తమ పిల్లలకు తగిన సంబంధాలను వెతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో అలా ఒకటైన జంటలు కోకొల్లలు. అదేవిధంగా మ్యాటిమోని సైట్ల ద్వారా మోసపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఏంటి ఇదంతా అనుకోకండి ఇక్కడొక తండ్రి ఎంతో ఆశతో తన కూతురుకి సరిపోయే వరుడి వివరాలు పంపిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? వివరాల్లోకెళ్తే....ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన మంచి సంబంధాలను వెతికి తీసుకువ్చి మరీ పెళ్లిళ్లు చేస్తుంటారు. తమ పిల్లలు మంచి వ్యక్తులను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇది సర్వసాధారణం. పాపం బెంగుళూరులోని ఓ తండ్రి అలానే భావిస్తాడు. ఈ మేరకు అతను తన కూతురుకి తగిన వరుడుని మాట్రిమోనియల్ సైట్లలో వెతికి మరీ అతని వివరాలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఐతే ఆమె తన తండ్రికి ఊహించని షాక్ ఇచ్చింది. మాట్రిమోనియల్ సైట్లలో ప్రోఫెల్లో సదరు వ్యక్తుల పూర్తి సమాచారం ఉండటం సహజం. ఆమె అతని ప్రోఫెల్ చూసి ముచ్చటపడి ఉద్యోగం ఇచ్చింది. ఇంతకీ ఆమె బెంగళూరులోని స్టార్ట్ అప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ఉదితా పాల్. అంతేకాకుండా తన తండ్రికి ఆ వ్యక్తికి లావదేవీలను సులభతరం చేసే ఫిన్టెక్లో ఏడేళ్ల అనుభవం ఉండటం వల్ల తన స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చానని అందువల్ల తనను క్షమించమని తండ్రికి సందేశం పంపింది. వాస్తవానికి చూసిన ప్రతీ సంబంధం కుదరకపోవచ్చు గానీ ఇలా ఆమె ఆ వ్యక్తికి ఉద్యోగం ఆఫర్ ఇచ్చిన తీరు ఆమెకు తన కెరీయర్ పట్ల ఉన్న నిబద్ధత తెలియజేస్తోంది. ఈ మేరకు ఉదితా పాల్ తనకు తన తండ్రికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వాట్సాప్ సంభాషణ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq — Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022 (చదవండి: పెళ్లి తంతులో దంపతులు రచ్చ... షాక్‌లో బంధువులు) -
డబ్బే డబ్బు.. భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫిన్‌టెక్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్‌తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్‌ల్యాబ్స్ రూ.2,860 కోట్లు, క్రెడ్ రూ.1,597 కోట్లు, రేజర్‌పే రూ.1,189 కోట్లు, క్రెడిట్‌బీ రూ.1,137 కోట్లు, ఆఫ్‌బిజినెస్ రూ.817 కోట్లు, భారత్‌పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్‌మింట్ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్ ఇన్సూరెన్స్ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేశాయి. టాప్–10లో నాలుగు.. ఆసియాలో టాప్–10 డీల్స్‌లో పైన్‌ల్యాబ్స్ మూడవ స్థానంలో, క్రెడ్ నాల్గవ, రేజర్‌పే ఎనమిదవ, క్రెడిట్‌బీ 10వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీవోలు కొనసాగుతాయని కేపీఎంజీ నివేదిక తెలిపిం ది. పాలసీ బజార్ రూ.6,500 కోట్లు, పేటీఎం రూ.16,500 కోట్ల ఐపీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం, కొనుగోళ్ల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీలను బ్యాంకులు, ఈ రంగంలోని పెద్ద సంస్థలు, సర్వీసులు అందిస్తున్న దిగ్గజాలు లక్ష్యంగా చేసుకున్నాయి. రానున్న ఏడాదిలో ముందు వరుసలో ఉన్న ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్‌పై దృష్టిసారిస్తాయి. బ్యాంకులు సైతం ఫిన్‌టెక్ కంపెనీలు, కొత్త బ్యాంకులు, వెల్త్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సైతం.. తొలి ఆరు నెలల్లో అంతర్జాతీయంగా నిధులు వెల్లువెత్తాయి. రూ.7,28,140 కోట్లు ఫిన్‌టెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. 2020లో ఈ మొత్తం రూ.9,02,745 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో యూఎస్ కంపెనీల్లోకి రూ.3,78,930 కోట్లు, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా రూ.2,90,513 కోట్లు, ఆసియా పసిఫిక్ సంస్థల్లోకి రూ.55,725 కోట్లు వచ్చి చేరాయి. విలీనాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,02,400 కోట్ల విలువైన 353 డీల్స్ జరిగాయి. 2020లో 502 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ రూ.5,49,820 కోట్లు. జూలై–డిసెంబరు కాలంలోనూ అన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో పెట్టుబడులు, డీల్స్ ఉండొచ్చని కేపీఎంజీ అంచనా వేస్తోంది. పేమెంట్స్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ యాజ్ ఏ సర్వీస్, బీ2బీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు ఉంటాయని వివరించింది. చదవండి: భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం -
బీవోబీ, యూ గ్రో నుంచి ప్రథమ్ రుణాలు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) తాజాగా ఫిన్‌టెక్ కంపెనీ యూ గ్రో క్యాపిటల్‌తో చేతులు కలిపింది. తద్వారా ప్రథమ్ పేరుతో రుణాలను అందించనుంది. యూ గ్రో క్యాపిటల్ సహకారంతో ఎంఎస్ఎంఈ రంగంలోని సంస్థలకు రూ. 1,000 కోట్లను రుణాలుగా విడుదల చేయనున్నట్లు బీవోబీ తెలియజేసింది. బీవోబీ 114వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రథమ్ పేరిట రుణాల జారీని చేపట్టినట్లు చిన్న సంస్థలకు రుణాలందించే టెక్ ఆధారిత ప్లాట్‌ఫామ్.. యూ గ్రో క్యాపిటల్ పేర్కొంది. సహరుణ విడుదల కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు అవసరాలకు అనుగుణంగా(కస్టమైజ్డ్) రుణాలను పోటీస్థాయి వడ్డీ రేట్లతో అందించనున్నట్లు తెలియజేసింది. రూ. 50 లక్షల నుంచి ప్రారంభించి రూ. 2.5 కోట్ల వరకూ రుణాలను మంజూరు చేయనున్నట్లు వివరించింది. 8 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గరిష్టంగా 120 నెలల కాలావధితో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. సహరుణ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కె. పేర్కొన్నారు. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. -
Paroma Chatterjee: బిజినెస్ లీడర్ లాభాల చెయ్యి
ఆర్ధిక లావాదేవీలను, వ్యవహారాలను టెక్నాలజీతో నడిపించే రంగాన్ని ‘ఫైనాన్స్ టెక్నాలజీ’ (ఫిన్‌టెక్) అంటారు. టెక్నాలజీ ఒక్కటే తెలిస్తే కాదు, ఫైనాన్స్ కూడా తెలిసుండాలి. కొంచెం కష్టమైన, ప్రావీణ్యం అవసరమైన పరిజ్ఞానాలివి. అయితే పరోమా చటర్జీకి ఇవి తప్ప వేరే ఏవీ ఆసక్తికరమైనవి కావని అనిపిస్తుంది. గత పదిహేనేళ్లుగా లెండింగ్ కార్ట్, ఫ్లిప్‌కార్ట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి పెద్ద సంస్థల ‘ఫిన్‌టెక్’ విభాగాలలో అసమాన వృత్తి నైపుణ్యం కనబరుస్తూ వచ్చారు. ఇప్పుడిక ‘రివల్యూట్’ అనే 400 కోట్ల పౌండ్ల బ్రిటన్ కంపెనీ.. భారత్‌లో అదే పేరుతో తను ప్రారంభించబోతున్న కంపెనీకి వెళుతున్నారు! పరోమాను భారత్‌లోని తమ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించినట్లు ‘రివల్యూట్’ సంస్థ గురువారం ప్రకటించింది. మహిళలకు డబ్బు వ్యవహారాలు తెలియవని, టెక్నాలజీ పరిజ్ఞానం అంతంత మాత్రమేనని కింది స్థాయిలో ఎవరెంత అనుకున్నా, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో ఆ రెండు విభాగాలను నడిపిస్తున్నది దాదాపుగా మహిళలే. రివల్యూట్ను ఇప్పుడు పరోమా చటర్జీ నడిపించబోతున్నారు. ఆ కంపెనీ మనీ ట్రాన్స్ఫర్, ఎక్ఛేంజి, స్టాక్ ట్రేడింగ్, లోన్లు, వెల్త్ ట్రేడింగ్ సేవలను అందిస్తుంటుంది. అందుకు అవసరమైన టెక్నాలజీని వృద్ధి చేస్తుంటుంది. వచ్చే పద్దెనిమిది నెలల్లో తమ కంపెనీని భారత్‌లో విస్తృత పరిచేందుకు రివల్యూట్ ఏరికోరి పరోమాను ఎంపిక చేసుకుంది. అంటే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి వాటిని పరోమా పక్కకు తోసేయాలి. ఛాలెంజింగ్ జాబ్! పరోమా లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదివొచ్చారు. ఆ తర్వాత ఆమె తక్కువస్థాయి ఉద్యోగాలేమీ చేయలేదు. ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్‌లో కూడా చేశారు. రివల్యూట్ ఆఫర్ రావడానికి ముందు వరకు ఆమె లెండింగ్ కార్ట్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్. దేశంలోని వ్యాపారవేత్తలకు వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చే విభాగానికి అధికారి ఆమె. తర్వాత వయా.కామ్ అనే ‘బిజినెస్ టు బిజినెస్ టు కన్యూమర్’ (బి2బి2సి) ఇంటర్నెట్ ట్రావెల్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా పదిదేశాలలోని లక్షకు పైగా గల ఏజెంట్ల వ్యవస్థను నిర్వహించారు. ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకాల విభాగానికి ఇన్చార్జిగా చేశారు. ∙∙ పరోమా చటర్జీ ఇప్పుడు సీఈవోగా వెళ్తున్న రివల్యూట్ ఆరేళ్ల వయసు గల అంకుర సంస్థ. సిలికాన్ వ్యాలీలోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు టీవీసి, డీఎస్టీ గ్లోబర్, రిబిట్ క్యాపిటల్, లేక్స్టార్, జీపీ బుల్హౌండ్ల పెట్టుబడులు రివల్యూట్లో ఉన్నాయి. వాళ్లకు అసలుతో పాటు లాభాలూ అందించడం ఇప్పుడు రివల్యూట్ ఇండియా సీఈవో గా పరోమా బాధ్యత కూడా! ఇండియాలో తన విస్తరణకు సుమారు 200 కోట్ల రూపాయలను రివల్యూట్ వెచ్చించబోతోంది. వచ్చే ఏడాది ఇక్కడ ప్రారంభించబోతున్న కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా బెంగళూరును ఎంపిక చేసుకోవచ్చని ఆ రంగంలో ఉన్న ఇక్కడివారి అంచనా. పరోమా ఇంతవరకు పని చేసిన కంపెనీలనీ ప్రధానంగా బెంగళూరులోనివే. ఆమె చదువు కూడా ఒక నగరానికే పరిమితం అవలేదు. స్కూలు విద్య బెంగళూరులో; ఇంటర్, డిగ్రీ కోల్‌కతాలో, పీజీ ఐ.ఐ.ఎం. లక్నోలో. -
ఫిన్‌టెక్ డీల్స్‌లో చైనాను మించిన భారత్
కోల్‌కతా: ఆసియా ఖండంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) డీల్స్‌కు భారత్ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవిస్తోంది. ఈ విషయంలో 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో చైనాను కూడా అధిగమించింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సేవల సంస్థ ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో 33 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ 647.5 మిలియన్ డాలర్లు. ఇదే సమయంలో చైనాలో 284.9 మిలియన్ డాలర్ల విలువ చేసే ఫిన్‌టెక్ డీల్స్ మాత్రమే నమోదయ్యాయి. ‘కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ 2020 ప్రథమార్ధంలో భారత్‌లోకి ఫిన్‌టెక్ పెట్టుబడులు 60 శాతం పెరిగాయి. దేశీయంగా ఈ పరిశ్రమ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ .. రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందగలదు. డిజిటల్ రుణాలు తదితర విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది‘ అని ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్ ఎండీ రాజీవ్ షా తెలిపారు. నాలుగున్నరేళ్లలో 10 బిలియన్ డాలర్లు.. గడిచిన నాలుగున్నరేళ్లలో (2016 నుంచి 2020 ప్రథమార్ధం దాకా) దేశీ ఫిన్‌టెక్ రంగంలోకి 10 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. చాలా మటుకు ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థల ప్రధాన కార్యాలయాల కేంద్రాలుగా బెంగళూరు, ముంబై టాప్‌లో ఉన్నాయి. దేశీయంగా మొత్తం 21 యూనికార్న్‌లు ఉండగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ సాధించిన సంస్థలు), వీటిలో మూడింట ఒక వంతు ఫిన్‌టెక్ సంస్థలే ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం 16 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో అగ్రస్థానంలో ఉంది. -
ఫిన్‌టెక్ పండగకు.. విశాఖ ముస్తాబు
సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్: మరో సాంకేతిక పండగకు విశాఖ వేదికైంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్ కోసం ముస్తాబైంది. సాగర తీరంలో నోవొటల్ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ ఫెస్టివల్లో సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడే టెక్నాలజీలపై 15 దేశాల నుంచి తరలివచ్చే నిపుణులు విస్తృత చర్చలు జరుపుతారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్టార్టప్ కంపెనీలు ప్రదర్శనలు ఇస్తాయి. హ్యూమన్ రోబో ’సోఫియా‘ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా ఈ వేడుకల్లో నిలవనుంది. విశాఖలోనే ఎందుకు ? ఫిన్‌టెక్ సెక్టార్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అగ్రగామిగా ఉంది. సమీప భవిష్యత్‌లో ప్రపంచంలోనే ఫిన్‌టెక్ సెక్టార్లో ఏపీ నెంబర్ వన్‌గా నిలవాలన్న సంకల్పంతో ఈ ఫెస్టివల్‌కు విశాఖలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బిలియన్ డాలర్ల చాలెంజ్, హాక్‌థాన్, కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ ఫెస్టివల్లో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో ఫైనల్‌కు వచ్చిన బెస్ట్ స్టార్టప్ సంస్థలు తాము తీసుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తారు. ఐదు రోజులు.. ప్రత్యేక కార్యక్రమాలు విశాఖ నొవాటల్ వేదికగా సోమవారం నుంచి ఐదు రోజుల పాటు వైజాగ్ ఫినటెక్ ఫెస్టివల్ జరగనుంది. ఈ కాన్ఫరెన్స్‌కు 15 దేశాల నుంచి ఫిన్‌టెక్ రంగంలో 2 వేల మంది నిపుణులతో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థల్లోని సీఈవోలు, సీవోవోలు, సీఎక్స్‌వోలు తరలిరానున్నారు. ఫిన్‌టెక్ ఫెస్టివల్ కోసం ఫిన్‌థాన్ పేరిట దేశ విదేశాల్లో వన్ మిలియన్ డాలర్ చాలెంజ్ పేరిట పోటీలను నిర్వహించింది. సుమారు వెయ్యి స్టార్టప్ బృందాలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేయగా 400 విద్యార్థి బృందాలు పోటీపడ్డాయి. వీటిలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన 40 బృందాలను ఎంపిక చేశారు. వీరికి విశాఖలో జరిగే ఫిన్‌టెక్ కాన్ఫరెన్స్‌లో పోటీలు నిర్వహిస్తారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి వన్ మిలియన్ చాలెంజ్ విన్నర్‌గా ప్రకటిస్తారు. 25న విజేతకు వన్ మిలియన్(రూ.కోటి) బహుమతిని అందజేస్తారు. ఫిన్టెక్కే భవిష్యత్ ఉందన్న విషయాన్ని చెప్పేందుకు వంద మంది నిపుణులను తరలిరానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మద్నేష్కుమార్, మిశ్రా, యూనియన్ బ్యాంక్ ఇండియా చైర్మన్ రాజ్‌కిరణ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ కీలకోపన్యాసాలు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బిట్లాండ్ గ్లోబల్ కార్యదర్శి క్రిస్ బేట్స్, గవర్నమెంట్ ఆఫ్ బ్లాక్ చైన్ అసోసియేషన్ ఇన్ లిమా డేవిడ్ సోటో, కార్డిటిక్స్ కో ఫౌండర్ లిన్నీ ల్యూబ్, సోసా సీఈవో యూజి చెఫర్, తదితరులు ప్రసంగించనున్నారు. విశాఖలోనే ఫిన్‌టెక్ కోర్సులు ఫిన్‌టెక్ అనేది సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు జరిపే ఓ సాంకేతిక భద్రతా పరిజ్ఞానం. ఆర్థిక పరమైన లావాదేవీలు ఎలాంటి హ్యాకింగ్స్కు గురికుండా భద్రంగా జరిపేందుకు ఉపయోగపడే పరిజ్ఞానాన్ని తయారు చేసే సెక్టర్నే ఫిన్‌టెక్ అంటారు. ఈ సెక్టార్లో సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీలను ఉపయోగించుకుని లావాదేవీలు జరిపేందుకు దోహదపడుతుంది. ఇటువంటి కోర్సులు ప్రపంచంలోని కొన్ని దేశాల్లోనే అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దేశంలో మన రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న విద్యా సంస్థల్లో ఈ కోర్సులను ఇటీవలే ప్రవేశపెట్టారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఫిన్‌టెక్ కోర్సులను ప్రవేశపెట్టింది విశాఖలోనే. ఐటీ హబ్‌లో దీనికి సంబంధించి పర్మినెంట్ ఇన్స్టిట్యూట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీని వినియోగించుకుని ఏదైనా స్టార్టప్ కంపెనీ ముందుకొస్తే వారికి ఆర్థిక, సాంకేతికపరమైన ప్రోత్సాహం అందిస్తారు. తొలిరోజు గోల్ఫ్.. సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం ఐటీ రంగ నిపుణుల్లో అత్యధికులు ఆసక్తి చూపే గోల్ఫ్ క్రీడను రాష్ట్ర ప్రభుత్వం ఫిన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించనుంది. ముడసర్లోవలో ఉన్న గోల్ఫ్ క్రీడా ప్రాంగణంలో ఇందు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 40 మంది సీఎక్స్‌వోలు గోల్ఫ్ ఆడనున్నారు. సాయంత్రం ఫిన్‌టెక్ నిపుణుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మేటి కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి ఫిన్‌టెక్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఉద్దేశం వివిధ దేశాల్లో ప్రభుత్వ పథకాల నిర్వహణ, బ్యాంకులు, బీమా కంపెనీల్లో సురక్షితమైన లావాదేవీలు జరిపేందుకు వినియోగిస్తున్న టెక్నాలజీలో మార్పులు తీసుకురావాలి వంటి విషయాలపై ఈ ఫెస్టివల్లో చర్చలు జరుగుతాయి. ఫిన్టెక్లో కీలకమైంది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీయే సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలిగింది. దీంతో ఈ టెక్ కాన్ఫరెన్స్‌లో కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఫిన్‌టెక్ సెక్టార్లో 2.4 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. ఈ సెక్టార్లో 600కు పైగా కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ప్రత్యేక ఆకర్షణగా ‘సోఫియా’ ప్రపంచ మొట్టమొదటి హ్యూమన్ నాయిడ్ రోబోగా గుర్తింపు తెచ్చుకున్న సోఫియా ఇవ్వనున్న ప్రసంగం ఫిన్‌టెక్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతేడాది డిసెంబర్లో హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో సోఫియా చేసిన కీలకోపన్యాసం ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఐదు కీలోకోపన్యాసాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలు, 12 ప్యానల్ చర్చలు, 50 ప్రదర్శనలు ఉంటాయి. భవష్యత్తు ఫిన్టెక్దే.. రానున్న ఐదేళ్లలో ఫిన్‌టెక్స్ సెక్టార్లో 50–60 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో టాప్ –5లో ఫిన్‌టెక్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పటి వరకు 25 కంపెనీలు ఏర్పాటు చేశారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరో 500 మందికి అవకాశం ఉంది. మన రాష్ట్రానికి ఫిన్‌టెక్ టెక్నాలజీలో రూ.250 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ వేడుకల ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. – జేఏ చౌదరి, రాష్ట్ర ఐటీ సలహాదారుడు సాంకేతికతలో మార్పులపై చర్చ ఫిన్టెక్లో భాగంగా భవిష్యత్తులో ఐటీ టెక్నాలజీలో వచ్చే మార్పుల గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలో ఈ సమావేశాల్లో నిపుణులు కీలకోపన్యాసాలు చేయనున్నారు. మా సంస్థ తరఫున వివిధ దేశాలు, మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీపై ప్రచారం చేస్తాం. అంతేకాకుండా బిలియన్ డాలర్ల చాలెంజ్‌ను కూడా నిర్వహించడం జరిగింది. విశాఖలో ఏర్పాటైన అన్ని కంపెనీలకూ సౌకర్యాలు కల్పిస్తాం. సాంకేతిక పరంగా విశాఖపట్నం ప్రపంచాన్ని ఆకర్షించేలా ముందుకు వెళుతోంది. ఇలాంటి కాన్ఫరెన్స్‌ల నిర్వహణతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. – లక్ష్మి పొట్నూరి, డీసీఎఫ్ సీఈవో -
ఫిన్ టెక్ టెక్నాలజీపై ఒప్పందం
అమరావతి: ఫిన్‌టెక్ టెక్నాలజీపై ఏపీ ప్రభుత్వానికి, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్)కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విజయవాడలో ఒప్పంద పత్రాలపై ఇరువురు ప్రతినిధులు శనివారం సంతకాలు చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఐటీ అడ్వయిజర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జెఏ చౌదరి, మాస్ తరపున చీఫ్ ఫిన్‌టెక్ ఆఫీసర్ సోప్నెండ్ మొహంతి సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘మాస్’ చేపట్టబోయే కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం మానవ వనరులను సమకూర్చనుంది. సింగపూర్ మాస్ ప్రతినిధులు మాట్లాడుతూ... తమ కంపెనీ సింగపూర్‌లోని సెంట్రల్ బ్యాంక్, ఫైనాన్సియల్ రెగ్యులేటరీ అథారిటీగా ఉందన్నారు. విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తామన్నారు. ఐటీకి విశాఖ అనుకూలమైన ప్రాంతమన్నారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఇదోక మంచి ఒప్పందమన్నారు. రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని భవిష్యత్తులో ఎవ్వరూ దొంగిలించకుండా చూసుకునే టెక్నాలజీని ఈ ప్రాజెక్టు ద్వారా తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, ఐటీ, ఇన్నోవేషన్ స్పెషల్ రెప్రజెంటేటివ్ లతఅయ్యర్‌లు పాల్గొన్నారు.