‘ఐఐటీ’లో విశాఖ విద్యార్థి ఆత్మహత్య
అస్సాంలోని గువాహటి ఐఐటీలో దుర్ఘటన
గువాహటి/కె.కోటపాడు(విశాఖ): అస్సాంలోని ఐఐటీ-గువాహటిలో బీటెక్ తుది సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన పరమేశ్వరరావు గురువారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఐఐటీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కాగా, ఆత్మహత్య చేసుకోడానికిగల కారణాలు తెలియాల్సి ఉందని, తనకు తక్కువ మార్కులు వచ్చిన నేపథ్యంలోనే పరమేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు.
చేతికందిన కొడుకుని కోల్పోయాం: చిన్ననాటి నుంచి ప్రతిభావంతుడిగా రాణించిన తమ కుమారుడి ఆత్మహత్యతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికంది వస్తాడని ఎదురు చూస్తుండగా ఇలా ఆత్మహత్యకు పాల్పడి తమకు తీరని శోకం మిగిల్చాడంటూ పరమేశ్వరరావు తండ్రి వెంకటరావు కన్నీటి పర్యంతమయ్యారు. విశాఖ జిల్లా కె.కోటపాడుకు చెందిన చిరు వ్యాపారి వెంకటరావు కుమారుడు పరమేశ్వరరావు చిన్ననాటి నుండి చదువులో మేటి. విశాఖ జిల్లా కొమ్మాది నవోదయలో 10వ తరగతిలో 94.6% మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లో 950 మార్కులు సాధించాడు. అనంతరం ఐఐటీ ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు రావడంతో గువాహటి-ఐఐటీలో సీటు సాధించి మెకానికల్ బ్రాంచికి ఎంపికయ్యాడు. ఇటీవలే ఇంట్లో ఓ కార్యక్రమానికి వచ్చి వెళ్లిన పరమేశ్వరరావు మళ్లీ సంక్రాంతికి వస్తానని చెప్పినట్టు శోకతప్త హృదయంతో అతని తల్లి వెల్లడించారు.