న్యూజిలాండ్‌లో విశాఖ యువకుడి మృతి
న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం నందగిరినగర్‌కు చెందిన చెరుకూరి సంతోష్ కుమార్ (26) మరణించాడు. ఈ నెల 22తేదీ సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. రిటైర్డు ప్రభుత్వోద్యోగి చెరుకూరి నూకరాజు, నాగలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు సంతోష్‌కుమార్ పీజీ చదవడానికి 2012లో న్యూజిలాండ్ వెళ్లాడు. చదువు పూర్తయ్యాక నాలుగు నెలల కిందట అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న కంపెనీ విధుల నిమిత్తం 22న న్యూజిలాండ్ సమీపంలోని టవరంగా అనే మరో ప్రాంతానికి వెళ్లాడు. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా కారును భారీ ట్రక్ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు.
సంతోష్‌కుమార్ మరణవార్త అతని స్నేహితుల ద్వారా తల్లితండ్రులకు చేరింది. రెండురోజుల్లో మృతదేహం విశాఖకు పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు, అక్కడి తెలుగు సంఘంవారు హామీ ఇచ్చారు. ఇంతవరకు మృతదేహం ఇంటికి చేరకపోవడంతో సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారాంతపు సెలవులు కారణంగా డెత్ సర్టిఫికేట్ రాలేదని, అక్కడివారు చెబుతున్నట్టు మృతుని సోదరుడు రాజేంద్ర తెలిపారు. తమ కుమారుని మృతదేహం స్వస్థలం చేరేలా చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీస్‌కమిషనర్‌లను మృతుని తల్లితండ్రులు ఆదివారం కోరారు.