
నేనంటే..నేనే.. నగరపంచాయతీ ఎన్నికలు
నెల్లిమర్ల: త్వరలో జరగనున్న నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికలు టీడీపీ నేతల్లో చిచ్చురేపుతున్నాయి. చైర్మన్ అభ్యర్థిత్వానికి ఆ పార్టీ ప్రధాన నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ఇద్దరు నేతలు ఏమాత్రం వెనక్కు తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. నెల్లిమర్ల నగరపంచాయతీకి త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నగరపంచాయతీ మొట్టమొదటి ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు టీడీపీనేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
పోటీలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు, మాజీసర్పంచ్ బెరైడ్డి నాగేశ్వరరావు మాత్రం నువ్వా..నేనా అన్నట్లు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరిలో ఎవరూ ఏమాత్రం వెనక్కు తగ్గేటట్లు కనిపించడంలేదు. గత మూడేళ్లుగా పార్టీకి, పట్టణవాసులకు సేవలందిస్తున్నానని..తనకే టికెట్ ఇవ్వాలని లెంక అప్పలనాయుడు చెబుతున్నట్లు సమాచారం. బెరైడ్డి కుటుంబానికి చెందిన పలువురు గతంలో నెల్లిమర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్‌లుగా పనిచేశారు కాబట్టి ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానంవద్ద తన వాదనను వినిపించినట్లు తెలిసింది.
అయితే తాను మొదట్నుంచీ రాజకీయాల్నే నమ్ముకుని ఉన్నానని, తనకు వ్యాపారాలుగాని, కాంట్రాక్టులు గాని లేవని మరో నేత నాగేశ్వరరావు చెప్పినట్లు భోగట్టా. తన తండ్రి బెరైడ్డి సూర్యనారాయణకు నెల్లిమర్ల పట్టణంలో మంచిపేరు ఉందని, అలాగే తనకు, తనభార్యకు సర్పంచ్‌గా పనిచేసిన అనుభవముందని అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం. తమ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపునకు కృషిచేస్తామని ఇద్దరూ బయటకు చెబుతున్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గేది లేదని ఆ ఇద్దరు నేతలూ అధిష్ఠానానికి తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి ఇస్తారో..లేదా మూడోవ్యక్తికి టికెట్ కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.