తెంటు రామజోగినాయుడు(ఫైల్) మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు
శ్రీకాకుళం, రేగిడి: జిల్లాలో వాలీబాల్ ఆట పేరుచెప్పగానే గుర్తుకొచ్చే తెంటు రామజోగినాయుడు(65) ఇకలేరు. ఎన్నో ఏళ్లపాటు ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ అటు క్రీడాకారులను, ఇటు ఉద్యోగులను తయారుచేసిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శిగా సేవలందిస్తూ వస్తున్న ఆయన సోమవారం వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. ఉనుకూరు గ్రామంలోని తన ఇంటి వద్ద సోమవారం బాత్‌రూమ్‌కు వెళ్లి కూలబడ్డారు. వెంటనే కుటుంబీ కులు విశాఖపట్నానికి తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆçస్పత్రిలో వైద్యులు పరీక్షలు చేయగా హైబీపీ ఉండడంతో చికిత్స ప్రారంభించారు. మంగళవారం చికిత్సపొందుతుండగానే ఆయన మృతిచెందారు. హైబీపీ కారణంగా తలలో నరాలు చిట్లిపోవడంతో మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారని కుటుంబీకులు పేర్కొన్నారు.
ఇప్పటివరకూ ఒక్క టాబ్లెట్ కూడా ఎరుగరు
రామజోగినాయుడు మాస్టారు తనకు ఊహ తెలిసినప్పట్టి నుంచి ఇప్పటివరకూ ఒక్కదఫా కూడా టాబ్లెట్ వేసి ఎరుగరని కుటుంబీకులు తెలిపారు. ఇంతవరకూ జ్వరం అనే మాట లేదని అన్నారు. నిత్యం యోగా, వ్యాయామం చేసేవారన్నారు.
ఎన్నో సేవలు
రామజోగినాయుడు మాస్టారు 35 సంవత్సరాలు పాటు వ్యాయామ ఉపా«ధ్యాయునిగా సేవలు అందించారు. 1979లో మెరకముడిదాం పాఠశాలలో విధుల్లో చేరిన ఆయన 2013లో వంగర మండలం అరసాడ జెడ్‌పీ హైస్కూల్‌లో పీడీగా పదవీ విరమణ చేశారు. వందల సంఖ్యలో విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీలకు తయారుచేశారు. వాలీబాల్ అసోసియేషన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా, వాలీబాల్ అంతర్జాతీయ టీమ్‌కు మేనేజర్‌గా, చివరి సమయంలో జిల్లా కార్యదర్శిగా సేవలు అందిస్తూ వచ్చారు.
శోకసంద్రంలో ఉనుకూరు
తెంటు రామజోగినాయుడు మృతితో ఉనుకూరు గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈయన మరణవార్త విని భార్య తవుడమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం ఇంటికి చేరుకోగానే కుటుంబీకుల ఆర్తనాదాలు మిన్నంటాయి. పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకున్న ఆయన శిష్యగణం మాస్టారు లేవండి అంటూ మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు కంటతడిపెట్టింది. రామజోగినాయుడుకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు రవి వంగర మండలం మరువాడలో పీఈటీగా విధులు నిర్వహిస్తుండగా, రెండవ కుమారుడు శ్రీధర్ శ్రీహరిపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. వేలాదిమంది అభిమానులు మధ్య రామజోగినాయుడు మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.
పలువురి సంతాపం
రామజోగినాయుడు మృతిచెందిన విషయం తెలియగానే జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తెంటు కుటుంబీకులుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, డీఎస్‌డీఓ బి.శ్రీనివాసకుమార్, అ«థ్లెటిక్ కోచ్ కె.శ్రీధర్‌రావు, పీఈటీల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ రమణ, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కె.రాజారావు, గ్రిగ్స్ కార్యదర్శి కె.మాధవరావు, జిల్లా వాలీబాల్ సంఘం ఉపాధ్యక్షులు బడగల హరిధరరావుతో పాటు అసోసియేషన్ సభ్యులు వై.పోలినాయుడు, ఎం.తవిటయ్య, కె.హరిబాబు, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జి మదన్‌మోహన్, రేగిడి మండలం ఏపీటీఎఫ్ అధ్యక్షులు మురపాక వెంకటరమణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్‌మోహన్‌రావు, నెల్లి పెంటన్నాయుడు, గంటా మోహనరావుతో పాటు జిల్లా నలుమూలలు నుంచి పీఈటీలు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉనుకూరు చేరుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు.
రామజోగినాయుడు మాస్టారు మృతికి ఎమ్మెల్యే సంతాపం
రాజాం: రేగిడి మండలం ఉనుకూరు గ్రామానికి చెందిన జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి తెంటు రామజోగినాయుడు మృతికి మంగళవారం ఎమ్మెల్యే కంబాల జోగులు సంతాపం తెలిపారు. ఈయన మృతిచెందిన విషయం తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యారు. పార్టీ కార్యాలయం వద్ద సంతాప సూచికగా మౌనం పాటించారు. కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాలీబాల్ క్రీడాభివృద్ధికి, జిల్లా క్రీడరంగానికి ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment