ఓటు వజ్రాయుధం | Vote bought Austin | Sakshi
Sakshi News home page

ఓటు వజ్రాయుధం

Published Sat, Jan 25 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

Vote bought Austin

సాక్షి, మచిలీపట్నం : ప్రతి ఏటా ఓటర్ల దినోత్సవంనాడు అధికారులు, నేతలు మీటింగ్‌లు పెట్టి ఓటు గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇచ్చేస్తారు. అవన్నీ విన్న మనం తర్వాత మరిచిపోతాం.. మళ్లీ ఎన్నికల ఒక్కరోజు మాత్రమే నేతలు, ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఓటు ప్రాధాన్యతను గుర్తిస్తారు. శనివారం ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం తుది జాబితాను తయారుచేయడంలో మాత్రం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది.
 
జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 30,34,257 ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఎన్నికల సంఘం కొత్త ఓట్ల నమోదుకు అవకాశం ఇవ్వడంతో జిల్లాలో 2,01,303 మంది దరఖాస్తు చేసుకున్నారు. 14,443 మంది ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన తుది జాబితాలో 32,21,117 ఓటర్లు ఉంటారు. పాత ఓటర్ల జాబితాకు చేర్పులు మార్పులు చేసి తుది జాబితాను తయారుచేసేందుకు ఇంకా కసరత్తు సాగుతూనే ఉంది. రెండు లక్షల మంది కొత్తగా ఓటుకోసం దరఖాస్తు చేసుకోవడంతో వాటిని బూత్‌లవారీగా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు జిల్లా యంత్రాంగానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ కసరత్తు పూర్తిచేసిన అనంతరమే కొత్త జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. కొత్తగా గుర్తించిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాలవారీగా గుర్తింపు కార్డులు ఆదివారం జారీ చేయనున్నారు.
 
ఓటు నమోదు నిరంతరం సాగాలి..

 
ఓటు గొప్పతనం గురించి అందరూ చెబుతున్నా అందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఏదో ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమంగా ఓటర్ల నమోదుకు అవకాశం ఇస్తే తప్ప స్పందన రావడంలేదు. అందుకు ప్రజల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకోకపోవడమే కారణం. ఏటా జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందేలా ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆన్‌లైన్‌లోను ఓటు నమోదు చేసుకోవచ్చు.

ఇటువంటి అవకాశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో రెండు లక్షల మందికిపైగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 18 ఏళ్లు నిండిన  చాలా మంది ఓటు హక్కు కోసం  దరఖాస్తు చేసుకోలేదని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఓటు నమోదుకు సాంకేతిక సమస్యలు రావడం, యువత కొంతవరకు ఆసక్తి చూపకపోవడం కారణమంటున్నారు. ఓటు నమోదుకు సమయం కేటాయించడానికి కూడా ఇబ్బందిగా భావించిన వారు ఇంకా మిగిలే ఉన్నారు. ఇటువంటి వారిపై కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు అందించేలా కృషి చేయాలి.
 
నేడు ఓటర్ల చైతన్య కార్యక్రమం..
 
ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం బందరులో శనివారం ఓటర్ల చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  లక్ష్మీ టాకీసు నుంచి విద్యార్థులతో ఉదయం 8.30 గంటలకు 2కే రన్ నిర్వహించనున్నారు. ఈ రన్‌ను డీఆర్వో ఎల్.విజయ్‌చందర్, ఆర్డీవో పి.సాయిబాబు ప్రారంభిస్తారు. అనంతరం కోనేరు సెంటర్‌లో విద్యార్థులు మానవహారం నిర్వహిస్తారు. నోబుల్ కాలేజీ ఎదురుగా ఉన్న ఆశీర్వాద భవన్‌లో ఉదయం 11గంటలకు ఓటర్ల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు.  కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె. ప్రభాకరరావు, కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వి.వెంకయ్య  పాల్గొంటారు.
 
 పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు ఉండాలి.. పాలకులను ఎన్నుకోవడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.. ఓటును ప్రజల భవితకు భరోసా ఇచ్చే వజ్రాయుధంగా వాడాలి... ఇవి ఓటు గురించి మనం తరచు వినే మాటలు. మరి నిజంగా అంతటి శక్తిమంతమైన ఓటును ప్రజలు సద్వినియోగం చేస్తున్నారా.. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు ఉందా.. అనే ప్రశ్నలకు లేదనే సమాధానం వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement