నల్లబొడ్డూరు పోలింగ్ కేంద్రం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఇప్పుడు జిల్లాలోని పలాస నియోజకవర్గం మందస మండలంలో అలాంటి సిత్రమే చోటు చేసుకుంది. ఒక ఊరి వారి ఓట్లు మరో ఊరిలో, ఆ ఊరి ఓట్లు ఈ ఊళ్లోను వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అధికారులకు ముందు చూపు లేకపోవడం, ఆయా గ్రామస్తుల అవగాహనా రాహిత్యం ఇందుకు కారణమయింది. మందస మండలంలోని నల్లబొడ్లూరు (పోలింగ్ బూత్ నంబరు 197), బహడపల్లి (బూత్ నంబరు 196) గ్రామాలున్నాయి. బహడపల్లిలో ఓటర్లు 2,373 నుంచి 2,599కి పెరిగారు.
దీంతో మూడో పోలింగ్ బూత్ (198)ను నల్లబొడ్లూరులో ఏర్పాటు చేశారు. అలాగే నల్లబొడ్లూరులో 534 మంది ఓటర్లు పెరిగారు. నల్లబొడ్లూరులో పెరిగిన ఓటర్లను బహడపల్లి పోలింగ్ బూత్‌కు, బహడపల్లిలో పెరిగిన ఓటర్లను నల్లబొడ్లూరు పోలింగ్ బూత్‌కు కేటాయించారు. దీని వల్ల ఈ ఓటర్లు తమ గ్రామంలో పోలింగ్ బూత్‌లున్నా వేరే గ్రామానికి వెళ్లి ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పడు ఆ రెండు గ్రామాల ఓటర్లను అయోమయంలోకి నెట్టింది. దీనిపై ఆలస్యంగా మేల్కొన్న రాజకీయ నాయకులు అధికారుల వద్దకు పరుగులు తీశారు. ఏ గ్రామంలో ఓటర్లను ఆ గ్రామంలోనే ఓట్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు మార్పు చేయడం కుదరదని తేల్చి చెప్పేశారు. దీంతో వచ్చే నెల 11న జరిగే ఎన్నికల్లో వీరు పొరుగూళ్లకు వెళ్లి ఓటేయక తప్పదన్న మాట!
కలెక్టరేట్‌లో తప్పిదమే..
పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఓటర్లను ఆయా బూత్‌లకు కేటాయించే సమయంలో తమను కలెక్టరేట్ అధికారులు సంప్రదించలేదని స్థానిక రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. తమతో సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వీరంటున్నారు. విషయం తెలిశాక 8–ఎ ఫారాలను సమర్పించినా నిబంధనలు అంగీకరించవంటూ తిరస్కరించారని, ఈ ఇబ్బందిని ఈ రెండు గ్రామాల ప్రజలకు తెలియజేశామని వీరు చెబుతున్నారు. దీనిపై మందస తహసీల్దారు కొండలరావును సాక్షి వివరణ కోరగా ఇప్పట్లో బూత్‌లు మార్చడం వీలు కాదని, ఆయా ఓటర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment