కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీలో భాగంగా ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైటెక్ కాపీయింగ్ ముఠా పట్టుబడటం అధికారులను కలవరపర్చినా.. పరీక్ష సాఫీగా సాగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమనే నిబంధన అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రాలు సుదూరంలో ఉండటంతో ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు అభ్యర్థులు ఎదుర్కొన్న అవస్థలు వర్ణనాతీతం.
కొద్ది మంది శనివారం రాత్రే ప్రయాణం కాగా.. మరికొందరు ఆదివారం తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిన బస్సుల్లో ఇక్కట్లకు లోనయ్యారు. అభ్యర్థుల సంఖ్యకు తగిన బస్సులను నడపటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. వెళ్లే సమయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. నిల్చొనేందుకు స్థలం లేక బస్సు టాపుపై ప్రయాణించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. వీఆర్వో పోస్టులకు సంబంధించి 75,807 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 66,811 మంది(83.13 శాతం) హాజరయ్యారు. జిల్లాలోని 244 సెంటర్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
సరిగ్గా 10 గంటలకే పోలీసులు గేట్లు మూసేశారు. నంద్యాలలోని గురురాజ ఇంగ్లిష్ మీడియం సెంటర్‌కు అహోబిలం గ్రామానికి చెందిన ఓ అభ్యర్థి ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకోగా పోలీసులు అనుమతించలేదు. కోచింగ్ తీసుకున్నాను.. బస్సు జాప్యం వల్ల ఆలస్యమైందని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. జిల్లాలో ఇలాంటి అభ్యర్థులు చాలా మంది ఈ నిబంధనతో పరీక్ష రాయలేకపోయారు. వీఆర్‌ఏకు సంబంధించి 5,546 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,958 మంది(89.40 శాతం) మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు కర్నూలులోనే 17 సెంటర్లు ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, జేసీలు
వీఆర్వో పరీక్షను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి డోన్‌లో 2 సెంటర్లు, చిన్నటేకూరు సమీపంలోని కొట్టం ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ కళాశాల, విజయదుర్గ డిగ్రీ కళాశాల, మాంటిస్సోరి, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఉస్మానియా కళాశాల, అరబిక్ కళాశాల, కోల్స్, టౌన్‌మోడల్ కళాశాలలను తనిఖీ చేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు కూర్మానాథ్, నరసింహులు, రాంసుందర్‌రెడ్డిలు తమ పరిధిలోని వివిధ సెంటర్లను పరిశీలించారు.
అంతా ప్రశాంతం: కలెక్టర్
జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు. నిర్వహణలో అధికారులంతా జవాబుదారీతనం, సమన్వయంతో పని చేయడం వల్ల పరీక్షను పకడ్బందీగా నిర్వహించగలిగామని వెల్లడించారు.
ప్రశాంతం ‘పరీక్ష’
Published Mon, Feb 3 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement