కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లా అధికారుల ఒత్తిళ్లే డీఎంహెచ్‌ఓ వీఆర్‌ఎస్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. రెండున్నరేళ్ల సర్వీసు ఉండగానే ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం అదేనని సన్నిహితుల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే జిల్లాలో అధికారులుగా పనిచేయడం కత్తి మీద సాముగా మారింది. అయితే బదిలీ..
మిగతా 2వ పేజీలో ఠ
అయితే బదిలీ.. లేదంటే వీఆర్‌ఎస్!
22 కెఎన్‌ఎల్ 43ఎ - జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం
లేదంటే వీఆర్‌ఎస్ తీసుకోవాల్సిందేనని, అందుకు సిద్ధమైతేనే ఇక్కడ అధికారులుగా ఉండగలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కోవలోనే ఒత్తిళ్లు తట్టుకోలేక ఒక్కొక్కరుగా బదిలీపై వెళ్తున్నారు. తాజాగా జిల్లా వైద్యాధికారి తీసుకున్న నిర్ణయం సైతం అందులో భాగమేనని సమాచారం. గత నవంబర్‌లో డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నిరుపమ ఐదు నెలల్లోనే వీఆర్‌ఎస్‌కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది.
గైనకాలజిస్టుగా ఆమెకు ఇప్పటికీ మంచి ప్రాక్టీస్ ఉంది. ఆమె భర్త డాక్టర్ సుదర్శన్ కర్నూలులో బిజీ ప్లాస్టిక్ సర్జన్‌గా ఉన్నారు. జిల్లాకు ఏదో చేద్దామని వచ్చిన తనకు విధి నిర్వహణలో ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయని ఊహించలేకపోయానని ఆమె సన్నిహితులతో వాపోతున్నారు. ఐదు కీలక పోస్టులు ఖాళీగా ఉంటే.. ఏ అధికారి అయినా ఏం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుతం ఐదు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు నెలల క్రితం తగిన మర్యాదలు చేయలేదనే కారణంతో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ యు.రాజాసుబ్బారావును సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ఆయన లెప్రసీ, ఎయిడ్స్ కంట్రోల్ అధికారిగా కూడా పని చేశారు. దీంతో ఆ రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. అదేవిధంగా ఆరు నెలల క్రితం డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ అధికారిగా పనిచేసిన డాక్టర్ అనిల్‌కుమార్ బదిలీ అయ్యారు. ఈ పోస్టు కూడా ఇప్పటికీ భర్తికి నోచుకోలేదు. యేడాదికి పైగా మాస్‌మీడియా అధికారి పోస్టు సైతం ఖాళీగా ఉంది.
దీనికితోడు పీసీ పీఎన్‌డిటి యాక్ట్ అమలు చేసే అధికారి డాక్టర్ ధనుంజయ అకాల మరణంతో మూడు నెలలుగా ఆ పోస్టులోనూ ఎవరినీ నియమించలేదు. దీంతో పాటు పలు క్లస్టర్ అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉండిపోయాయి. ఫలితంగా జిల్లాలో ఏ మూలన ఏం జరిగినా డీఎంహెచ్‌వోకు ఫోన్లు వస్తున్నాయి. సమయపాలన లేకుండా వచ్చే ఫోన్లు.. సమస్యల గురించి ఏకరువు పెట్టినా వాటిని పరిష్కరించే అవకాశం లేకపోవడం డీఎంహెచ్‌వో డాక్టర్ నిరుపమను తీవ్రంగా మనస్తాపానికి గురిచేసినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదంటూ ఉన్నతాధికారుల నుంచి వేధింపులు అధికం కావడంతో జనవరి నెలలోనే ఆమె వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీపై వివాదం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని రౌండ్ ది క్లాక్ హాస్పిటల్స్‌లో స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి జరిగిన తతంగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను సంతకం చేసి వారం రోజులవుతున్నా మెరిట్ జాబితాను ఎందుకు ప్రకటించలేదంటూ గత సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నిరుపమపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా ప్రకటించే పత్రికా ప్రకటనపై జిల్లా కలెక్టర్ చేసిన సంతకం వద్ద వేసిన తేదీ వివాదాస్పదంగా మారింది. వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం వారు ఆ ప్రకటనను 20వ తేదీన టైప్ చేసి తీసుకెళ్లగా జిల్లా కలెక్టర్ మాత్రం దానిపై సంతకం చేసిన చోట పదవ తేదీగా పేర్కొనడం చర్చనీయాంశమైంది.
జిల్లా కలెక్టర్ పదిరోజుల ముందుగా తేదీ ఎందుకు వేశారని కార్యాలయంలో చర్చ జరుగుతోంది. తాము రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నా జిల్లా కలెక్టర్ దూషించడం తట్టుకోలేకపోతున్నానని ఆమె సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల కర్నూలుకు వచ్చిన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కలిసి తాను దరఖాస్తు చేసుకున్న వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ నిరుపమ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై ఆమెకు ఎల్వీ సుబ్రహ్మణ్యం నచ్చజెప్పాలని చూసినా వీఆర్‌ఎస్‌కే మొగ్గు చూపినట్లు సమాచారం.
అయితే బదిలీ.. లేదంటే వీఆర్‌ఎస్!
Published Thu, Apr 23 2015 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement