సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘నేను ఎన్నికల్లో పోటీ చేయను. పోటీ చేసినా గెలవను. ఏ పార్టీలోనూ చేరను. స్వంత పార్టీపైనే అవిశ్వాసం పెట్టిన నాకు రాజకీయ భవిష్యత్ లేదు. మిగిలిన జీవితంలో కలం, కాగితంతో కాలక్షేపం చేస్తాను’ రాజమండ్రి నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఉండవల్లి అరుణ్‌కుమార్.. తెలంగాణ బిల్లు నేపథ్యంలో గత నెల రెండున కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సందర్బంలో అన్న మాటలివి.
ఈ పలుకులు పలికి పట్టుమని రెండు నెలలు కూడా గడవ లేదు. అయితే.. విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం అనంతరం నాటకీయంగా పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఉండవల్లిని చూసి జిల్లావాసులు విస్తుబోతున్నారు. కొత్తపార్టీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న కిరణ్ బృందంలో ఉండవల్లి క్రియాశీలంగా వ్యవహరించడం ఆయన అనుచరులకే కొరుకుడు పడడం లేదు.
విరక్తి.. ముందస్తు వ్యూహమే..
నిజానికి.. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న ఉండవల్లి పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడే అదంతా ముందస్తు వ్యూహంలో భాగం కావచ్చని ఆ పార్టీ నాయకులే అనుమానపడ్డారు. గత రెండు రోజులుగా కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఏర్పాటు, ఆయన వెంట వచ్చే ఎమ్మెల్యేలెందరు వంటి విషయాలపై హైదరాబాద్‌లోని తన సొదరుడి నివాసంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీల్లో కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎంపీలు ఆరుగురిలో హర్షకుమార్‌తో పాటు ఉండవల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన హర్షకుమార్ తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూద్దామని చెప్పుకొచ్చారు.
ఉండవల్లి మాత్రం రాజకీయాలపై రోసినట్టు కఠిన నిర్ణయాన్ని ప్రకటించేశారు. తీరా ఆచరణకు వచ్చేసరికి తాను మిగిలిన నేతల మాదిరే రాజకీయాలకు అతీతుడిని కాదని చెప్పకనే చెపుతున్నారు. విభజనపై అధిష్టానం తీరుతో విసుగెత్తిన కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టే విషయం ఆలోచిస్తున్నారని ఉండవల్లి ముఖ్య అనుచరుడైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హైదరాబాద్‌లో మీడియాతో పేర్కొనడం గమనార్హం.
ఉండవల్లి తీసుకునే నిర్ణయంపైనే తన నిర్ణయం ఉంటుందన్న రౌతు మాటల్ని బట్టి రాజకీయాలపై ఉండవల్లి వైరాగ్యం కేవలం ప్రచారార్భాటమేనన్న వ్యాఖ్య సర్వత్రా వినిపిస్తోంది. ఉండవల్లి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారే తప్ప, రాజకీయాల్లో సిద్ధాంతకర్తగా ఉండనని ఎక్కడా చెప్పలేదు కదా అని ఆయన అనుచరుల్లో కొందరు సమర్థిస్తున్నారు. అయితే విభజన విషయంలోనూ ఇదే రీతిలో వ్యవహరించబట్టే అధిష్టానం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శ వినిపిస్తోంది.
‘కిరణ్’తో ప్రయాణానికి ఎమ్మెల్యేల వెనుకంజ..
కాగా, కిరణ్ పెట్టబోయే పార్టీలో ఉండవల్లి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా జిల్లా ఎమ్మెల్యేలు వారి వెంట నడిచేందుకు సాహసించడం లేదు. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు తన వెంట ఉంటారని కిరణ్ ఆశించారు. అయితే రాజమండ్రి సిటీ, పిఠాపురం, పెద్దాపురం ఎమ్మెల్యేలు రౌతు, వంగా గీత, పంతం గాంధీమోహన్‌లతో పాటు ఎమ్మెల్సీలు బలశాలి ఇందిర, అంగూరి లక్ష్మీశివపార్వతి మాత్రమే ఆయనతో భేటీ అయ్యారు. వీరిలో గీత, పంతం టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో కిరణ్ స్వయంగా ఫోన్ చేసి వారిని పిలిచినట్టు తెలుస్తోంది.
పార్టీ ఏర్పాటుపై కిరణ్ వారితో విడివిడిగా మాట్లాడినా ఏ ఒక్కరూ అనుసరిస్తామన్న భరోసా ఇవ్వనట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడాకే చెపుతామనడాన్ని బట్టి.. కిరణ్‌తో వెళ్లడం వివేకం కాదన్న యోచనతోనే అంటున్నారు. మొదటి నుంచీ కిరణ్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు శేషారెడ్డి, రాజా అశోక్‌బాబు, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరీదేవి కూడా ఈ అభిప్రాయంతోనే భేటీకి ముఖం చాటేశారని సమాచారం. మొత్తం మీద కిరణ్ పెట్టే కొత్తపార్టీపై జిల్లా ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా ఈ వ్యవహారంలో ఉండవల్లి పెద్దన్నయ్య పాత్ర పోషిస్తుండడం జిల్లాలో చర్చకు తెరతీసింది.