వేతనాలు సక్రమంగా అందకపోవడంతో సచివాలయ సిబ్బంది అల్లాడుతున్నారు. రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలుఇస్తుండడంతో ఇళ్లు గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే అరకొర జీతాల్లో కూడా కొర్రీలుపెడుతున్నారని.. రెండు రోజులకు మించి సెలవు తీసుకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకుపాల్పడుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలలో హౌస్ కీపింగ్ సిబ్బంది సుమారు 170 మంది పని చేస్తున్నారు. ఇందులో 150 మంది మహిళా సిబ్బంది. మిగిలిన వారు సూపర్‌వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయంలోని ఆరు బ్లాకులు, అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం వీరి విధి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగంలో చేరిన మూడు నెలలకు జీతాన్ని రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతామని చెప్పి రూ.6,400 ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. నెలకు కనీస సెలవులు కూడా ఇవ్వడం లేదని.. సెలవులు తీసుకుంటే జీతాన్ని కట్ చేసి ఇస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
బ్యాంకు ఖాతాలోజమ చేయని అధికారులు..
బ్యాంకు ఖాతాల్లో జీతం జమ చేయకుండా చేతికి ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకులో జమ చేస్తే సిబ్బందికి ఇచ్చే జీతం ఎంత.? ఈఎస్‌ఐకి ఎంత కట్ చేస్తున్నారు ? పీఎఫ్ ఎంత కట్ అవుతోంది ? అనే వివరాలు కచ్చితంగా ఉంటాయి. చేతికి ఇవ్వడం వల్ల జీతంలో బేసిక్ ఎంత, హెచ్‌ఆర్ ఎంత అనే వివరాలు కూడా తమకు తెలియడం లేదని వాపోతున్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ పేరుతో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఈఎస్‌ఐ కార్డులను ఆస్పత్రికి తీసుకెళితే చెల్లడం లేదని చెబుతున్నారు. ప్రతి నెలా జీతాలు ఇవ్వమని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సిబ్బంది కోరుతున్నారు. సచివాలయం, అసెంబ్లీలో విధులు నిర్వర్తించే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహించే కార్మికుల సమస్యలను మాత్రమే కాదు.. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది వెతలు తీర్చేందుకు కూడా చొరవ చూపాలని, ఉద్యోగ భద్రత చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సచివాలయంలో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తమకు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment