house keeping people
-
దారుణ పరిస్థితుల్లో పనిచేశాం: జెఫ్ బెజోస్పై కోర్టుకెక్కిన మాజీ మహిళా ఉద్యోగి
న్యూఢిల్లీ: అమెజాన్ సీఈవో, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. జాతి వివక్ష, ఎక్కువ పనిగంటలు ఆరోపణలతో ఆయన మాజీ విమెన్ హౌస్ కీపర్ కోర్టుకెక్కడం కలకలం టెక్ వర్గాల్లో కలకలం రేపింది. సరైన తిండి, నిద్ర, కనీసం వాష్‌రూం కూడా లేకుండా అపరిశుభ్రమైన పరిస్థితులలో ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చిందని ఆరోపిస్తూ సీటెల్ స్టేట్ కోర్టులో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. 2019 సెప్టెంబరులో అమెజాన్ బాస్ బెజోస్ వ్యవస్థాపక సిబ్బందిలో చేరిన మెర్సిడీస్ వేదా ఈ దావా వేశారు. ఇదు నుండి ఆరుగురు హౌస్కీపర్ల బృందానికి తాను సూపర్వైజర్గా ఉన్నట్టు తెలిపారు. ఈ సమయంలో తమపై జాతి వివక్ష చూపించారనీ, కనీస విశ్రాంతి, భోజన విరామాలు లేకుండా కొన్నిసార్లు రోజుకు 10 నుండి 14 గంటలు పనిచేయించుకున్నట్టు ఆరోపించారు. నిర్ణీత విరామ గది లేదా విశ్రాంతి స్థలం లేకుండా, సరైన రెస్ట్రూమ్ లేకుండా దయనీయ పరిస్థితుల్లో పనిచేశామన్నారు. కనీసం సెక్యూరిటీ రూంకు దగ్గరలోని టాయిలెట్‌ని వాడుకోనీకుండా ఆంక్షలు విధించే వారనీ, బాత్రూంలోకి ప్రవేశించడానికి కిటికీ నుండి వెళ్లమని చెప్పేవారని, ఒకదశలో హౌస్‌కీపింగ్ సిబ్బంది లాండ్రీ గదిలో తినేవారనీ వేదా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో తనను అన్యాయంగా తొలగించారని ఆమె వాపోయారు. చట్ట ప్రకారం తమకు పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు "శ్రామిక, ఉపాధి చట్టాలకనుగుణంగా శ్రామికులకు వేతనాలు చెల్లించడమే కాకుండా, వారికి సురక్షితమైన, సానిటరీ, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని’’ వేదాకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది పాట్రిక్ మెక్గైగన్ వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు సరైననవి కావంటూ బెజోస్ లాయర్లు తిరస్కరించారు. ఈ మేరకు న్యాయవాది హ్యారీ కొరెల్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. బెజోస్ గృహ నిర్వాహకులతో ఒకరు వేదాతో దురుసుగా ప్రవర్తించడంతో దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు చెప్పారు. -
జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్లో తన సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్ కీపింగ్ బాయ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా బట్టి గూడెం గ్రామానికి చెందిన బొంగరాల బెనర్జీ (18) ఓ హోటల్లో ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాడు. (చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు, ఇంకా పెళ్లి కాలేదని..హోటల్‌కు తీసుకెళ్లి) మూడురోజుల క్రితం తన సెల్‌ఫోన్ వీడియో కెమెరా ఆన్ చేసి హోటల్లో మహిళలు ఉపయోగించే టాయిలెట్లో పైన పెట్టాడు. దానిలో రికార్డైన వీడియోలు ప్రతిరోజూ చూస్తుండేవాడు. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతోంది. అయితే బుధవారం ఓ యువతి ఆ సెల్‌ఫోన్‌ను గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఆ బలం ఆర్చనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో) సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. సుమారు 20 మంది మహిళల వీడియోలు ఫోన్లో చిత్రీకరించినట్లుగా గుర్తించారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడురోజుల నుంచే ఈ తతంగం నడుస్తోందా? ఇంతకు ముందు కూడా ఏమైనా వీడియోలు తీశాడా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అతడి భార్య, ఆమె భర్త మిస్సింగ్.. పోలీసులే అవాక్కయ్యారు!) -
భళా బిందు.. స్వయం ఉపాధి
సాక్షి, ఖమ్మం: పని చేయాలనే తపన, స్వయం ఉపాధి పొందాలనే ఆసక్తితో ఖమ్మంలోని ముస్తఫానగర్‌కు చెందిన వి. భానుసాయిబిందు ధైర్యంగా, వినూత్న మార్గం ఎంచుకున్నారు. హౌస్ కీపింగ్ సేవల పేరిట..పెద్దపెద్ద ఇళ్లు, వివిధ సంస్థల కార్యాలయాలను శుభ్రపరచడం, వస్తువలన్నింటినీ అందంగా సర్దడం, ఇళ్లు మారినప్పుడు సామగ్రినంతా ప్యాకింగ్ చేసి భద్రంగా మరోచోటుకు తరలించడం తదితర పనులను తనతో పాటు పలువురు మహిళలతో కలిసి చేస్తున్నారు. పనిపట్ల చూపే ప్రత్యేక శ్రద్ధ వల్ల మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ గుర్తింపు పొందుతున్నారు. ఎంకామ్ ఉన్నత విద్య చదివిన వంగిభురాత్చి భానుసాయిబిందు ముస్తఫానగర్ పురపాలక సంఘం బోర్డు దగ్గర జిరాక్స్, నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక సంస్థలో హౌస్ కీపింగ్‌లో శిక్షణ పొంది..కేవలం మహానగరాలకే పరిమితమైన సేవలను ఐదు సంవత్సరాల క్రితం కీర్తి హౌస్ కీపింగ్ సర్వీసెస్ పేరిట ఖమ్మం నగరానికి పరిచయం చేసి..కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 20 మంది మహిళలకు పని కల్పిస్తున్నారు. వీరితో పాటు 10 మంది పురుషులు కూడా ఉపాధి పొందుతున్నారు. గూగుల్‌లో కీర్తి హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఖమ్మం అని టైప్‌చేస్తే వీరి పూర్తి వివరాలు, చేసిన పనుల వీడియోలు చూడొచ్చు. నగర వాసులకు ప్రత్యేకం ఉరుకులు పరుగుల కాలంలో, ఉద్యోగ, వ్యాపార ఒత్తిడిలో ఉన్న వారికి వీరి సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భార్యాభర్తలు ఉద్యోగం చేసే వారు కొందరైతే, అనారోగ్య సమస్యలతో పనులు చేసుకోలేకపోయేవారు ఇంకొందరు, వంట, ఇతర పనులతో బిజీగా ఉండి ఇంటిని శుభ్రం చేసుకోకపోవడం, అందంగా సర్దుకోవడానికి సమయం లేని వారు అనేకమంది. వీరందరికీ ఉపయోగపడుతోంది కీర్తిహౌస్ కీపింగ్ సర్వీస్. ఇల్లు శుభ్రం చేసి వస్తువులు అందంగా సర్దడానికి కూడా పనివాళ్లు దొరుకుతారా..? అంటే మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. సమయానికి వచ్చి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి.. ప్రతిఫలంగా డబ్బులు తీసుకుని ఉపాధి పొందుతున్నారు. ఇళ్లకు వచ్చి అందించే సేవలు ఇవే.. నగరంలో కీర్తి హౌస్ కీపింగ్ సర్వీస్ వారు తమ సేవలను విస్తృతంగా అందిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఇళ్లు, కార్యాలయాల్లో బూజులు దులపడం, కార్పెట్, సోఫాలను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడం, ఇల్లు మారినప్పుడు సామానంతా సురక్షితంగా చేరవేయడం చేస్తున్నారు. ఇంకా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్, పెయింటర్, చెదలు నియంత్రణ, కార్పెంటర్ తదితర పనులు కూడా చేస్తున్నారు. ఇన్వెర్టర్, గీజర్, ఏసీ, ఆర్వో సిస్టమ్ బిగించాలన్నా, మరమ్మతులు చేయాలన్నా మేమున్నాం అంటూ ఒక్క ఫోన్ చేస్తే వచ్చేస్తాం అంటున్నారు. ఉపాధి కల్పించాలనే.. తొలుత నెట్ సెంటర్ ద్వారా స్వయం ఉపాధి పొందా. చిన్న ఆలోచనతో పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో హౌస్ కీపింగ్ సర్వీసెస్‌ను ప్రారంభించాను. 10 మంది మహిళలతో కలిసి మొదలెట్టా. ఇప్పుడు 30మంది పనిచేస్తున్నారు. ఖమ్మంలో మేం చేస్తున్న పనులకు మంచి గుర్తింపు వస్తోంది. మా సేవలు పొందాలంటే 88974 35396 సెల్ నంబర్లో సంప్రదించవచ్చు. – భానుసాయి బిందు, కీర్తి హౌస్ కీపింగ్ సర్వీసెస్ నిర్వాహకురాలు, ఖమ్మం -
సుశాంత్ మృతి: జూన్ 14న ఏం జరిగిందంటే..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల విచారణలో సుశాంత్ హౌస్‌కీపర్ నీరజ్ సింగ్ కీలకాంశాలు వెల్లడించాడు. అసలు జూన్ 14న ఏం జరగింది అనే దాని గురించి నీరజ్ సింగ్ మాటల్లోనే.. ‘రోజులానే ఆ రోజు(జూన్ 14) నేను ఉదయం 6.30 గంటలకి లేచాను. ఆ తర్వాత కుక్కలను బయటకు తీసుకెళ్లాను. 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాను. ఆ తర్వాత గదులు, మెట్లు శుభ్రం చేశాను. ఇంతలో సుశాంత్ సార్ తన గది నుంచి వచ్చి చల్లటి నీరు అడిగారు. తీసుకెళ్లి ఇచ్చాను. వాటర్ తాగి హాల్ శుభ్రం చేశావా అని నన్ను ప్రశ్నించి.. నవ్వుతూ తన గదిలోకి వెళ్లారు. ఆ తరువాత, ఉదయం 9:30 గంటలకు, నేను హాల్ శుభ్రం చేస్తున్నప్పుడు, కేశవ్ (కుక్) అరటిపండ్లు, కొబ్బరి నీళ్ళు, జ్యూస్ తీసుకుని సార్ గదిలోకి వెళ్లడం చూశాను. కేశవ్ తిరిగి వచ్చి, సార్ కొబ్బరి నీళ్ళు, జ్యూస్ మాత్రమే తీసుకున్నారని చెప్పాడు’ అని తెలిపాడు నీరజ్. 10.30 గంటల ప్రాంతంలో డోర్ లాక్ ఆ తర్వాత ‘ఉదయం 10:30 గంటలకు, మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలో తెలుసుకునేందుకు కేశవ్ మళ్ళీ సార్ గదికి వెళ్లాడు. అతను తలుపు తట్టాడు కాని గది లోపలి నుంచి లాక్ చేసి ఉంది.. ఎటువంటి స్పందన లేదు. దాంతో కేశవ్ సార్ నిద్రపోతున్నాడని భావించి కిందకు వచ్చాడు. ఈ విషయాన్ని దీపేశ్, సిద్ధార్థ్‌లకు చెప్పాడు. వారు కూడా గదికి వెళ్లి తలుపు మీద కొట్టడం ప్రారంభించారు. వారు చాలా సేపు తలుపు తట్టారు కాని లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో దీపేశ్ దిగి వచ్చి దాని గురించి నాకు చెప్పాడు. నేను కూడా సార్ గదికి వెళ్లి తలుపు తట్టాను కానీ తెరవ లేదు. ఇంతలో సిద్ధార్థ్, సార్ ఫోన్‌కి కాల్ చేశాడు. కాని సార్ రూమ్ డోర్ తెరవలేదు.. ఫోన్‌కు సమాధానం ఇవ్వలేదు. మేము గది తాళం కోసం వెతకడం ప్రారంభించాము. అయితే అప్పుడు అవి మాకు దొరకలేదు. దాంతో దీని గురించి సుశాంత్ సోదరి మీతు దీదీకి చెప్పాం. ఆమె తాను బయలుదేరానని.. గది తలుపులు తెరవమని మాకు చెప్పారు’ అన్నాడు నీరజ్. (సుశాంత్ కేసు: కీలక సాక్షుల విచారణ) తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం.. ‘తాళం తీయడానికి సిద్ధార్థ్ ఒక కీ మేకర్‌ను పిలిచాడు. వాళ్లు వచ్చారు కాని వారు ఎక్కువ సమయం తీసుకుంటున్నందున వారిని వెంటనే పంపేశారు. ఆ తరర్వాత మిగతా పనివారి సాయంతో తలుపులు పగలగొట్టి గదిలోకి ప్రవేశించారు. అప్పుడు గదిలో చీకటిగా ఉంది, ఏసీ ఆన్‌లోనే ఉంది. దీపేశ్ లైట్ ఆన్ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ లోపలకు వెళ్లి వెంటనే బయటకు వచ్చాడు. అతని వెనుక, నేను లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత సుశాంత్ సోదరి మీతు వచ్చారు. రాగానే‘ గుల్షన్ తూనే యే క్యా కియా ’అని అరవడం ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసులను పిలిచారు’ అని తెలిపాడు నీరజ్. (అలా బయటకు కనిపిస్తారా?) -
‘సఫాయివాలా’లు ఇకపై ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’
న్యూఢిల్లీ: తమ శాఖలో పనిచేసే ‘సఫాయి వాలా’ల పేరును ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సంఘాలతో చర్చించిన మీదట రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. వైద్య, పర్యవేక్షక, తదితర విభాగాల్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేసే గ్రూప్–డీ ఉద్యోగులే సఫాయి వాలాలు. ఇకపై వీరిని ప్రతి విభాగం, శాఖతో కలిపి హౌస్ కీపింగ్ అసిస్టెంట్లుగా సంబోధిం చాల్సి ఉంటుందని తెలిపింది. వీరి ఎంపిక, నియామక విధానం, అర్హతలు, సీనియారిటీ, పదోన్నతి ప్రక్రియ, వేతనంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని జోనల్ విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
వేతన వెతలు.. !
వేతనాలు సక్రమంగా అందకపోవడంతో సచివాలయ సిబ్బంది అల్లాడుతున్నారు. రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలుఇస్తుండడంతో ఇళ్లు గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే అరకొర జీతాల్లో కూడా కొర్రీలుపెడుతున్నారని.. రెండు రోజులకు మించి సెలవు తీసుకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకుపాల్పడుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలలో హౌస్ కీపింగ్ సిబ్బంది సుమారు 170 మంది పని చేస్తున్నారు. ఇందులో 150 మంది మహిళా సిబ్బంది. మిగిలిన వారు సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయంలోని ఆరు బ్లాకులు, అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం వీరి విధి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగంలో చేరిన మూడు నెలలకు జీతాన్ని రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతామని చెప్పి రూ.6,400 ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. నెలకు కనీస సెలవులు కూడా ఇవ్వడం లేదని.. సెలవులు తీసుకుంటే జీతాన్ని కట్ చేసి ఇస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలోజమ చేయని అధికారులు.. బ్యాంకు ఖాతాల్లో జీతం జమ చేయకుండా చేతికి ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకులో జమ చేస్తే సిబ్బందికి ఇచ్చే జీతం ఎంత.? ఈఎస్ఐకి ఎంత కట్ చేస్తున్నారు ? పీఎఫ్ ఎంత కట్ అవుతోంది ? అనే వివరాలు కచ్చితంగా ఉంటాయి. చేతికి ఇవ్వడం వల్ల జీతంలో బేసిక్ ఎంత, హెచ్ఆర్ ఎంత అనే వివరాలు కూడా తమకు తెలియడం లేదని వాపోతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఈఎస్ఐ కార్డులను ఆస్పత్రికి తీసుకెళితే చెల్లడం లేదని చెబుతున్నారు. ప్రతి నెలా జీతాలు ఇవ్వమని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సిబ్బంది కోరుతున్నారు. సచివాలయం, అసెంబ్లీలో విధులు నిర్వర్తించే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహించే కార్మికుల సమస్యలను మాత్రమే కాదు.. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది వెతలు తీర్చేందుకు కూడా చొరవ చూపాలని, ఉద్యోగ భద్రత చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సచివాలయంలో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తమకు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. -
రైళ్లలో పరిశుభ్రతపై ప్రయాణికుల రేటింగ్
న్యూఢిల్లీ: రైళ్లు, స్టేషన్లలో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఓ ఒప్పందాన్ని రూపొందించింది. దీని ప్రకారం రైళ్లలో పరిశుభ్రతపై ప్రయాణికులు రేటింగ్ ఇవ్వవచ్చు. ఈ రేటింగ్ ఆధారంగా కాంట్రాక్టర్లకు ఇచ్చే నెలవారీ ప్రోత్సాహకాల్లో 30 శాతం వెయిటేజ్ ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే రైల్వేలో ప్రతి విభాగం కాంట్రాక్టర్లపై ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా వారికి జరిమానాలు, బోనస్‌లు అందిస్తామని వెల్లడించింది. రైల్వే సూపర్వైజర్ కాంట్రాక్టర్ల హాజరుపై నివేదించిన వివరాల ఆధారంగా 25 శాతం, పరిశుభ్రత ఆధారంగా 15 శాతం, రైల్వే అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా మరో 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. పరిశుభ్రతపై ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడం వల్ల వ్యవస్థలోని లోపాలను క్షేత్రస్థాయిలో గుర్తించే అవకాశం ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారాన్ని జీపీఎస్ ఆధారిత వ్యవస్థలో రికార్డు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌బోర్డు హౌస్ కీపింగ్ స్టాఫ్(ఓబీహెచ్ఎస్) 1,700కి పైగా రైళ్లలో క్లీనింగ్ సర్వీస్‌ను అందిస్తోంది. -
ఏపీ సచివాలయం లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు
సచివాలయంలో లిఫ్ట్‌లో ఇరుకున్న సిబ్బంది ప్రాణభయంతో హడలిపోయిన బాధితులు లోపలనుంచి తమను రక్షించండని మీడియా ప్రతినిధులకు ఫోన్లు 25 నిముషాల తర్వాత ఎట్టకేలకు లిఫ్ట్ మరమ్మతు సాక్షి, అమరావతి: రెండ్రోజుల క్రితం అసెంబ్లీ నిండా వర్షపు నీళ్లు. అదే రోజు మడుగులా మారిన సచివాలయం. తాజాగా లిఫ్ట్‌లో పదిమంది పారిశుధ్య సిబ్బంది లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణభయంతో కేకలు వేయడం ఇదీ సచివాలయంలో తంతు. వివరాల్లోకి వెళితే.. ఏపీ సచివాలయంలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఏడెనిమిదిమంది పారిశుధ్య సిబ్బందితో పాటు ఒకరిద్దరు సందర్శకులు 3వ బ్లాకులో కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చింది గానీ, ద్వారాలు తెరుచుకోలేదు. ఎంత అరచినా ఎవరూ స్పందించలేదు. దీంతో లోపలున్న సిబ్బంది ప్రాణభయంతో భీతిల్లారు. దీంతో సాక్షి ప్రతినిధికి ఫోన్ చేశారు. తమకు ఊపిరి (ఆక్సిజన్) అందడం లేదని, తమను రక్షించడంటూ ఫోన్ చేశారు. దీంతో సాక్షి టీవీలో స్క్రోలింగ్‌లు వచ్చాయి. ఒక్కసారిగా విషయం అందరికీ తెలిసింది. విషయం తెలియడంతో సచివాలయంలో ఫొటోగ్రాఫర్లు కూడా 3వ బ్లాకు వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్లారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికీ తెలిసింది. దీంతో పరిగెట్టుకుంటూ వెళ్లి లిఫ్ట్ నిర్వాహకులను పిలిపించారు. అప్పుడు వచ్చి లిఫ్ట్ ద్వారాలు తెరుచుకునేలా చేశారు. ద్వారాలు తెరుచుకునే సరికి 25 నిముషాలు పైనే పట్టింది. ద్వారాలు తెరుచుకునే సరికి బాధితులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఐదు నిముషాల అనంతరం ఊపిరి అందడం లేదని, ప్రాణం పోతుందేమోనన్న భయం వచ్చిందని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సిబ్బంది చెప్పారు. లిఫ్ట్‌లో ఓ దివ్యాంగుడుకూడా ఉన్నారు. అంతర్జాతీయ రాజధానికి ఆయువుపట్టయిన సచివాయలయంలో 25 నిమిషాలు తమను రక్షించేవాడు లేకపోవడం దారుణమని బాధితుల్లో ఒకరు వ్యాఖ్యానించారు.