
న్యూఢిల్లీ: రైళ్లు, స్టేషన్లలో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఓ ఒప్పందాన్ని రూపొందించింది. దీని ప్రకారం రైళ్లలో పరిశుభ్రతపై ప్రయాణికులు రేటింగ్ ఇవ్వవచ్చు. ఈ రేటింగ్ ఆధారంగా కాంట్రాక్టర్లకు ఇచ్చే నెలవారీ ప్రోత్సాహకాల్లో 30 శాతం వెయిటేజ్ ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే రైల్వేలో ప్రతి విభాగం కాంట్రాక్టర్లపై ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా వారికి జరిమానాలు, బోనస్‌లు అందిస్తామని వెల్లడించింది.
రైల్వే సూపర్‌వైజర్ కాంట్రాక్టర్ల హాజరుపై నివేదించిన వివరాల ఆధారంగా 25 శాతం, పరిశుభ్రత ఆధారంగా 15 శాతం, రైల్వే అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా మరో 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. పరిశుభ్రతపై ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడం వల్ల వ్యవస్థలోని లోపాలను క్షేత్రస్థాయిలో గుర్తించే అవకాశం ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారాన్ని జీపీఎస్ ఆధారిత వ్యవస్థలో రికార్డు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌బోర్డు హౌస్ కీపింగ్ స్టాఫ్(ఓబీహెచ్‌ఎస్) 1,700కి పైగా రైళ్లలో క్లీనింగ్ సర్వీస్‌ను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment