పల్లెల్లో సంక్రాంతి హడావుడి
ఉదయుగిరి: దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండగైన సంక్రాంతికి మరో రోజు ఉన్నప్పటికీ ఆ హడావుడి అటుపల్లెల్లోనూ, ఇటు పట్టణాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ధనిక, పేద తేడా లేకుండా ఈ పండక్కి సంబంధించి న సామగ్రిని, వస్త్రాలను కొనుగోలు చేసేందుకు పల్లెలనుంచి ఉదయగిరి పట్టణానికి పెద్దసంఖ్యలో తరలి వస్తుండటంతో దుకాణాలన్నీ కిక్కిరిశాయి. ముఖ్యంగా వస్త్రదుకాణాల్లో ఈ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. అదేవిధంగా వివిధ రకాల పిండివంటలు తయారుచేసుకునేందుకు తెచ్చిన సరుకులను మర పట్టించునేందుకు పిండిమిల్లుల వద్ద కూడా క్యూలు కట్టారు.
సంక్రాంతి పండగ అంటే బాగా గుర్తొచ్చేది ఇంటిముందు ముగ్గులు. దీనికోసం ఉపయోగించి వివిధ రకాల రంగులను కూడా మహిళలు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. భోగిమంటలకు సంబంధించిన తాటాకులు, కంప, ఇతరత్రా సామగ్రిని సమకూర్చుకునే పనుల్లో యువత చురుగ్గా నిమగ్నమయ్యారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు తిరిగి వస్తుండటంతో పల్లెలు కూడా బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. మొత్తమ్మీద ఉదయగిరి ప్రాంతంలో కరువు పరిస్థితులున్నప్పటికీ సంక్రాంతి ని తమకు తగిన స్థోమతతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.