‘విజయ’ పోరు..మళ్లీ షురూ!
విజయవాడ : కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ పాలకవర్గంలో ముగ్గురు డెరైక్టర్లను ఎన్నుకునేందుకు గురువారం పోలింగ్ జరగనుంది. పాలకవర్గంలో ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు మళ్లీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. చైర్మన్ మండవ జానకిరామయ్య, ఆయన వ్యతిరేక వర్గీయులు మూడు డెరైక్టర్ పోస్టులను కైవసం చేసుకునేందుకు పోటాపోటీగా రెండు ప్యానళ్లను రంగంలోకి దించుతున్నారు. ముగ్గు రు డెరైక్టర్లకు జానకిరామయ్య తన ప్యానల్‌ను ఇప్పటికే ప్రకటించగా, ఆయన వ్యతిరేక వర్గీయులు కూడా రెండు డెరైక్టర్ పోస్టులకు పోటీ చేస్తున్నారు.
జానకిరామయ్య ప్యానల్ నుంచి అద్దా వెంకట నగేష్, కాట్రగడ్డ వెంకటగురవయ్య, తిరుమల స్వర్ణకుమారి పోటీలో నిలిచారు. వ్యతిరేక వర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థులుగా వేమూరి సాయివెంకటరమణ, ఎ.శ్రీపద్మ పోటీచేస్తున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్‌లో మొత్తం 430 మంది సభ్యులు ముగ్గురు డెరైక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంది. విజయవాడ చిట్టినగర్‌లో ఉన్న పాల ఫ్యాక్టరీలో గురువారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం ఐదు గంటలకు ఓట్లు లెక్కిస్తారు.
కొనసాగుతున్న ఆధిపత్య పోరు
కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గం కోసం కొన్నేళ్లుగా టీడీపీలో రెండు వర్గాలు కుమ్ములాడుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఏటా ముగ్గురు పాలకవర్గ సభ్యులు పదవీ విరమణ చేస్తుంటారు. ఆ ఖాళీలను భర్తీ చేయటానికి ఎన్నికలు జరుగుతుంటాయి. ఐదారేళ్లుగా మండవ జానకిరామయ్య వ్యతిరేకవర్గం ఆయనను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని పోరాడుతోంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావును నియమించాలని రెండేళ్ల నుంచి జానకిరామయ్య వ్యతిరేకులు పావులు కదుపుతున్నారు.
ఒక దశలో పార్టీ అధినేత వద్ద జరిగిన పంచాయితీలో దాసరి బాలవర్ధనరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏడాది బాలవర్ధనరావు స్వయంగా రంగంలోకి దిగి డెరైక్టర్‌గా పోటీ చేశారు. మండవ జానకిరామయ్య కూడా తన వర్గాన్ని దాసరికి వ్యతిరేకంగా పోటీకి నిలబెట్టడంతో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. చివరకు చంద్రబాబు జోక్యంతో అప్పట్లో గొడవలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. ఆనాడు జరిగిన ఒప్పందం ప్రకారం మండవ జానకిరామయ్యను మార్చాలని పాలకవర్గంలో ఆయన వ్యతిరేక వర్గీయులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో జానకిరామయ్య జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు దగ్గరై మిల్క్ యూనియన్‌లో తన అధ్యక్ష పదవిని సుస్థిరం చేసుకున్నారు. అయినా మండవ వ్యతిరేకులు పట్టువదలకుండా మళ్లీ పోటీకి దిగారు.