
తాడిమర్రి మండలం పూర్తిగా వ్యవసాయాధారితం..75శాతం రైతులు మెట్ట ప్రాంతం, బోరుబావుల కింద ఆహారధాన్యాలు, వేరుశనగ పంట, పండ్లతోటలు సాగు చేస్తారు. మండలంలో భూగర్భజలం పెంపొందించడానికి 30 ఏళ్ల క్రితం నార్శింపల్లి, ఏకపాదంపల్లి కుంటకు, పుల్లంపల్లి, నిడిగల్లు, అగ్రహారం, తాడిమర్రి తూర్పు, పడమర చెరువులు నీటిని నింపేందుకు పీఏబీఆర్ కాలువ తవ్వారు. బత్తలపల్లి మండలంలోని అనంతసాగరం వద్ద నుంచి నార్శింపల్లికి, మాల్యవంతం సమీపంలో ఏకపాదంపల్లి కుంటకు, అనంతరం పూలఓబయ్యపల్లి సమీపంలో ఓ వైపు తాడిమర్రి పడమటి చెరువు దాని నుంచి తాడిమర్రి తూర్పు చెరువుకు, మరోవైపు పుల్లంపల్లి, నిడిగల్లు, శివంపల్లి సమీపంలో అగ్రహారం చెరువుకు, మేడిమాకులపల్లి కుంటకు నీరు చేరేలా తూములు ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లుగా జిల్లాలోని చెరువులను నింపడానికి పీఏబీఆర్ నీరు విడుదల చేస్తున్నా రెండు పర్యాయాలు మాత్రమే మండలంలోని నార్శింపల్లి, పుల్లానారాయణపల్లి, పుల్లంపల్లి, ఏకపాదంపల్లి గ్రామాలకు అరకొరగా నీరు చేరింది. అగ్రహారం, తాడిమర్రి పడమటి, తూర్పు చెరువులకు నీరు చేరలేదు. దీంతో ఆ చెరువుల కింద ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువుల కింద సుమారు 600 ఎకరాలు సాగుభూమి ఉంది. ఈ చెరువుల్లోకి నీరు వస్తే సుమారు 500 ఎకరాల్లో పంటలు సాగు చేయొచ్చు. నీరందక ఏటా ఆ చెరువుల కింద భూమిగల రైతులకు నిరాశ ఎదురవుతోంది.
వైఎస్సార్ హయాంలో కాలువకు నీరు
2008లో వైఎస్‌ఆర్ హయాంలో కాలువకు నీరు వచ్చింది. మొదట్లో తాడిమర్రి పడమటి చెరువుకు మినహా అన్ని చెరువులకూ ఆశాజనకంగా వచ్చాయి. అయితే 2009లో వైఎస్సార్ మరణంతో మండల చెరువులకు సక్రమంగా నీరు చేరడం లేదు. ఇక తాడిమర్రి తూర్పు చెరువుకు అప్పటి నుంచి చుక్కనీరు రాలేదు. ప్రజా ప్రతినిధులు మాత్రం అన్ని చెరువులకు నీటిని నింపుతామని హామీలు గుప్పిస్తున్నారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టింది లేదు.
ఏడాదైనా నీరు చేరానా? :
ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నీరు జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరడంతో రైతుల్లో ఆశలు చిగుస్తున్నాయి. ఈ ఏడాదైనా చెరువులకు నీరు చేరేనా అని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడేళ్లుగా మండలంలో వర్షాభావం నెలకొని భూగర్భ జలాలు అడుగంటాయి. వందలాది బోరుబావుల్లో నీటి మట్టం తగ్గిపోగా, వందలాది బోర్లు ఎండిపోయాయి. చెరువులు, వంకలు, వాగులు వట్టిపోయాయి. వేలాది ఎకరాలలో చీనీ, మామిడి, సపోటా తదితర పండ్ల తోటలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. అరకొరగా నీటి సౌకర్యం ఉన్న పండ్లతోటల సాగు రైతులు పీఏబీఆర్ నీటికోసం ఎదురు చూస్తున్నారు. పీఏబీఆర్ కాలువ ద్వారా వస్తున్న నీటిపై అధికారులు గస్తీ ఏర్పాటు చేయక పైప్రాంత రైతుల స్వార్థంతో జిల్లా సరిహద్దులో మారుమూల ఉన్న తాడిమర్రి మండలానికి ప్రతిసారీ అన్యాయం జరుగుతోంది.