పల్నాడులో తాగునీటి ఎద్దడికిదే నిదర్శనం
సాక్షి, అమరావతి బ్యూరో : పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పాదయాత్ర సమయంలో గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డితోపాటు, పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తాగునీటి సమ స్య పరిష్కారం కోసం రూ. 2,655 కోట్లతో ప్రభు త్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. పనులకు టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా తయారు చేసిన ప్రతిపాదనల్లో గ్రామీణ ప్రాంతాల్లో మనిషికి వంద లీటర్ల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 125 లీటర్ల చొప్పున తాగునీరు ఇచ్చే విధంగా అధికారులు అంచనా రూపొందించారు. ప్రభు త్వం ప్రాధాన్యతా క్రమంలో ఈ వాటర్ గ్రిడ్ పనులకు ఆమోదం తెలిపింది.
బుగ్గువాగు రిజర్వాయర్లకు..
బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి గురజాల నియోజకవర్గంతోపాటు, పెదకూరపాడులోని కొంత భాగానికి తాగునీటిని సరఫరా చేయనున్నారు. దీనికి సంబంధించి రూ.365 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. దీని పరిధిలో 78 ఆవాస ప్రాంతాలకు తాగునీరు ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,46,378 మందికి, పట్టణ ప్రాంతాల్లో 74,365 మందికి..మొత్తం 3,20,743 మందికి తాగునీరు ఇవ్వనున్నారు. ఇందుకోసం 0.4910 టీఎంసీల నీరు అవసరం కానుంది.
నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి..
నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, ప్రత్తిపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో కొంత భాగానికి తాగునీరు అందివ్వనున్నారు. దీని ద్వారా మొత్తం 35 మండలాల్లోని 904 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందనుంది. దీని కోసం రూ.2,300 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 19,41,030 మందికి, పట్టణ ప్రాంతాల్లో 2,84,777 మందికి.. మొత్తం 22,25,807 మందికి తాగునీరు అందనుంది. దీని కోసం 3.2947 టీఎంసీల నీరు అవసరమవుతోందని అధికారులు అంచనా వేశారు. మొత్తం బుగ్గువాగు, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల పరిధిలో 12 నియోజకవర్గాల్లోని 40 మండలాల్లో 982 ఆవాస ప్రాంతాల్లో తాగునీరు అందనుంది. దీని కోసం మొత్తం రూ. 2,665 కోట్ల పనులకు ప్రభుత్వంఅనుమతి ఇచ్చింది.దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 21,87,408 మందికి, పట్టణ ప్రాంతాల్లో 3,59,142 మందికి.. మొత్తం 25,46,550 మందికి పుష్కలంగా నీరు అందించనున్నారు. దీని కోసం మొత్తం 3.7857 టీఎంసీల నీరు అవసరం కానున్నట్లు అధికారులు తెలిపారు.
నీటిని ఇలా పంప్ చేస్తారు..
బుగ్గవాగు, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో కలి పి 8.95 కిలో మీటర్ల మేర పంపింగ్ చేయ నున్నారు. దీని పరిధిలో 45ఎంఎల్‌డీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఒకటి, మూడు 100 ఎంఎల్‌డీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉంటాయి. సంప్‌వెల్స్ మొత్తం 62 ఉండనున్నాయి. ఓహెచ్‌డీఆర్‌ఎస్‌లు 38, అడిషనల్ ఓహెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌లు 422 ఉండనున్నాయి. మొత్తం కెపాసిటీ ఆఫ్ పంప్‌సెట్స్ (హెచ్‌పీఎస్) 9,820 అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈప్రాజెక్టు పూర్తయితే పల్నాడు ప్రజలకు తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది.
త్వరలో టెండర్లు
పల్నాడు తాగునీటి మంచినీటి పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ప్రక్రియ సాగుతోంది. మొత్తం రూ. 2,665 కోట్లతో ఈ పనులకు అంచనాలు రూపొందించారు. నెలలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ప్రభుత్వం ఈ పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. – వీవీ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి ఎస్‌ఈ, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment