అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో రైతులు ఇబ్బంది పడకుండా ప్రతి ఎకరాకు డ్రిప్ (బిందు) సేద్యపు యూనిట్లు అందజేస్తామని చంద్రబాబునాయుడు గొప్పగా చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. సూక్ష్మ సాగు మంజూరులో అనంతపురం జిల్లాను పెలైట్‌గా తీసుకుని వంద శాతం ఫలితాలు సాధిస్తామని గతేడాది జిల్లా పర్యటనలో భాగంగా కదిరి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో జరిగిన బహిరంగసభల్లో ఆయన ప్రకటించారు. అందు కోసం ఎన్ని కోట్ల రూపాయలు అవసరమైనా వెనుకాడేదిలేదని చెప్పారు.
ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతులకు డ్రిప్ యూనిట్లు మంజూరు చేయడానికి వీలుగా నిబంధనలు సులభతరం చేయడమే కాకుండా రాయితీలు, పరిమితులు సడలిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు హామీలకు జిల్లా రైతుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బిందు, తుంపర సేద్యంతో కష్టాలు తీరిపోయినట్లేనని ఆనందపడ్డారు. నెలల తరబడి అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా రాయితీలు కూడా అందజేస్తారని ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ నెలలు గడుస్తున్నా సీఎం ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చక పోవడంతో రైతులు పెదవి విరుస్తున్నారు.
‘మీ-సేవ’లో వెల్లువెత్తిన దరఖాస్తులు
బిందు సేద్యపు పరికరాల కోసం ‘మీ-సేవ’లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీనియార్టీ ప్రకారం మంజూరు చేస్తామని ప్రకటించడంతో రైతుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన మీ-సేవ కేంద్రాల్లో డ్రిప్ దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడం ప్రారంభం కావడంతో రైతులు క్యూ కట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 65 వేల హెక్టార్లకు డ్రిప్ కోసం రైతులు దరఖాస్తు చేసుకోగా,, తక్కిన 12 జిల్లాలన్నీ కలిపితే అంతే సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
అంటే జిల్లాలో డ్రిప్ అవసరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2003 నుంచి ఇప్పటివరకు 1.75 లక్షల హెక్టార్లకు సరిపడా డ్రిప్, స్ప్రింక్లర్లు రాయితీతో అందజేశారు. అందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అడిగిన ప్రతి రైతుకూ సూక్ష్మ సాగు పరికరాలు అందజేయడంతో డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యం అంచెలంచెలుగా విస్తరించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్ష హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో పండ్ల తోటలు విస్తరించాయి. వాటితో పాటు కూరగాయలు, పూల తోటలు, ఔషధ పంటలతో పాటు ఇతర పంటలకు కూడా ఈ తరహా సేద్యం ప్రారంభించారు. రెండు మూడు సంవత్సరాలుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అందులోనూ ఈ ఏడాది సాధారణం కన్నా 46 శాతం తక్కువ వర్షాలతో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు 21 మీటర్లకు పైబడి లోతుకు పడిపోయి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బోర్ల నుంచి నీరు రావడం గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతులకు డ్రిప్ యూనిట్ల అవసరం మరీ ఎక్కువైంది.
వాటి కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 11 వేల హెక్టార్లకు మాత్రమే డ్రిప్ యూనిట్లు ఇస్తామని జిల్లాకు కేటాయింపులు చేయడం, అది కూడా చాలా ఆలస్యంగా గత డిసెంబర్‌లో అనుమతులు ఇవ్వడంతో మంజూరు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఇప్పటి వరకు 5 వేల హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు మంజూరు చేయడంలో ఏపీఎంఐపీ అధికారులు సక్సెస్ అయ్యారు. ఆసల్యంగా అనుమతులు ఇవ్వడం వల్ల మార్చి ఆఖరుకు 6 వేల హెక్టార్లకు మించి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
నీటి మూటలు!
Published Mon, Mar 2 2015 2:51 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement