చిక్కని చుక్క | water problem in machili patnam | Sakshi
Sakshi News home page

చిక్కని చుక్క

Published Mon, Mar 7 2016 2:59 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

చిక్కని చుక్క - Sakshi

చిక్కని చుక్క

గుక్కెడు నీరు కరువాయే
అడుగంటిన తాగునీటి చెరువులు
ట్యాంకర్లతో సరఫరా ఏదీ..
మళ్లీ నీటి విడుదల ఎప్పటికో..
తీరాన్ని వదలని తాగునీటి కష్టాలు

 
పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా తీరప్రాంతవాసుల పెదవులు తడారిపోతున్నాయి. సరైన ప్రణాళిక లేకుండా గత నెలలో ఐదు రోజులపాటు కాలువలకు నీరు విడుదల చేసినా శివారుకు చుక్క దక్కని దుర్భర పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాగునీటి చెరువులు ఎండిపోయాయి. తీర ప్రాంతంతో పాటు కృష్ణానదిలో నీరు అడుగంటడంతో పలు తాగునీటి పథకాలు పడకేసి ఏటిపట్టు గ్రామాల్లోనూ  దాహం కేకలు వినిపిస్తున్నాయి.


మచిలీపట్నం : ప్రస్తుతం జిల్లాలోని పరిస్థితి చూస్తుంటే వేసవి సమీపిస్తున్న కొద్దీ మంచినీటి ఎద్దడి అధికమయ్యేలా ఉంది. గ్రామాల్లోని సామూహిక రక్షిత మంచినీటి చెరువులు అడుగంటడంతో  ఎప్పుడు తాగునీటి సరఫరా నిలిచిపోతుందో తెలియని దుస్థితి. నందివాడ మండలం లక్ష్మీరసింహపురం తాగునీటి చెరువులో నీరు అడుగంటి పచ్చగా మారింది. నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లోని తాగునీటి చెరువు జనవరిలోనే ఎండిపోయింది. గుంటూరు జిల్లా రాజు కాలువ నుంచి కృష్ణానదిలో ఉన్న పైప్‌లైన్ ద్వారా ఈ చెరువుకు నీరు రావాల్సిఉంది. పాలకులు పట్టించుకోకపోవడంతో ఎదురుమొండి దీవుల్లోని చెరువులోకి చుక్కనీరు చేరలేదు. అక్కడి ప్రజలు  గ్రామం నుంచి  వలసపోయే దుస్థితి దాపురించింది. 

జిల్లాలో 374 తాగునీటి చెరువులుండగా అధిక శాతం చెరువుల్లో 20 నుంచి 35 శాతం మేర మాత్రమే నీరు నిల్వ ఉంది.  ఫిబ్రవరిలో కాలువలకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసినా తీరప్రాంతంలోని బందరు, కోడూరు, నాగాయలంక, బందరు, గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలతోపాటు కాలువ శివారున ఉన్న  నందివాడ, కైకలూరు నియోజకవర్గ పరిధిలోని పలు కొల్లేటిలంక గ్రామాల్లోని తాగునీటి చెరువులకు నీరు చేరలేదు.

 జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎక్కడెక్కడంటే..
బందరు మండలంలోని కోన, పల్లెతుమ్మలపాలెం, చిన్నాపురం, తుమ్మలచెరువు, వాడపాలెం, పెదయాదర గ్రామాల్లోని తాగునీటి చెరువులు ఎండిపోయాయి. ఇటీవల కాలువలకు నీరు విడుదల చేసినా ఆ నీరు తొమ్మిదవ ప్రధాన కాలువలకు రాలేదు. దీంతో చెరువులు నింపలేదు.  తరకటూరు సమ్మర్ స్టోరేజీ  ట్యాంకునీటి సామర్థ్యం 6 మీటర్లు కాగా ఇటీవల 2.50 మీటర్ల మేర మాత్రమే నీటిని నింపారు. ఈ చెరువు ద్వారా మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాల్లోని 4.50 లక్షల మందికి తాగునీరు అందించాల్సి ఉంది.  ఈ ట్యాంకులోని ప్రస్తుతం  ఒక మీటరుకు నీటిమట్టం చేరింది. మూడు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ముందుముందు వారానికి ఒకసారి సరఫరా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

పెడన మండలం ఉప్పలకలవగుంట మంచినీటి పథకం ద్వారా 17 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే చెరువును కొద్దిమేర నింపారు. కాకర్లమూడి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడక, జింజేరు, అర్తమూరు, చోడవరం, ముచ్చర్ల, నేలపాడు, దేవరపల్లి చెరువులకు నీరు చేరకపోవడంతో అడుగంటి తాగేందుకు పనికిరాకుండా ఉంది.

కోడూరు మండలంలోని ఉల్లిపాలెం,  నాగాయలకం మండలంలోని గుల్లలమోద, అవనిగడ్డ మండలంలోని రామచంద్రాపురం, చిరువోలులంక, టి.కొత్తపాలెం, కమ్మవారిపాలెంలోని తాగునీటి చెరువుల అడుగంటాయి. పది రోజులపాటు కూడా ఈ చెరువుల్లోని నీరు తాగునీటి అవసరాలను తీర్చలేని పరిస్థితి నెలకొంది.

కృత్తివెన్ను మండలంలోని కృత్తివెన్నుతో పాటు మరో 31 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు  సీతనపపల్లిలో నిర్మించిన తాగునీటి చెరువులో నీరు  పూర్తిస్థాయిలో అడుగంటింది.కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని 22 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కృష్ణానదిలో బత్తినపాడు, చౌటపల్లి తాగునీటి పైలట్ ప్రాజెక్టుల నుంచి మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కృష్ణానదిలో నీరు లేకపోవడంతో అమరావతి వైపు నుంచి నీటిని తీసుకువచ్చేందుకు నదిలో జేసీబీల ద్వారా కాలువ తవ్వినా నీరు అంతంతమాత్రంగానే వస్తోంది.  

  నందిగామ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు మునేరు, వైరా నదుల్లో ఏర్పాటు చేసిన తాగునీటి పైలట్ ప్రాజెక్టులు సక్రమంగా పనిచేయడం లేదు. మునేరు పైలట్ ప్రాజెక్టు బావిలో 20 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా నేడు ఏడున్నర అడుగులకు చేరింది.జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని పలు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే బులుసుపాడు తాగునీటి పైలట్ ప్రాజెక్టు మునేరువాగు నుంచి తాగునీటిని అందించాలి. మునేరులో నీరులేకపోవడంతో ఆముదాలపల్లి, తక్కెళ్లపాడు, గరికపాడు, రామచంద్రునిపేట గ్రామాలకు తాగునీరు అంతంతమాత్రంగానే అందుతోంది.కైకలూరు మండలంలోని కొల్లేటి గ్రామాల్లో తాగునీటి చెరువులు అడుగంటాయి. చేసేదిలేక ఈ గ్రామాల   ప్రజలు సమీపంలోని గ్రామాలకు వెళ్లి తాగునీరు   తెచ్చుకుంటున్నారు.

కాలువలకు నీరొచ్చేనా!
తాగునీటి చెరువులు నిండకపోవడంతో నాగార్జునసాగర్ నుంచి రెండున్నర టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం తీసుకువస్తామని ఇటీవల విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నీరు ఎప్పటికి విడుదల చేస్తారో తెలియడం లేదు. ఇక పశువులకు సైతం తాగేందుకు నీరులేకుండా పోయింది.  జెడ్పీ సమావేశంతో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి  కొల్లు రవీంద్ర అధికారులకు సూచించినా ఈ ప్రక్రియ అమల్లోకి రాలేదు. తాగునీటి పథకాలకు సంబంధించి 2015 మార్చి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.గత నెలలో 2015 మార్చి, ఏప్రిల్, మే నెలలకు సిబ్బంది జీతాలను విడుదల చేసి అధికారులు చేతులు  దులుపుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement