బోరుమంటున్నాయి..!
► నగరంలోని బోర్ల నిండా బురద నీళ్లే
► కానరాని నీటి ఎద్దడి నివారణ చర్యలు
► పట్టించుకోని అధికారులు, పాలకులు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగరంలో బోర్లు బోరుమంటున్నాయి. ఓ వైపు అధికారులు ప్రగతి మంత్రం జపిస్తున్నా తాగునీటి వనరులు మాత్రం వేసవిలో నగర జీవిని వెక్కిరిస్తూనే ఉ న్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కరపత్రాలు మొదలుకుని చేతి పంపుల వరకు అన్నింటిపైనా పసుపు రం గు పూస్తున్నారు. ప్రచారంలో ఇంత శ్రద్ధ చూపిస్తున్న పాలకులు అవే బోర్లు పాడైపోతే మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో చాలా చోట్ల బోర్ల నుంచి బుదర నీరే వస్తోంది. ఒక్క బక్కెట్టు నీరు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి. రెల్లవీధి, దంగల వీధి, బల గ, ఆదివారం పేట, గుజరాతీపేటలతో పాటు పలు కాలనీల్లోని బోర్లు ఇలాంటి నీరే ఇస్తున్నాయి.
గణాంకాల కోసం నగరంలో ఇన్ని బోర్లు వేశామ ని అధికార పక్ష నేతలు చెప్పుకుంటున్నా, అవి ప్రజలకు ఉపయోగపడడం లేదు. వేసవి కాలం రావడంతో ఎప్పటికప్పుడు కరెంటు కోతలు, మున్సిపల్ కుళాయిలు సరిగా రాకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ ఆపత్కాలంలో బోర్లే దిక్కుగా మారుతున్నాయి. అయితే బోర్లు కూడా బురద నీరే ఇ స్తుండడంతో ఇక తామేం చేయాలని స్థానికులు ప్ర శ్నిస్తున్నారు. ఈ కాలనీలో నివసించేవారంతా నిరుపేదలు. సొంత మోటార్లు, బావులు లేని వారు. వీరికి నగర పాలక సంస్థ కుళాయి నీరే ఆధారం. వాడుక నీటి కోసం బోర్లపై ఆధారపడతారు. 2016లో తీసిన బోర్ల నుంచి కూడా బురద నీరే వస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
చేతి పంపు నుంచి బురద నీరు వస్తోంది. ఈ విషయాన్ని నాయకులు, అధికారులకు చాలాసా ర్లు చెప్పాం. అయినా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు చొరవ చూపి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. ---కొర్లాపు వేణు, దంగళవీధి, శ్రీకాకుళం.
ఈ మధ్యకాలంలో కుళాయిల నీరు రాకపోతే స్నానాలు, తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది ప డ్డాం. కనీసం మా ప్రాంతంలో బావులు కూడా లేవు. చేతిపంపు నీళ్లే ఆధారమయ్యాయి.--- పి.సంతోష్, దంగళవీధి, శ్రీకాకుళం
నీళ్లు బురదగా వస్తుండడంతో బకెట్లలో వాటిని నిల్వ చేసుకుని బురదంతా కిందకు దిగాక వడబోసుకుని వాడుతున్నాం. ఇలా ఎంత కాలం వడపోసుకుని వాడుకోగలం. నగరంలో ఉన్నా ఏంటి ఈ దుస్థితి. అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలి.
--- ఎం.ఆదినారాయణ, రెల్లవీధి, శ్రీకాకుళం
మా దృష్టికి రాలేదు
చేతి పంపుల నుంచి బురద నీళ్లు వస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయో ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే మా ఇంజినీర్లను పంపించి అక్కడ సమస్యను తెలుసుకుంటాం.తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపడతాం.
---పి.ఎ శోభ, నగరపాలక కమిషనర్, శ్రీకాకుళం